సర్వర్‌ పరేషాన్‌ | Sakshi
Sakshi News home page

సర్వర్‌ పరేషాన్‌

Published Sun, Apr 5 2020 1:52 AM

Public Face Problems At Ration Shops Due To Server Down - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ బియ్యం పంపిణీకి సర్వర్‌ అనేక చిక్కులు తెచ్చిపెడుతోంది. వందల సంఖ్యలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యాన్ని తీసుకునేందుకు ఎగబడటంతో సాంకేతిక సమస్యలు తలెత్తి సర్వర్‌ మొరాయిస్తోంది. దీంతో రేషన్‌ దుకాణాల వద్ద లబ్ధిదారులు గుంపులుగా చేరడం, కొన్ని చోట్ల వాగ్వాదానికి దిగడంతో తీవ్ర గందరగోళం నెలకొంటోంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని దుకాణాల వద్ద శనివారం సర్వర్‌ పనిచేయక లబ్ధిదారులు గంటల కొద్దీ బారులు తీరారు.
 
పోర్టబిలిటీ పెరగడంతో..
రేషన్‌ పంపిణీ మొదలైన ఈ నెల ఒకటవ తేదీ నుంచి శుక్రవారం వరకు 22 లక్షల కుటుంబాలు 88 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని తీసుకున్నాయి. మొత్తం 87.59 లక్షల కుటుంబాల్లో మూడ్రోజుల్లోనే 25 శాతం తీసుకున్నారు. ఇక శనివారం ఉదయం 5 గంటల నుంచే రేషన్‌ దుకాణాల వద్ద జనాల రద్దీ కనిపించింది. మల్కాజ్‌గిరి, ఖైరతాబాద్, కుషాయిగూడ, నాగారం, జవహర్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి వందల సంఖ్యల్లో కూపన్లు ఉన్నవారు, లేనివారు అంతా దుకాణాల వద్దకు చేరుకున్నారు. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పంపిణీ గంట సేపు సజావుగా సాగినా, ఆ తర్వాత సర్వర్‌ పనిచేయకపోవడంతో గందరగోళంగా మారింది. ఒక పది నిమిషాలు పనిచేస్తే, మరో పదిహేను నిమిషాలు సర్వర్‌ పనిచేయకపోవడంతో లబ్ధి దారులు డీలర్లతో గొడవకు దిగారు. చాటాచోట్ల వెంట తెచ్చుకున్న సరుకులను వరుసల్లో పెట్టేసి ఒకే దగ్గర గుమికూడారు. చాలా చోట్ల వృద్ధులు, మహిళలు గంటల తరబడి నిల్చోలేక నీరసించిపోయారు.

శనివారం మధ్యాహ్నానికి 4.50 లక్షల మంది బియ్యం తీసుకున్నట్లుగా తెలిసింది. అయితే ఎక్కువగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో సమస్య ఎక్కువగా కనిపించింది. హైదరాబాద్‌లో 5.80 లక్షలు, రంగారెడ్డిలో 5.24 లక్షలు, మేడ్చల్‌లో 4.95 లక్షల మంది రేషన్‌ కార్డుదారులుండగా, వీటికి అదనంగా వివిధ ప్రాంతాల వలసదారులు ఇక్కడే రేషన్‌ పోర్టబిలిటీని వినియోగించుకోవడంతో సాంకేతిక సమస్యలు తీవ్రమయ్యాయి. దీంతో సర్వర్‌ పనిచేయక బియ్యం పంపిణీ నెమ్మదిగా సాగింది. ఖైరతాబాద్‌లోని ఓ దుకాణంలో సర్వర్‌ సమస్య కారణంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కేవలం 15 మందికి మాత్రమే బియ్యం పంపిణీ చేయగలిగారు. అన్ని చోట్లా ఇదే పరిస్థితి కనిపించడంతో అధికారులు స్టేట్‌ డేటా సెంటర్‌ వారితో మాట్లాడి సమస్యను కొంతవరకు పరిష్కరించారు.
 
టోకెన్‌ ఉన్నవారే రావాలి: మారెడ్డి 
సర్వర్‌ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. టోకెన్‌ తీసుకున్న లబ్ధిదారులు మాత్రమే బియ్యం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికీ బియ్యం పంపిణీ చేసే బాధ్యత ప్రభుత్వానిదని స్పష్టం చేశారు.  

Advertisement
Advertisement