పెట్టుబడులకు స్వాగతం | Regional cafe: Telangana lays an innovative growth path | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు స్వాగతం

Jun 12 2015 2:07 AM | Updated on Aug 14 2018 10:51 AM

పెట్టుబడులకు స్వాగతం - Sakshi

పెట్టుబడులకు స్వాగతం

ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించేలా రూపొందించిన నూతన పారిశ్రామిక విధానాన్ని (టీఎస్ ఐపాస్) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రారంభించనున్నారు.

నేడే టీఎస్ ఐపాస్ మార్గదర్శకాలు విడుదల
* నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
* 2 వేల మంది ప్రతినిధుల సమక్షంలో మార్గదర్శకాల ఆవిష్కరణ

సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించేలా రూపొందించిన నూతన పారిశ్రామిక విధానాన్ని (టీఎస్ ఐపాస్) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రారంభించనున్నారు.

హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో జరిగే ఈ సమావేశానికి ప్రపంచం నలుమూలల నుంచి 2 వేలమందికిపైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. వివిధ దేశాల రాయబారులు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీల చైర్మన్లు, సీఈవోల సమక్షంలో టీఎస్ ఐపాస్ మార్గదర్శకాలను సీఎం ఆవిష్కరించనున్నారు. మేక్ ఇన్ తెలంగాణ పేరిట రూపొందించిన ప్రత్యేక లోగో, ఇన్ఫోసిస్ సహకారంతో అభివృద్ధి చేసిన టీఎస్ ఐపాస్ వెబ్‌సైట్‌ను కూడా సీఎం ఆవిష్కరిస్తారు.
 
ప్రతిష్టాత్మకంగా టీఎస్ ఐపాస్ ఆవిష్కరణ
రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా చూపేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం మార్గదర్శకాల విడుదల కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. హెచ్‌ఐసీసీలో 40 వేల చదరపు అడుగుల వైశాల్యంలో వంద మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, ప్రపంచం నలుమూలల నంచి తరలివస్తున్న ఆహ్వానితులు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రభుత్వరంగ సంస్థల అధిపతులు, బిజినెస్ స్కూళ్ల నిర్వాహకులు, ఫిక్కీ, ఫ్యాప్సీ, క్రెడాయ్, ఐటీ, ఫార్మా, టెక్స్‌టైల్, ఆటోమొబైల్ రంగాల ప్రముఖులు, వివిధ జిల్లాల్లోని పరిశ్రమల యజమానులు హాజరవుతున్నారు. అతిథులకు ఎయిర్‌పోర్టులోనే స్వాగతం పలికి హెచ్‌ఐసీసీకి తోడ్కొనివచ్చేలా వలంటీర్ల బృందాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రత్యేకతను చాటేలా ఎయిర్‌పోర్టు, సచివాలయం నుంచి హెచ్‌ఐసీసీ వరకు హోర్డింగులు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.
 
భారీ పరిశ్రమలకు పక్షంలో అనుమతులు...
నూతన పారిశ్రామిక విధానం (టీఎస్ ఐపాస్ చట్టం)ను రాష్ట్ర అసెంబ్లీ గత ఏడాది నవంబర్ 27న ఏకగ్రీవంగా ఆమోదించింది. ‘తెలంగాణ సింగిల్ విండో వితౌట్ గ్రిల్స్’ నినాదంతో రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించే వారికి అనువైన వాతావరణం కల్పించేలా టీఎస్ ఐపాస్‌ను రూపొందించారు. రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ)కు ఇప్పటికే 1.65 లక్షల ఎకరాల భూమిని పారిశ్రామిక అవసరాలకు ప్రభుత్వం కేటాయించింది.

టీఎస్‌ఐఐసీ ఆధీనంలోని భూముల్లో విద్యుత్, నీరు, రహదారులు వంటి మౌలిక సౌకర్యాలను కల్పిస్తారు. వాటర్‌గ్రిడ్ ద్వారా 10 శాతం నీటిని పారిశ్రామిక అవసరాలకు కేటాయిస్తారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేవారితో సీఎం కార్యాలయంలోని చేజింగ్ సెల్ దరఖాస్తుదారులతో ముఖాముఖి జరుపుతుంది.

మెగా పరిశ్రమలకు 15 రోజుల్లో, ఇతర పరిశ్రమలకు నెల రోజుల్లో అనుమతులు జారీ చేస్తారు. చట్టంలోని నిబంధనలు అంగీకరిస్తూ దరఖాస్తుదారులు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇవ్వడం నూతన విధానం ప్రత్యేకతగా పేర్కొంటున్నారు. నిర్ణీత వ్యవధిలోగా అనుమతులు ఇవ్వకున్నా, చట్టంలోని నిబంధనలు పాటించకున్నా అపరాధరుసుము విధించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement