రాజ్‌ భవన్‌ స్కూల్‌.. నావల్ల కాదు బాబోయ్‌! | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 29 2018 11:01 AM

Raj Bhavan Government School HM Unhappy With Facilities - Sakshi

సోమాజిగూడ: సిటీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తొలిస్థానంలో ఉన్న రాజ్‌భవన్‌ స్కూల్‌ ఇన్‌చార్జి హెచ్‌ఎం సుమన్‌ విధులు నిర్వహించలేనని చేతులెత్తేశారు. ఈ స్కూల్‌లో హెచ్‌ఎంకు కనీసం రూమ్‌ కూడా లేదని, రెండు నెలలుగా పిల్లల మధ్యే కూర్చోవాల్సి వస్తోందని వాపోయారు.  ఇక్కడ విధులు నిర్వహించడం తనవల్ల కాదంటూ.. తనను ఆ స్కూలు నుంచి రిలీవ్‌ చేయాలని కోరుతూ డీఈఓ వెంకటనర్సమ్మకు రాత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు. అయితే డీఈఓ విజ్ఞప్తిని ఇప్పటికీ అంగీకరించలేదు. అయినప్పటికీ ఆయన గత 10 రోజుల నుంచే పేరెంట్‌ స్కూలు (బేగంపేట్‌–2)కు హాజరవుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా రాజ్‌భవన్‌ స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ ఇతర ప్రాంతాల్లోని పాఠశాలలకు బదిలీపై వెళ్లిన విషయం విదితమే.

ఇక్కడ పనిచేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గవర్నర్‌ సీరియస్‌ అయిన సంగతి తెలిసిందే. దీంతో జిల్లా విద్యాశాఖ 20మంది విద్యా వలంటీర్లతో పాటు సమీప పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులను తాత్కాలికంగా ఇక్కడ నియమించింది. ఇదే సమయంలో హెచ్‌ఎంగా బేగంపేట్‌–2 పాఠశాలకు చెందిన సుమన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం పాఠశాలలో 1,300 మంది విద్యార్థులుడగా.. 10 మంది ప్రభుత్వ రెగ్యులర్‌ ఉపాధ్యాయులు, 15 మంది విద్యా వలంటీర్లు ఉన్నారు. ఇక ప్రైమరీ సెక్షన్‌లో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు 10 మంది విద్యా వలంటీర్లు పని చేస్తున్నారు. తాజాగా హైస్కూల్‌ ఇన్‌చార్జి హెచ్‌ఎం సుమన్‌ తానిక్కడ విధులు నిర్వర్తించలేనని, పేరెంట్‌ స్కూలుకు వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ ఇటీవల డీఈఓకు లేఖ రాశారు. దీనిపై డీఈఓ వెంకటనర్సమ్మ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆయన మాత్రం గత పది రోజులుగా స్కూలు రావడం మానేశారు.  

కనీసం రూమ్‌ కూడా లేదు...  
ఈ విషయంపై ఇన్‌చార్జి హెచ్‌ఎం సుమన్‌ను వివరణ కోరగా... తాను బేగంపేట్‌–2 స్కూలుకు వెళ్తున్నట్లు చెప్పారు. అదేమంటే రాజ్‌భవన్‌ స్కూల్‌లో హెచ్‌ఎం కూర్చునేందుకు కనీసం రూమ్‌ కూడా లేదని, గత రెండు నెలలుగా పిల్లల మధ్యే కూర్చోవాల్సి వస్తోందని చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని, విధిలేని పరిస్థితుల్లోనే రాజ్‌భవన్‌ స్కూలును వీడి బేగంపేట్‌ స్కూలుకు వెళ్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 


 

Advertisement
Advertisement