అన్నదాతకు ఆసరా.. | Sakshi
Sakshi News home page

అన్నదాతకు ఆసరా..

Published Mon, Mar 4 2019 7:31 AM

RBI Support To The Farmers For Loan Limit - Sakshi

కాజీపేట: పంటల సాగు కోసం అన్నదాతలకు బ్యాంకుల ద్వారా ఇచ్చే రుణ పరిమితి పెరగనుం ది. భూమి ఐదెకరాల పైన ఉన్న రైతులకు ఉపయోగకరంగా ఉండేలా రిజర్వు బ్యాంకు నిర్ణ యం తీసుకుంది. ఎలాంటి సెక్యూరిటీ పత్రాలు లేకుండా ప్రతి రైతుకు రూ.1.60 లక్షలు పంట  రుణాలు అందించాలన్న నిర్ణయంతో రైతన్నకు కాస్త ఊరట లభించనుంది. ప్రస్తుతం రైతులకు క్రాప్‌లోను కింద రూ.లక్ష వరకు బ్యాంకులు అందిస్తున్నాయి. ఎకరాకు రూ.30వేల చొప్పున ఈ రుణాలు అందుతున్నాయి.

అయితే జిల్లాలో ఐదున్నర ఎకరాలు పైబడి ఉన్న రైతులకే పెరిగిన రుణ పరిమితి వర్తించనుంది. ఒకటి, రెండు ఎకరాల భూమి ఉన్న రైతులకు ఇది అంతగా ప్రయోజనం చేకూర్చదు. గతంలో మాదిరిగానే రూ.లక్ష లోపు రుణమే దక్కనుంది. రబీ సీజన్‌ ప్రారంభమై ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యం లో ఈ నిబంధనలు రానున్న ఖరీఫ్, రబీ సీజన్‌లలో రైతులకు వర్తించనున్నాయి. 
4.76 లక్షల మంది రైతులు..

 ఉమ్మడి జిల్లాలో మొత్తం 4.76 లక్షల మంది రైతులుండగా.. ఐదెకరాలలోపు ఉన్న రైతులు 2.82లక్షలు, ఐదున్నర నుంచి ఆరెకరాల వరకున్న రైతులు 72 వేల పైచిలుకు ఉన్నారు. ఇక పది నుంచి 25 ఎకరాలు ఉన్న రైతులు 89 వేల మంది దాకా ఉన్నారు. 25 ఎకరాలకు పైగా ఉన్న రైతులు 33 వేలకు పైగా ఉన్నారు. వీరందరికీ భూమితో సంబంధం లేకుండా ఆర్బీఐ నిర్ణయించిన ప్రకారమే రూ.1.60 లక్షలు రుణం దక్కనుంది. అంటే ఎకరానికి రూ.30 వేల చొప్పున బ్యాంకు రుణం పరిమితికి లోబడి ఇస్తున్నందున ఐదున్నర ఎకరాలు పైబడిన రైతులందరికీ రుణాలు దక్కనున్నాయి.

గతంలో సైతం రాష్ట్ర ప్రభుత్వం పాస్‌పుస్తకాలతో సంబంధం లేకుండానే బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో పాత పాస్‌పుస్తకాలన్ని బ్యాంకర్ల వద్దనే ఉన్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేస్తే పెద్ద ఎత్తున రైతులకు మేలు జరుగనుంది. కానీ ఇంతవరకు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

 మార్గదర్శకాల కోసం ఎదురుచూపు..

పెరిగిన రుణ పరిమితికి సంబంధించి ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదు. ప్రస్తుతం ఉన్న రుణాలను మాఫీ చేస్తేనే బ్యాంకర్లు కొత్తగా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తారు. గతంలో భూములను మార్టిగేజ్‌ చేసుకోవడం, పాస్‌పుస్తకాలను పెట్టుకోవడం ద్వారా రుణాలను మంజూరు చేసేవారు. ప్రస్తుతం ధరణి వెబ్‌సైట్‌లో రైతులకు భూమి ఎంత ఉందనేది నిర్ధారణ చేసుకున్న అనంతరం పాస్‌పుస్తకాలను చూసి రుణాలను ఇవ్వాల్సి ఉంటుంది. రైతుల నుంచి తనఖా పత్రాలను తీసుకోవడం కానీ, మార్జిగేజ్‌ చేసేకోవడం కానీ ఇకపై ఉండదు. పాస్‌పుస్తకాలను ధ్రువీకరించుకోవడం కోసమే తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆన్‌లైన్‌ ద్వారా ధరణి వెబ్‌సైట్‌లో రైతుల సమాచారాన్ని, భూముల వివరాలను, సర్వే నంబర్లను చూసి సదరు భూములు రుణాలు పొందే రైతులవేనా అని సరిచూసుకుని ఇవ్వాల్సి ఉంటుంది. రుణాల పంపిణీ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే రైతులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆర్బీఐ కూడా రైతులకు ప్రయోజనం చేకూరేలా ఆదేశాలను ఇచ్చింది. మార్గదర్శకాలు వచ్చిన తర్వాత బ్యాంకర్లు రుణాల విషయమై చర్యలు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది.

బ్యాంకర్లు ముందుకొచ్చేనా..?

రైతులు ప్రైవేట్‌ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చుకొని పంటలు సాగు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో మూడెకరాలు ఉన్న రైతులకు రూ.60 నుంచి రూ.90వేల వరకు రుణాలు ఇచ్చేవారు. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం కూడా మూడెకరాల వరకు ఉన్న రైతులకు ఉపయోగపడలేదు. ఐదున్నర ఎకరాలు పైబడిన రైతులకు మాత్రమే రూ.1.60లక్షలు రానున్నాయి. బ్యాంకర్లు ఇస్తున్న రుణాలకు, పెరిగిపోయిన వ్యవసాయ పెట్టుబడులకు తీవ్ర వ్యత్యాసం ఉంటోంది. పంటలు సాగు చేయడానికి కూలీల ఖర్చు, ట్రాక్టర్లు దున్నకానికి, విత్తనాలు, ఎరువులు మొదలుకొని పంటలు కోసి, దిగుబడులను అమ్ముకునే వరకు రైతులకు నష్టం వస్తుందా లేదా లాభం వస్తుందా తేలని పరిస్థితులున్నాయి. లీడ్‌ బ్యాంకు అధికారులు ఎప్పటికప్పుడు మండలాలు, డివిజన్ల వారీగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తే తప్ప బ్యాంకు మేనేజర్లు రుణాలపై ఓ స్పష్టతకు రారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడంతో పెరిగిన రుణాల విషయంలో బ్యాంకర్లు ఏ మేరకు రైతులకు సహకరిస్తారో వేచిచూడాల్సిందే. 

ఉమ్మడి జిల్లాలో రైతులు  4.76 లక్షలు
ఐదెకరాలలోపు ఉన్నవారు  2.82 లక్షలు
5.5 నుంచి ఆరు ఎకరాలు  72 వేలపైన..
పది నుంచి 25 ఎకరాలు.. 89 వేల మంది
25 ఎకరాలకు పైగా కలిగిన వారు 89 వేల మంది


 

Advertisement

తప్పక చదవండి

Advertisement