ఎర్ర చందనం దుంగలు పట్టివేత | Sakshi
Sakshi News home page

ఎర్ర చందనం దుంగలు పట్టివేత

Published Sun, Dec 14 2014 12:23 AM

ఎర్ర చందనం దుంగలు పట్టివేత - Sakshi

ఇబ్రహీంపట్నానికి చెందిన ఇద్దరి అరెస్టు

ఇబ్రహీంపట్నం: అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన 20 ఎర్ర చందనం దుంగలను ఇబ్రహీంపట్నం పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈఘటనలో ఇబ్రహీంపట్నంకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. ఇబ్రహీంపట్నం సీఐ మహమ్మద్‌గౌస్ తెలిపిన వివరాల మేరకు.. ఇబ్రహీంపట్నం చెరువు వద్ద శనివారం ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండటాన్ని ఐడీ పార్టీ పోలీసులు గుర్తించారు. వెంటనే వారు చెరువు పరిసరాలను పరిశీలించగా అక్కడ 20 ఎర్ర చందనం దుంగలు లభించాయి.

వీటిని తరలించడానికి సయ్యద్‌సుల్తాన్(30), విజయ్‌కుమార్(29)లు చెరువు పరిసరాల్లో తచ్చాడుతున్నట్లు గుర్తించిన పోలీసులు వారిద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు రెండు నెలల క్రితమే వీటిని చెరువులోకి తరలించినట్లు సమాచారం. పట్టుబడిన ఎర్ర చందనం దుంగలను ఎక్కడి నుంచి తెచ్చారు, స్థానికంగా ఈ వ్యవహారం ఎన్నాళ్లుగా కొనసాగుతోంది, వీటి వెనుక ప్రధాన సూత్రధారులెవరైనా ఉన్నారా తదితర కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పట్టుబడిన ఎర్ర చందనం విలువ రూ.లక్ష వరకు, వీటిని అటవీశాఖ అధికారులకు అప్పగించామని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement