మున్సిపల్‌ ఎన్నికల్లో రెబల్‌ ‘సింహం’!

Rebels Contesting For Municipal Elections In Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌: జాతీయ నాయకుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ స్థాపించిన ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ 1939లో కాంగ్రెస్‌లో విలీనమైంది. కాగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆయన సోదరుడు శరత్‌ చంద్రబోస్, చిత్త బసులు పశ్చిమబెంగాల్‌లో ఈ పార్టీని ఏర్పాటు చేసి, వామపక్ష సిద్ధాంతాలతో ముందుకు తీసుకెళ్లారు. పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష కూటమి ప్రభుత్వంలో ఫార్వర్డ్‌ బ్లాక్‌ కీలకంగా వ్యవహరించింది. ఈ పార్టీ ఎన్నికల గుర్తు సింహం. ఈ గుర్తుకు ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ లేని డిమాండ్‌ వచ్చిపడింది. 

1996 పార్లమెంటు ఎన్నికల్లో లక్ష్మీపార్వతి నేతృత్వంలోని ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ ఈ సింహం గుర్తు మీదే పోటీ చేయగా, పాతపట్నం నియోజకవర్గం నుంచి లక్ష్మీపార్వతి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత 2018లో రామగుండం నుంచి మళ్లీ కోరుకంటి చందర్‌ కూడా ఇదే గుర్తు మీద పోటీ చేసి విజయం సాధించారు. చందర్‌ విజయంతో సింహానికి మరింత క్రేజీ వచ్చింది.

కరీంనగర్‌కు చెందిన బండ సురేందర్‌రెడ్డి ఈ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ అధికార పార్టీ నుంచి టికెట్లు రాని నాయకులతో సింహగర్జన చేయిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ టికెట్టు ఆశించి భంగపడ్డ వందలాది మంది అభ్యర్థులు రాష్ట్రంలోని పలు మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఏఐఎఫ్‌బీ నుంచి అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. 

రామగుండంలో విజయంతో రాష్ట్రంలో డిమాండ్‌
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం టీఆర్‌ఎస్‌ టికెట్టు ఆశించి భంగపడ్డ కోరుకంటి చందర్‌ ‘సింహం’ గుర్తు మీద పోటీ చేశారు. మొదటిసారి ఓటమి చెందిననప్పటికీ, రెండోసారి ఘన విజయం సాధించారు. భూపాలపల్లి నుంచి పోటీ చేసిన గండ్ర సత్యనారాయణరావు స్వల్ప తేడాతో ఓడిపోయారు. దీంతో సింహం గుర్తు కరీంనగర్, వరంగల్‌ జిల్లాల్లో పాపులర్‌ అయింది. ఇదే ఊపుతో ఆ పార్టీ అధ్యక్షుడు జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపారు.

పలు చోట్ల పోటీ చేసినప్పటికీ భూపాలపల్లి జిల్లా పరిధిలోని ఘనపురం, రంగారెడ్డి జిల్లా పరిధిలోని తలకొండపల్లిలో ఈ సింహం గుర్తు అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో పార్టీ సింబల్‌కు ఎక్కడ లేని డిమాండ్‌ పెరిగింది. ఈసారి టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్టు ఆశించి నామినేషన్లు దాఖలు చేసిన వారిలో అధిక శాతం ముందస్తు జాగ్రత్తగా ఫార్వర్డ్‌బ్లాక్‌ నుంచి కూడా మరో సెట్‌ వేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 

కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా తరువాత పాలమూరు, వరంగల్‌ 
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ సింహం గుర్తుమీదే గెలవడంతో కోల్‌బెల్ట్‌ ఏరియాలో ఈ గుర్తుకు బహుళ ప్రాచుర్యం లభించించింది. దీంతో ఈసారి రామగుండం కార్పొరేషన్‌లోని 50 డివిజన్‌లలో 45 చోట్ల ఫార్వర్డ్‌బ్లాక్‌ నుంచి అభ్యర్థులు బరిలో నిలిచారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 24 మందికి బీఫారాలు ఇచ్చినట్లు ఆ పార్టీ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్, అమన్‌గల్, ఐజ, ఆలంపూర్‌ మునిసిపాలిటీల్లో జెడ్‌పీటీసీ వెంకటేశ్‌ ఆధ్వర్యంలో అభ్యర్థులను బరిలో నిలుపుతున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మొదలుకొని నిజామాబాద్, కోరుట్ల, రాయికల్, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ వంటి మునిసిపాలిటీల్లో కూడా అభ్యర్థులను నిలిపారు. 

అన్ని జిల్లాలకు విస్తరిస్తాం 
ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తాం. మా పార్టీ నుంచే రామగుండం ఎమ్మెల్యేగా కోరుకంటి చందర్‌ గెలిచారు. జెడ్‌పీటీసీ ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచి సత్తా చాటాం. గెలిచిన వాళ్లు మాతోనే ఉన్నారు. ఈసారి మునిసిపాలిటీల్లో విజయాన్ని సాధించడం ద్వారా ఫార్వర్డ్‌బ్లాక్‌ను రాష్ట్రంలో విస్తరిస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి క్రియాశీలక శక్తిగా ఎదుగుతాం. 
– బండ సురేందర్‌రెడ్డి, ఏఐఎఫ్‌బీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top