అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం; ఏడుగురి మృతి

Road Accident In Shamshabad Outer Ring Road On Friday Mid Night - Sakshi

సాక్షి, రంగారెడ్డి / శంషాబాద్‌ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం పెద్దగోల్కొండ శివారులో ఔటర్‌ రింగ్‌రోడ్డుపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కర్ణాటక రాష్ట్రం రాయచూర్, యాద్గిర్‌ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఏడు కుటుంబాలు తమ పిల్లలతో కలిసి సూర్యాపేటలో రహదారి పనులు చేయడానికి గత నెలలో వలస వచ్చాయి. లాక్‌డౌన్‌ కారణంగా అక్కడ పనులు నిలిచిపోవడంతో స్వస్థలాలకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. దీంతో వారిని ఇక్కడ పనికి కుదిర్చిన మేస్త్రీ.. కర్ణాటకకు చెందిన బొలేరో ట్రక్కును రప్పించాడు. శుక్రవారం రాత్రి 7 గంటలకు వీరంతా ట్రక్కులో బయల్దేరారు. పెద్దఅంబర్‌పేట జంక్షన్‌ నుంచి ఔటర్‌ మీదుగా వీరి వాహనం పెద్దగోల్కొండ శివారుకు అర్ధరాత్రి చేరుకుంది. ట్రక్కులో పది మంది చిన్నారులతో కలిపి 28 మంది ఉన్నారు. లోడ్‌ ఎక్కువగా ఉండడంతో పాటు వెనక టైర్‌లో గాలి తగ్గిపోవడంతో వాహనం వేగం ఒక్కసారిగా తగ్గింది. అదే సమయంలో నూజివీడు నుంచి మామిడికాయల లోడుతో వస్తున్న లారీ వేగంగా వీరి ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ట్రక్కు వెనక భాగంలో కూర్చున్న వారు రెండు వాహనాల మధ్య ఇరుక్కున్నారు. కొందరు ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఐదుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడ ఇద్దరు మృతి చెందారు.

మృతులు వీరే..
హుబ్లీ నివాసి బి.శెట్టి (45), రాయదుర్గం వాసులు రంగప్ప (32), శరణప్ప (30), శ్రీదేవి అలియాస్‌ సిరియమ్మ (8), కక్కెరకు చెందిన బసమ్మ(32), హనుమంతప్ప (2), అమ్రిశ్‌ (25). ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను ప్రత్యేక వాహనంలో స్వస్థలాలకు తరలించారు. కాగా, ప్రమాద బాధిత కుటుంబాలను పోలీసులు శంషాబాద్‌లోని ఓ ఫంక్షన్‌హాలులో    ఏర్పాటు చేసిన షెల్టర్‌కు తరలించారు. 8 మంది చిన్నారులు, ముగ్గురు పురుషులు, ఆరుగురు మహిళలు ఇందులో ఉన్నారు. వీరికి కన్నడ తప్ప మరేమీ రాకపోవడంతో వివరాలు సేకరించడానికి పోలీసులు ఇబ్బంది పడ్డారు. సాయంత్రం వీరిని ప్రత్యేక బస్సులో స్వస్థలాలకు పంపించారు. డీసీపీ ప్రకాష్‌రెడ్డి బాధిత కుటుంబాలతో మాట్లాడారు.

ఒకే కుటుంబంలో ముగ్గురు..
కర్ణాటక యాద్గిర్‌ జిల్లా కక్కెరకు చెందిన సోమన్న దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. పెద్ద కూతురు రేఖమ్మను ఇంటి వద్ద వదిలి భార్య బసమ్మ, ముగ్గురు పిల్లలతో పాటు తన తమ్ముడు బుడ్డప్ప, పూజమ్మ దంపతులు, మరో తమ్ముడు అమ్రేశ్‌తో కలిసి సూర్యాపేటకు ఉపాధి కోసం వచ్చారు. ఔటర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమన్న భార్య బసమ్మ, కొడుకు హన్మంతు, తమ్ముడు అమ్రేశ్‌ మృతి చెందారు. వీరితో పాటు పని కోసం వీరిని ఇక్కడకు రప్పించిన మేస్త్రీ కూడా చనిపోయాడు. ‘పనుల్లేకపోవడంతో అందరం ట్రక్కులో ఊరికి బయల్దేరాం. చిన్నపిల్లలు పెద్దల ఒడిలో నిద్రపోతున్నారు. అంతలో వెనక నుంచి లారీ వచ్చి ఢీకొట్టింది. గాయాలైన నా భార్య, కొడుకు, తమ్ముడు మరికొందరిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారికేం జరిగిందో తెలియడం లేదు. చనిపోయినట్లు చెబుతున్నారు. మేమంతా ఇక్కడ రాత్రి నుంచి మా వారి క్షేమం కోసం దేవున్ని వేడుకుంటున్నాం’అని సోమన్న అనే బాధితుడు రోదిస్తూ చెప్పాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top