థియేటర్లలోకి బయటి ఆహార పదార్థాలను తీసుకెళ్లేలా ఆదేశాలివ్వండి 

Public interest litigation in the High Court - Sakshi

హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌ థియేటర్లలో ప్యాకింగ్‌ చేయని ఆహార పదార్థాలు, ఇతర పానీయాలను అత్యధిక రేట్లకు విక్రయిస్తున్నారని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో (పిల్‌) దాఖలైంది. సినిమా థియేటర్లలోకి ప్రేక్షకులు తమ వెంట బయటి నుంచి తినుబండారాలను తెచ్చుకునేందుకు అనుమతినిచ్చేలా చూడాలంటూ న్యాయవాది పి.సతీ‹శ్‌కుమార్‌ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

విశ్రాంత సమయంలో తాము తెచ్చుకున్న తినుబండారాలను తినేందుకు ఏర్పాటు చేసేలా థియేటర్ల యాజమాన్యాలను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌ కార్న్‌ను రూ.150 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారని తెలిపారు. శీతలపానీయాలను రూ.120 నుంచి రూ.200 వరకు, వాటర్‌ బాటిల్స్‌కు రూ.60, కాఫీకి రూ.100 వసూలు చేస్తున్నారని వివరించారు. తెలంగాణ సినిమా రెగ్యులేషన్‌ చట్ట నిబంధనల్లో ఎక్కడా కూడా బయటి తినుబండారాలను ప్రేక్షకులు లోనికి తీసుకెళ్లకుండా నిషేధం ఏదీ లేదన్నారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top