​​కాంగ్రెస్‌ నాయకులు బుజ్జగింపులు!

Rangareddy Congress Leaders Is Hot Happening - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  టికెట్‌ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్‌ నేతలు రెబల్స్‌గా బరిలోకి దిగకుండా పార్టీ నష్టనివారణ చర్యలు మొదలు పెట్టింది. జిల్లాలో టికెట్లు దక్కని నేతలను ఆ పార్టీ సీనియర్లు బుజ్జగించారు. ఏఐసీసీ సభ్యులు రంగంలోకి దిగి మల్‌రెడ్డి రంగారెడ్డి, పట్లోళ్ల కార్తీక్‌రెడ్డిలతో చర్చించారు. భవిష్యత్‌లో పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని హామీ ఇచ్చారు. రెబల్స్‌గా బరిలోకి దిగితే పార్టీకి నష్టం వాటిల్లుతుందని, ఆ ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. ఇబ్రహీంపట్నం టికెట్‌ను మల్‌రెడ్డి, రాజేంద్రనగర్‌ టికెట్‌ను పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి ఆశించిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో మహేశ్వరం నుంచి పోటీచేసి ఓటమి పాలైన మల్‌రెడ్డి రంగారెడ్డి ఈసారి ఇబ్రహీంపట్నం టికెట్‌ దక్కుతుందన్న దీమాతో ఉన్నారు.

అలాగే రాజేంద్రనగర్‌ సెగ్మెంట్‌ని ఆశించిన కార్తీక్‌ రెడ్డి కొంతకాలంగా ఈ నియోజకవర్గ పరిధిలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. అయితే మహాకూటమి పొత్తులో భాగంగా ఈ రెండు స్థానాలు అనూహ్యంగా టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. వీరిద్దరికి టికెట్లు దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఆదివారం పుదుచ్చేరి సీఎం వి.నారాయణస్వామి, మాజీ మంత్రి మల్లాడి  కృష్ణారావు, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ సెక్రటరీ బోస్‌రాజు తదితరులు.. టికెట్‌ దక్కని అభ్యర్థులు, సీట్ల సర్దుబాటులో నష్టపోయిన వారితో సమావేశమయ్యారు.

మన జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, కార్తీక్‌రెడ్డిలు ఈ భేటీకి  హాజరయ్యారు. ఏ పరిస్థితులు, కారణాల వల్ల ఇతరులకు సీట్లు ఇవ్వాల్సి వచ్చిందో వారికి వివరించారు. ఈ క్రమంలో కార్తీక్‌ రెడ్డి కాస్త శాంతించారు. ఆయన తల్లి సబిత పోటీలో ఉన్న దృష్ట్యా మెత్తబడ్డారు. అయితే టికెట్‌ తెచ్చుకోవాలని రాజేంద్రనగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రకాశ్‌గౌడ్‌ సవాల్‌ విసిరాడని, తనకు టికెట్‌ దక్కదని ముందే ఆయనకెలా తెలిసిందనే అంశంపై కమిటీ సభ్యుల ఎదుట కార్తీక్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

మల్‌రెడ్డి నేడు నామినేషన్‌ 
ఇదిలావుండగా.. ఇబ్రహీంపట్నం టికెట్‌పై మల్‌రెడ్డి ఏమాత్రం పట్టువీడనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ తరఫున సోమవారం నామినేషన్‌ వేసేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు విలేకరులతో చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ తనకే టికెట్‌ ఇస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీఆర్‌ఎస్, టీడీపీ కుమ్మక్కై సామ రంగారెడ్డిని బలి పశువును చేశారని ఆయన ఆరోపించడం కొసమెరుపు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top