మెడికల్‌ కాలేజీల్లో అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు

Reservations For Upper Caste Weaker Sections  In Telangana Medical Colleges - Sakshi

ఒకట్రెండు రోజుల్లో మార్గదర్శకాలు... వైద్యవర్గాల వెల్లడి

ఈ ఏడాది నుంచే ఎంబీబీఎస్‌ సీట్లలో 10 శాతం కోటా  

ఆదాయ పరిమితి రూ.8 లక్షలు నిర్ణయించే అవకాశం

ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చాక సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ 

అగ్రవర్ణ పేదలకు ప్రత్యేకంగా 300కుపైగా ఎంబీబీఎస్‌ సీట్లు 

సాక్షి, హైదరాబాద్‌ : అగ్రకులాల్లోని పేదల(ఈడబ్ల్యూఎస్‌)కు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది. 2019–20 వైద్య విద్యాసంవత్సరం నుంచే ఈ రిజర్వేషన్లు వర్తింపజేసేందుకు చర్యలు చేపట్టింది. అందుకు అవసరమైన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచే తప్పనిసరిగా ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో 250 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయని, అది గరిష్ట పరిమితి వరకు ఉండటంతో అక్కడ మాత్రం ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు కాదని ఆ శాఖ అధికారులు అంటున్నారు. మిగిలిన అన్ని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోనూ ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలవుతాయని చెబుతున్నారు. నూతనంగా విడుదల చేసే మార్గదర్శకాల్లో ఏడాదికి రూ. 8 లక్షలలోపు ఆదాయపు పరిమితి నిర్ణయించే అవకాశం ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇదే ఆదాయపు పరిమితి విధించిందని, రాష్ట్రంలోనూ పరిమితి నిర్ణయించే అవకాశముందని అంటున్నారు. ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణ పత్రాలను ఎలా ఇవ్వాలి.. ఎవరు ఇవ్వాలి.. అనే అంశాలపైనా మార్గదర్శకాల్లో సర్కారు స్పష్టత ఇచ్చే అవకాశముందని తెలిపారు. దీని ప్రకారం తెలంగాణలో ఎంతమంది అర్హులనేది కూడా స్పష్టత రానుంది.  

ఉత్తర్వులు వచ్చాకే ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌...  
ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేశాక ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఈ వారంలో నీట్‌ ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రాష్ట్రస్థాయి ర్యాంకులు వెల్లడికాలేదు. అవి రావడానికి మరో నాలుగైదు రోజుల సమయం పడుతుంది. ర్యాంకులు, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై మార్గదర్శకాలు వచ్చాక ఈ నెల 20వ తేదీ నాటికి అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని విశ్వవిద్యాలయం భావిస్తోంది. అయితే నోటిఫికేషన్‌ విడుదల చేయడానికి ఇంకా ఏడెనిమిది రోజులే ఉంది. ఈలోగా రాష్ట్రస్థాయి ర్యాంకులు రావడం, ఆ రిజర్వేషన్ల మార్గదర్శకాలు విడుదలైన తర్వాత ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సంపాదించుకోవడం కష్టమైన వ్యవహారమే. అవసరమైతే నాలుగైదు రోజులు సమయం తీసుకొనైనా రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే సర్కారు ఆలోచనగా ఉంది.  

ఈడబ్ల్యూఎస్‌ కోసం 300కు పైగా ఎంబీబీఎస్‌ సీట్లు... 
ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు 10 శాతం సీట్లను కేటాయిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం అమలు చేయాలంటే ఆచరణలో 25 శాతం సీట్లను పెంచాల్సి ఉంటుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎంసీఐ మార్గదర్శకాల ప్రకారం ఎంబీబీఎస్‌ ప్రవేశాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలతోపాటు ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు కూడా రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంది. ప్రస్తుత రిజర్వేషన్ల స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తింపజేయాలంటే 25 శాతం సీట్లను పెంచాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రకారం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఎంబీబీఎస్‌ సీట్లకు అదనంగా 25 శాతం పెంచాల్సి ఉంటుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని పరిగణనలోకి తీసుకొని రాష్ట్రంలోనూ అందుకు అనుగుణంగా ఉత్తర్వులు రానున్నాయి. నీట్‌లో అర్హత సాధించిన అగ్రవర్ణ పేద విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్‌ ఎంతో ప్రయోజనం కలగనుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య భారీగా పెరగగా, ఈఎస్‌ఐతో కలుపుకొని 25 శాతం పెంపుదల ప్రకారం మరో 312 ఎంబీబీఎస్‌ సీట్లు పెరిగే అవకాశముందని విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top