ఫ్లెక్సీలు పెట్టినందుకు ఫైన్‌ వేయండి | Sakshi
Sakshi News home page

ఫ్లెక్సీలు పెట్టినందుకు ఫైన్‌ వేయండి

Published Fri, Oct 13 2017 6:56 PM

Remove flexis immediately twitts ktr - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై ఫైన్లు వేయాలని రాష్ట్ర పురపాల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ శృతి ఓజాకు ట్వీటర్‌లో సూచించారు. టాస్క్‌ రీజినల్‌ సెంటర్‌ ప్రారంభోత్సవం, సీఎం కేసీఆర్‌ పర్యటన ఏర్పాట్ల కోసం శనివారం వరంగల్‌ నగరానికి మంత్రి కేటీఆర్‌ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, మేయర్‌ పేరుతో నగరంలో విరివిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల కారణంగా ఏర్పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గతేడాది రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వాటి ఏర్పాటును మంత్రి కేటీఆర్‌ నిషేధించారు. అదే మంత్రి పర్యటన సందర్భంగా ఆ పార్టీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై వికాస్‌ డేనియల్‌ అనే యువకుడు ట్వీటర్‌ ద్వారా నేరుగా కేటీఆర్‌ను ప్రశ్నించాడు.

శుక్రవారం మధ్యాహ్నం 3:26 గంటల సమయంలో ‘కేటీఆర్‌ సార్‌.. రేపు మీ పర్యటన సందర్భంగా వరంగల్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల రద్దు నియమం అధికార పార్టీకి వర్తించదా?’ అని అడిగాడు. ఆ తర్వాత ట్వీట్లలో ‘ప్రధాన రహదారిపై 500 ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమ పేరుకు ప్రచారం కల్పించుకోవడం కోసం నాయకులు డబ్బు వృథా చేస్తున్నారు. మీరే ఫెక్ల్సీలపై బ్యాన్‌ విధించి, మీ పర్యటన సందర్భంగానే మళ్లీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఎంత వరకు కరెక్ట్‌ సార్‌?’ అంటూ ప్రశ్నించాడు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్‌ సాయంత్రం 5 గంటలకు వికాస్‌ డేనియల్‌ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని, వాటిని పెట్టిన వారికి పెనాల్టీ విధించాలని వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌కు ట్వీటర్‌ ద్వారా సూచించారు.

కేటీఆర్‌ స్ఫూర్తినిచ్చారు: వికాస్‌ డేనియల్‌
ఫ్లెక్సీలు తొలగించాలంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌పై వికాస్‌ డేనియల్‌ సాయంత్రం 7:45 గంటల సమయంలో తిరిగి స్పందించారు. ‘త్వరగా స్పందించినందుకు థ్యాంక్స్‌ సార్, మీరు నిజమైన స్ఫూర్తి ఇచ్చారు’ అని ట్వీట్‌ చేశాడు. కేటీఆర్‌కు చెడ్డపేరు తెచ్చేందుకు తాను ట్వీట్‌ పెట్టలేదని, వాస్తవాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకే ట్వీట్‌ చేసినట్లు తెలిపారు.

పేపర్‌ ఫ్లెక్సీలు పెట్టాం: ఎమ్మెల్యే వినయ్‌
మంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా తాము ఏర్పాటు చేసినవి పేపర్‌తో తయారుచేసిన ఫ్లెక్సీలని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ తెలిపారు. అలాగే, మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు ఫ్లెక్సీలను తొలగిస్తామని మేయర్‌ నన్నపునేని నరేందర్‌ తెలిపారు. 

Advertisement
Advertisement