జోరుగా వానలు..

Rain Hits Several Places In Telangana - Sakshi

క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు

మంచిర్యాల జిల్లా జైపూర్‌లో    11 సెం.మీ. వర్షపాతం

పిడుగుపాట్లకు ఇద్దరి మృతి.. పలు జిల్లాల్లో తడిసిన ధాన్యం

హైదరాబాద్‌లోనూ జోరువాన

సాక్షి, హైదరాబాద్‌/నెట్‌వర్క్ ‌: వారం రోజు లుగా తీవ్ర ఎండలు, వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరి అయిన రాష్ట్ర ప్రజలకు ఆదివారం ఉపశమనం లభించింది. ఆదివారం ఉద యం పొడి వాతావరణం నెలకొన్నప్పటికీ మధ్యాహ్నం ఏర్పడిన క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలంలో 11సెం.మీ. వాన పడగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్, ఎల్బీ నగర్, పెద్దపల్లి జిల్లా పాలకుర్తిలలో 7, రంగారెడ్డి జిల్లా మంచాల, సంగారెడ్డి జిల్లా జిన్నారం, మేడ్చల్‌ జిల్లా బాలానగర్‌ మండలాల్లో 6, హాజీపూర్, శేరిలింగంపల్లి, మస్పూర్, నర్కూక్, మంచిర్యాల మండలాల్లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. హైదరాబాద్‌ జిల్లాలో సగటున 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చోట్ల వడగళ్ల వాన కురవగా మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. వివిధ జిల్లాల్లో పిడుగుపాట్లకు ఇద్దరు మృతి చెందగా పలు చోట్ల ఓ మోస్తరు ఆస్తినష్టం సంభవించింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో కరెంట్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఆదివారం ధర్మారంలో కురిసిన వర్షానికి కొట్టుకుపోయిన మక్కలు

అన్నదాతకు అనుకోని కష్టం...
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో వర్షాలకు ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన ధాన్యం తడిసిపోయింది. మల్యాల మండలం లంబాడిపల్లి, గొల్లపల్లి మండలాల్లో వడగండ్ల వాన పడింది. మంచిర్యాల జిల్లా భీమిని, కన్నెపల్లి, చెన్నూర్, భీమారం, తదితర మండలాల్లోనూ కొనుగోలు కేంద్రాల్లో బస్తాల్లో నింపిన ధాన్యం తడిసిపోగా ఆరబోసిన ధాన్యం టార్పాలిన్లు, కవర్లు కప్పినా కొట్టుకుపోయింది. జిల్లాలో ఇప్పటివరకు 1.62 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వరంగ సంస్థలు 1.54 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. ఇంకా కొనుగోలు కేంద్రాల్లో వేల క్వింటాళ్లు తూకానికి సిద్ధంగా ఉండగా వర్షానికి నీటమునిగింది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలోని హాలియా, యాదగిరిగుట్ట, మోటకొండూరులలో ఈదురుగాలులకు ఇళ్లపై కప్పులు ఎగిరిపోయాయి. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలోని తొమ్మిదోమైలు తండా, రోళ్లపాడు గ్రామాల్లో చెట్లు విరిగిపడ్డాయి. అశ్వాపురం మండలంలో రెండు గంటలపాటు వర్షం కురిసింది.

ప్రాణాలు తీసిన పిడుగులు...
వివిధ జిల్లాల్లో పిడుగుపాట్లకు ఓ రైతు, గొర్రెల కాపరి మృతి చెందడంతోపాటు పదుల సంఖ్యలో పశువులు ప్రాణాలు వదిలాయి. నాగర్‌కరూŠన్‌ల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం కుడికిల్లకు చెందిన రైతు ఆరేపల్లి కృష్ణయ్య (70)తోపాటు నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో గొర్రెల కాపరి గెల్లా మల్లయ్య (60) మృతి చెందాడు. మరోవైపు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేట గ్రామంలో పిడుగుపాటుకు 30 గొర్రెలు, మరో 10 గొర్రె పిల్లలు మృతిచెందాయి. అలాగే మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో పిడుగు పడటంతో 15 ఆవులు మృత్యువాత పడ్డాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాంబాయిగూడెంలో పిడుగుపడి ఓ కార్పెంటర్‌కు చెందిన రూ. 50 వేల విలువైన సామగ్రి కాలిపోయింది.

మలక్‌పేట్‌లో భారీ వర్షనికి కొట్టుకుపోతున్న వాహనం 

హైదరాబాద్‌లో గంటల తరబడి విద్యుత్‌ కోత...
గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో మొదలైన వర్షం ఒక్కసారిగా జడివానగా మారింది. పటాన్‌చెరులో 6.9, హస్తినాపురంలో 6.5 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. గాలివాన బీభత్సానికి పలు ప్రాంతాల్లో చెట్లు, హోర్డింగ్‌లు కుప్పకూలాయి. విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. సుమారు 150 ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరా కొన్ని గంటలపాటు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వరదనీరు పోటెత్తింది.

మరో రెండ్రోజులు వర్షాలు..
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో రెండ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ, తూర్పు, మధ్య అరేబియా సముద్రంలో ఆదివారం ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది వచ్చే 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. బుధవారం నాటికి ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్‌ తీరాలను చేరే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఛతీŠత్‌స్‌గఢ్‌ నుంచి తెలంగాణ, రాయలసీమ, దక్షిణమధ్య కర్ణాటక మీదుగా లక్షదీవుల వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నైరుతి రుతుపవనాలు సోమవారం కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top