ఆర్టీసీకి 130 కోట్లు విడుదల

 Rs 130 crores released to rtc - Sakshi

పాత బకాయిల చెల్లింపులకోసం..

ఇంకా ఖరారు కాని కేటాయింపులు

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం తీపికబురు మోసుకొచ్చింది. సంస్థకు పాత బకాయిల రూపంలో చెల్లించేందుకు రూ.130 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బకాయిలు దేనికి చెల్లించాలన్న విషయంపై స్పష్టత లేనప్పటికీ నిధుల విడుదలను అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి. ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ పేరిట వెలువడిన ఈ ఉత్తర్వులు వాస్తవానికి ఈనెల 16నే ఇచ్చారు. వీటిని బయటికి వెల్లడించకుండా సంస్థాగతంగానే ఉంచడంతో ఇంతకాలం బయటికి రాలేదు.

ఏ బకాయిలు చెల్లిస్తారో..
వాస్తవానికి ఆర్టీసీలో వివిధ అవసరాలకు భారీగా బకాయిలు పేరుకుపోయాయి. రిటైర్డ్‌ ఉద్యోగులకు, సీసీఎస్‌కు, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ ఇలా పలు విధాలుగా సంస్థ బకాయిలు పడింది. వీటిని చెల్లించాలని కొన్ని రోజులుగా కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. జూన్‌లో యూనియన్లకు మంత్రులకు మధ్య జరిగిన చర్చల అనంతరం బకాయిల క్లియరెన్స్‌కు రూ.80 కోట్లు చెల్లిస్తామని సీఎం ప్రకటించారు. తరువాత ఈ నిధులను లీవ్‌ఎన్‌క్యాష్‌మెంట్‌ రూపంలో చెల్లిస్తామని గుర్తింపు యూనియన్‌ నాయకులు ప్రకటించారు. అయినా ఇంతవరకూ ఎలాంటి చెల్లింపులు జరగలేదు.

మరోవైపు కో–ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ నుంచి ఆర్టీసీ దాదాపుగా రూ.260 కోట్లకుపైగా నిధులను వాడుకుంది. వీటి చెల్లింపులు చేయాలని కార్మికులు చాలాకాలంగా కోరుతున్నారు. మరోవైపు ఏడాది కాలంగా సంస్థలో వందలాది మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. వీరికి వివిధ రూపంలో చెల్లించాల్సిన బెనిఫిట్లు చెల్లించలేదు. వీటిని వెంటనే చెల్లించాలని నాగేశ్వరరావు (ఎన్‌ఎంయూ) రాజిరెడ్డి (ఈయూ), హన్మంతు (టీఎన్‌ఎంయూ) చాలాకాలంగా కోరుతున్నారు.

రూ.80 కోట్లు లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్, రూ.30 కోట్లు సీసీఎస్‌కు, మరో రూ.20 కోట్లు విశ్రాంత ఉద్యోగులకు చెల్లిస్తామని ఆర్టీసీ యాజమాన్యం హామీ ఇచ్చిందని తెలుస్తోంది. వెంటనే హామీని నిలబెట్టుకోవాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నట్టుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇచ్చిన రూ.130 కోట్లే కాకుండా మిగిలిన బకాయిలు కూడా త్వరలోనే తీసుకొస్తామని, గుర్తింపు సంఘం (టీఎంయూ) నాయకులు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top