‘మిషన్‌ భగీరథ’ ఓ అద్భుతం | Sakshi
Sakshi News home page

‘మిషన్‌ భగీరథ’ ఓ అద్భుతం

Published Thu, May 24 2018 5:28 AM

Rajendra Singh visits Kaleshwaram project - Sakshi

గజ్వేల్‌ రూరల్‌: తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడంతో పాటు ఫ్లోరైడ్‌ ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయడం అభినందనీయమని, మిషన్‌ భగీరథ అద్భుతమైన పథకమని గుజరాత్‌కు చెందిన వాటర్‌మాన్‌ ఆఫ్‌ ఇండి యా రాజేంద్రసింగ్‌ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండల పరిధిలోని కోమటిబండ గుట్టపై నిర్మించిన ‘మిషన్‌ భగీరథ’హెడ్‌వర్క్స్‌ ప్రాంతాన్ని బుధవారం టీడబ్ల్యూఆర్‌డీసీ(తెలంగాణ వాటర్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) చైర్మన్‌ ప్రకాశ్‌ నేతృత్వంలో రాజేంద్రసింగ్, ఇరిగేషన్‌ శాఖ రిటైర్డ్‌ ఈఎన్‌సీ బీఎస్‌ఎన్‌ రెడ్డితో పాటు 25 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు, మేధావులు, శాస్త్రవేత్తలు సందర్శించారు.

ఈ సందర్భంగా వారు నీటి సరఫరా తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజేంద్రసింగ్‌ మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ తరహా పథకాన్ని ఇతర రాష్ట్రాల్లో సైతం అమలు చేయాలని సూచించారు. అలాగే మిషన్‌ కాకతీయ పథకం ద్వారా భూగర్భజలాలు పెరగడంతోపాటు ఫ్లోరైడ్‌ సమస్య కూడా తీరుతుందన్నారు. ప్రకాశ్‌ మాట్లాడుతూ.. ఎండాకాలం వస్తే తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడేవని.. సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భగీరథ పథకం ద్వారా ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతుందని అన్నారు.
 

Advertisement
Advertisement