మహమ్మారిలా  డెంగీ..

Round Table Conference About Dengue - Sakshi

ఇంతటి విస్త్రృతి ఎన్నడూ చూడలేదు.. పరిస్థితి భయానకం 

రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌లో సీనియర్‌ డాక్టర్ల ఆందోళన 

తక్షణమే నివారణ చర్యలు తీసుకోవాలని సర్కారుకు సూచన

సాక్షి, హైదరాబాద్‌: డెంగీ మహమ్మారిలా వ్యాప్తిచెందిందని పలువురు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలాది మందికి డెంగీ జ్వరాలు సోకుతున్నాయని, తీవ్రత అధికంగా ఉండటం వల్ల వైద్యులు, ఆసుపత్రులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇటువంటి పరిస్థితి మరెక్కడైనా నెలకొని ఉంటే పరిస్థితిపై రోజూ కొన్ని బులెటిన్లు విడుదల చేసే వారని, కానీ ఇక్కడ మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదని వాపోతు న్నారు. ప్రజలకు అవగాహన కల్పించడంలో, ఫాగింగ్‌ వంటి నివారణ చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. ‘డెంగీని ఎలా ఎదుర్కోవాలి’అనే అంశంపై గురువారం ఫ్లూచరిస్టిక్‌ సిటీస్‌ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న వైద్యులు పలు అభిప్రాయాలు వెల్లడించారు. పాఠశాలలు, కాలేజీల్లో డెంగీ వ్యాప్తిచెందకుండా ఉండేందుకు విద్యార్థులు గ్లౌవ్స్, ఫుల్‌ ప్యాంట్‌ మొదలైన వాటితో యూనిఫాం ధరించడానికి అనుమతించాలని సూచించారు.  

జూన్‌ నుంచి వ్యాప్తి విస్తృతం..: డాక్టర్‌ వసంతకుమార్, అపోలో ఆసుపత్రి 
‘డెంగీ ఉన్నట్లు అంగీకరించడం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన మొదటి పని. ఈ సంవత్సరం జూన్‌ నుంచి డెంగీ, చికున్‌ గున్యాలు విస్తృతంగా వ్యాపించాయి. ఏటా అనేక కేసులు వస్తున్నప్పటికీ గత 3 దశాబ్దాలుగా హైదరాబాద్‌లో ఇంతటి ఘోరమైన పరిస్థితి చూడలేదు.’  

గర్భిణులపై తీవ్ర ప్రభావం: డాక్టర్‌ విజయలక్షి్మ, సీనియర్‌ గైనకాలజిస్ట్‌ 
‘ప్రస్తుతం వస్తున్న కేసులు గతంలో ఇచి్చన మార్గదర్శకాలకు తగినట్లుగా లేవు. గర్భిణీలపై డెంగీ తీవ్ర ప్రభావం చూపుతుంది. రక్తస్రావం వల్ల తల్లీ బిడ్డలకు నష్టం జరుగుతుంది. డెంగీ పాజిటివ్‌ తల్లులకు ప్రసవించే శిశువులకు ఐసీయూలో చికిత్స, పర్యవేక్షణ తప్పనిసరి’

హోమియోపతి మద్దతు తీసుకోవాలి: డా.శ్రీనివాసరావు, కేంద్ర ఆయుష్‌  
‘హోమియోపతి ద్వారా స్వైన్‌ఫ్లూను నియంత్రించగలిగాం. డెంగీ నియంత్రణకు హోమియోపతి మద్దతు కూడా తీసుకోవాలి. అలాగే ప్రభుత్వం ఎపిడమిక్‌ సెల్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’ 

అందరమూ బాధ్యత వహించాలి: డా.విజయానంద్, చిల్డ్రెన్స్‌ స్పెషలిస్టు
‘డెంగీ మహమ్మారిలా వ్యాపించింది. దీనికి మనమంతా బాధ్యత వహించాలి. ప్రభుత్వం, కొందరు ప్రజలు డెంగీని అత్యంత క్యాజువల్‌గా తీసుకుంటున్నారు. ఇది మరింత నష్టాన్ని కలిగిస్తుంది. వర్షాకాలం ముందు నుంచే చర్యలు తీసుకోవాలి. ప్రజలను చైతన్యం చేయాలి. డెంగీ వస్తే ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసుకోవాలని బాధితులే కోరుతున్నారు. అవసరమా లేదా అనేది వైద్యుడు నిర్ణయించాలి. కానీ ప్రజల్లో భయాందోళనలు పెరగడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది’ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top