కాంగ్రెస్‌.. రె‘బెల్స్‌’ 

Rebels Candidates In Congress Party Siddipet - Sakshi

తిరుగుబాటు జెండా

ఆరు స్థానాల్లో 21 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులు

అత్యధికంగా సిద్దిపేటలో ఏడుగురు నామినేషన్‌

నేడు మరికొంత మంది ఆశావహుల దాఖలు?

సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు తెరపడనుంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటుపై కొలిక్కి రావడం లేదు. టీజేఎస్‌ మూడు, టీడీపీ, సీపీఐ చెరో స్థానంలో పోటీ చేస్తామని ప్రకటిస్తున్నా, అభ్యర్థుల ప్రకటనపై కూటమి భాగస్వామ్య పక్షాల్లో గందరగోళం కనిపిస్తోంది. తాము పోటీ చేసే మూడు స్థానాలకు టీజేఎస్‌ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. హుస్నాబాద్‌ స్థానాన్ని ఆశిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తరఫున ఇప్పటికే నామినేషన్‌ దాఖలైంది. పటాన్‌చెరు స్థానం టీడీపీకి కేటాయిస్తారనే వార్తపై స్పష్టత లోపించింది. ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో అభ్యర్థులను ప్రకటించని ఆరు స్థానాల్లో కాంగ్రెస్‌ పక్షాన పోటా పోటీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఆరు స్థానాల్లో కూటమి భాగస్వామ్య పక్షాలకు దక్కేవెన్ని, కాంగ్రెస్‌ పోటీ చేసే పక్షంలో అభ్యర్థి ఎవరనే అంశంపై చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.   

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:  ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని పదకొండు అసెంబ్లీ స్థానాలకు గాను, ఐదు చోట్ల కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లపై తొలి జాబితాలోనే స్పష్టత వచ్చింది. సోమవారం నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుండగా, మిగతా ఆరు చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికపై స్పష్టత లోపించింది. అభ్యర్థులను ప్రకటించని ఆరు స్థానాల్లో కనీసం ఐదు స్థానాలు మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాల ఖాతాలోకి పోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పటికే  మెదక్, దుబ్బాక, సిద్దిపేట స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూటమి భాగస్వామ్య పక్షం టీజేఎస్‌ విడుదల చేసింది. హుస్నాబాద్‌ స్థానాన్ని ఆశిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తరఫున ఇప్పటికే  నామినేషన్‌ దాఖలు కాగా, సోమవారం స్వయంగా నామినేషన్‌ పత్రాలు సమర్పించేందుకు సిద్ధం అవుతున్నారు.

పటాన్‌చెరు అసెంబ్లీ స్థానం టీడీపీ ఖాతాలోకి వెళ్తుందనే వార్తలు వస్తున్నా, పార్టీ టికెట్‌ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు గడీల శ్రీకాంత్‌గౌడ్‌ ఇప్పటి వరకు నామినేషన్‌ పత్రాలు సమర్పించలేదు. నారాయణఖేడ్‌ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ పోటీ చేయడంలో ఎలాంటి అనుమానాలు లేకున్నా, మాజీ ఎంపీ సురేశ్‌ షెట్కార్, ఎంపీపీ సంజీవరెడ్డి నడుమ టికెట్‌ పంచాయతీ తేలడం లేదు.

ఆరు నియోజకవర్గాల్లో 21 మంది
అభ్యర్థులను ప్రకటించని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గడిచిన వారం రోజులుగా 21 మంది అభ్యర్థులు కాంగ్రెస్‌ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా సిద్దిపేటలో ఏడు, పటాన్‌చెరులో ఆరు, మెదక్‌లో ఐదుగురు అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు సోమవారం మరికొన్ని నామినేషన్లు కూడా కాంగ్రెస్‌ పక్షాన దాఖలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నారాయణఖేడ్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఎంపీపీ సంజీవరెడ్డి తరఫున ఇప్పటికే నామినేషన్‌ సమర్పించగా, మాజీ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ సోమవారం పత్రాలు సమర్పించే అవకాశం ఉంది.

సిద్దిపేట టీజేఎస్‌ పార్టీ అభ్యర్థిగా భవానీ రెడ్డి అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారు కాగా, కాంగ్రెస్‌ నుంచి తాడూరు శ్రీనివాస్‌గౌడ్, ప్రభాకర్‌ వర్మ, దేవులపల్లి యాదగిరి, దరిపల్లి చంద్రం, మర్కంటి శ్రీనివాస్, పూజల హరికృష్ణ, వహీద్‌ఖాన్‌ నామినేషన్‌ వేశారు. వీరిలో కొందరు స్వతంత్రులుగా నామినేషన్‌ సమర్పించారు.

పటాన్‌చెరులో సపాన్‌దేవ్, గాలి అనిల్‌కుమార్, కాటా శ్రీనివాస్‌గౌడ్, శంకర్‌ యాదవ్, శశికâ¶ళ, కొలన్‌ బాల్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేసిన కాంగ్రెస్‌ నేతల జాబితాలో ఉన్నారు. 

టీజేఎస్‌కు కేటాయించినట్లుగా చెప్తున్న మెదక్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే శశిధర్‌ రెడ్డి, బట్టి జగపతి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, సుప్రభాతరావు, మ్యాడం బాలకృష్ణ నామినేషన్‌ వేశారు. 

హుస్నాబాద్‌లో అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, దుబ్బాకలో మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. తనకు టికెట్‌ దక్కదనే అభిప్రాయానికి వచ్చిన ముత్యంరెడ్డి ఈ నెల 20న సిద్దిపేటలో జరిగే బహిరంగ సభ వేదికగా సీఎం కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.

దుబ్బాక నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్న మద్దుల నాగేశ్వర్‌ రెడ్డి నామినేషన్‌ వేయకున్నా, చివరి నిమిషంలో తనకు అవకాశం దక్కుతుందనే ఆశతో హైదరాబాద్‌లో ప్రయత్నాలు సాగిస్తున్నారు. హుస్నాబాద్‌లో ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించిన ప్రవీణ్‌రెడ్డి రెండు రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేసి టికెట్‌ వేట సాగిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top