సాగర్ హైవే రక్తసిక్తం | road accident in sagar highway | Sakshi
Sakshi News home page

సాగర్ హైవే రక్తసిక్తం

May 26 2016 1:35 AM | Updated on Aug 30 2018 4:07 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్నాయి.. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి..

నల్లగొండ జిల్లా దేవ్లాతండాలో ఘోర ప్రమాదం
 
ఆటోను ఢీకొట్టిన స్కార్పియో... ఇద్దరు దుర్మరణం
 24 మందికి తీవ్రగాయాలు
 9 మంది పరిస్థితి విషమం
 
 చింతపల్లి: ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్నాయి.. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.. వారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అక్కడే ఉన్న తండావాసులు ముందుకొచ్చారు.. అప్పటికప్పుడు ఆటోలో వారిని తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.. ఇంతలో ఓ స్కార్పియో వాహనం మృత్యువులా వచ్చింది.. ఆటో సహా అక్కడున్నవారిపైకి దూసుకెళ్లింది.. ఆటో డ్రైవర్‌తోపాటు బైక్ ప్రమాదంలో బయటపడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో 24 మంది గాయపడ్డారు. వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. బుధవారం రాత్రి నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరు పంచాయతీ దేవ్లాతండా వద్ద హైదరాబాద్-సాగర్ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
 
 మొదటి యాక్సిడెంట్‌లో బయటపడి..
 మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల మండలం పల్లెతండాకు చెందిన నేనావత్ మాన్యానాయక్ తన మోటార్ సైకిల్‌పై వింజమూరు నుంచి కుర్మేడ్  వెళ్తున్నాడు. ఇదే సమయంలో దేవరకొండకు చెందిన రాములు మరో మోటార్ సైకిల్‌పై దేవరకొండ వైపు వెళ్తున్నాడు. వింజమూరు దేవ్లాతండా వద్దకు రాగానే ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఇందులో వారిద్దరికీ గాయాలయ్యాయి.
 
 ప్రమాదాన్ని చూసిన తండావాసులు వారిని ఆటోలో ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న మహేంద్రా స్కార్పియో వాహనం రోడ్డు పక్కనే ఉన్న తండావాసులపైకి దూసుకెళ్లింది. దీంతో మాన్యానాయక్ (35), దేవ్లాతండాకు చెందిన ఆటో డ్రైవర్ వాంకుణావత్ భీముడు (30) అక్కడికక్కడే మృతి చెందారు. అదే తండాకు చెందిన 24 మంది గాయపడ్డారు. వీరిని తొలుత దేవరకొండ ఆస్పత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మోటార్ సైకిళ్లతోపాటు ఆటో, ప్రమాదానికి కారణమైన మహేంద్ర స్కార్పియో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. స్కార్పియో డ్రైవర్ పరారయ్యాడు.

Advertisement
 
Advertisement
Advertisement