తొందరొద్దు..   సరిదిద్దుకుందాం!

Rachakonda CP Mahesh Bhagwat Who Started the Family Counseling Center - Sakshi

నేరేడ్‌మెట్‌లో ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్‌ ప్రారంభం 

ప్రేమతో పెంచిన కూతుళ్ల జీవితంపై జాగ్రత్త అవసరం 

విదేశీ పెళ్లి సంబంధమని తొందరపడి మోసపోవద్ధు 

చిన్నచిన్న మనస్పర్థలతో భార్యాభర్తలు దూరం కావొద్ధు 

రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ 

నేరేడ్‌మెట్‌: వివాహ సంబంధాల్లో తలెత్తే వివాదాలు, పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తలెత్తే వివాదాల పరిష్కారానికి రాచకొండ కమిషనరేట్‌లో ప్రత్యేక ఫ్యామిటీ కౌన్సిలింగ్‌ కేంద్రం అందుటులోకి వచ్చింది. ఈ కేంద్రానికి భూమిక విమెన్‌ సెల్‌ (ఎన్‌జీఓ) నోడల్‌ ఏజెన్సీగా వ్యవహారిస్తుంది. గురువారం నేరేడ్‌మెట్‌లోని డీసీపీ కార్యాలయం వెనుక ఏర్పాటు చేసిన ‘స్పెషల్‌ సెల్‌ ఫర్‌ విమెన్‌ అండ్‌ చిల్డ్రన్స్‌ ఫ్యామిలీ సపోర్ట్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌’ను రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ లాంఛనంగా ప్రారంభించారు.

గృహహింస నుంచి స్త్రీలకు రక్షణ కల్పించడంతో పాటు బాధిత మహిళలు, చిన్నారులకు అవసరమైన సహాయం అందిస్తూ అండగా నిలుస్తుందీ సెంటర్‌. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాచకొండ అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు, షీ–టీమ్‌ అడిషనల్‌ డీసీపీ సలీమ, అడ్మిన్‌ డీసీపీ శిల్పవల్లి, ఫ్యామిలీ సపోర్ట్‌ కౌన్సిలింగ్‌ సెంటర్‌ ముఖ్య నిర్వాహకురాలు కొండవీటి సత్యవతి, ఇన్ఫోసిస్‌ ప్రతినిధి విష్ణుప్రియ, రజిని, సీసీఎండీ శాస్త్రవేత్త లత, ఫ్యామిలీ సపోర్ట్‌ కౌన్సిలింగ్‌ కేంద్రం కౌన్సిలర్లు, పలువురు మహిళలు పాల్గొన్నారు. 

బాధిత మహిళలకు తోడ్పాటు ఇలా.. 
ఇప్పటికే రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో భువనగిరి, సరూర్‌నగర్‌ మహిళా ఠాణాల్లో, కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌లో మొత్తం మూడు కౌన్సిలింగ్‌ కేంద్రాలు కొనసాగుతున్నాయి. నేరేడ్‌మెట్‌లోని ప్రత్యేక ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ సెంటర్‌లో కమిషనరేట్‌ పరిధిలోని అన్ని ఠాణాల్లో నమోదయ్యే పెళ్లి వివాదాలు, గృహహింస కేసులు, బాధితులకు న్యాయ సహాయం, చిన్నారుల సంరక్షణ, ప్రతివాది నుంచి రక్షణ కల్పించడం, వైద్య సహాయం, ఆర్థిక సహకారం వంటివి కల్పిస్తారు. గృహహింస చట్టం ప్రకారం వారిలో మానసిక స్థైర్యాన్ని నింపి భరోసానివ్వడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది.  

ఎన్‌ఆర్‌ఐ కేసులపై ప్రత్యేక దృష్టి.. 
ఎన్‌ఆర్‌ఐ, ఇతర రాష్ట్రాల, పోలీస్‌ కమిషనరేట్ల, జిల్లాలకు చెందిన గృహహింస కేసుల పరిష్కారం కోసమే స్పెషల్‌ సెల్‌ ఫర్‌ విమెన్‌ అండ్‌ చిల్డ్రన్స్‌ ఫ్యామిలీ సపోర్ట్‌ కౌన్సిలింగ్‌ సెంటర్‌ను భూమిక ఎన్‌జీఓ సంస్థ ద్వారా సీపీ మహేష్‌ భగవత్‌ అందుబాటులోకి తెచ్చారు. పెళ్లయిన నెల రోజులకే విడాకుల కోసం బాధిత మహిళలు రాచకొండ సీపీ కార్యాలయానికి వస్తున్నారు. వీటిలో అధికంగా ఎన్‌ఆర్‌ఐ కేసులే ఉంటున్నాయి. ప్రత్యేక ఫ్యామిలీ కేంద్రం ద్వారా మొదట వారికి కౌన్సిలింగ్‌ ఇస్తారు. విడాకుల వరకు వెళ్లకుండా నచ్చజెబుతారు. బాధిత మహిళలకు రక్షణ, ఆర్థిక సాయం, చిన్నారులకు విద్య, సంరక్షణకు తోడ్పాటునందిస్తారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top