రబీ లక్ష్యం 25 లక్షల ఎకరాలు!

Rabi targets 25 lakh acres - Sakshi

సాగు ప్రణాళికను సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద ముందస్తు రబీ ప్రణాళికకు నీటి పారుదల శాఖ శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టుల కింద నీటి లభ్యత పెరుగుతున్న దృష్ట్యా రబీలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద మొత్తంగా 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళికలు వేస్తోంది. నాగార్జునసాగర్, నిజాంసాగర్, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుల్లో నిల్వలు పెరుగుతుండటం ఊరటనిస్తోంది. రాష్ట్ర సాగునీటి సమీకృత, నీటి నిర్వహణ, ప్రణాళిక స్టాండింగ్‌ కమిటీ(శివమ్‌) మూడు నాలుగు రోజుల్లో సమావేశమై రబీ ముందస్తు ప్రణాళిక, నీటి లభ్యత, వినియోగం అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. 

ఆశించిన స్థాయిలో నీరు చేరక..: రాష్ట్రంలోని భారీ, మధ్య, చిన్నతరహా సాగు నీటి ప్రాజెక్టుల కింద కలిపి మొత్తంగా 48.95 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. ఇందులో ఎనిమిదేళ్ల సగటును పరిశీలిస్తే.. 23.35 లక్షల ఎకరాల మేర సాగు జరుగుతోంది. ప్రాజెక్టుల నుంచి ఈ ఎనిమిదేళ్లలో 2013–14లో అత్యధికంగా 28.15 లక్షల ఎకరాలకు నీరందింది. అత్యల్పంగా 2014–15లో 9.74 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందినట్లు లెక్కలు చెబుతున్నాయి. 2015–16లో 21.57 లక్షల ఎకరాలకు, 2016–17లో 28 లక్షల ఎకరాలకు నీరందింది.

అయితే ఈ ఏడాది సాగునీటి ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేక ఖరీఫ్‌లో ఆయకట్టుకు నీరివ్వడం సాధ్యం కాలేదు. ముఖ్యంగా భారీ ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, నిజాంసాగర్‌ల కింద ఒక్క ఎకరాకు కూడా నీరందకపోగా.. శ్రీరాంసాగర్‌ కింద మాత్రం ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిన ఇప్పటివరకు 10 టీఎంసీల వరకు నీటిని కాల్వల ద్వారా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి ప్రాజెక్టులకు వస్తున్న ప్రవాహాలు రబీకి సాగునీరు అందడంపై ఆశలు పెంచుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top