మనో బలం మన సొంతం

Psychiatrist Dr MS Reddy Special Interview With Sakshi

లాక్‌డౌన్‌ వేళ మానసిక రుగ్మతల ప్రభావం అంతంతే

సంక్షోభ సమయంలో విచారం, ఒత్తిడి వంటివి సహజమే

యాంగ్జయిటీ, డిప్రెషన్, సర్దుబాటు సమస్యలు పెరగొచ్చు

‘సాక్షి’తో సీనియర్‌ సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ పూర్తిస్థాయిలో ఎత్తేసిన తరువాతే ఎందరిపై ఏయే రూపాల్లో మానసిక ఒత్తిళ్లు పనిచేశాయి?, ఏ మేరకు వారిపై ప్రస్తుత పరిస్థితుల ప్రభావం పడిందనే దానిపై స్పష్టత వస్తుందని సీనియర్‌ సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు, ఆయా అంశాలపై వివిధ వర్గాల వారు స్పందిస్తున్న తీరు, చూపుతున్న ధైర్యం వంటివి పరిశీలిస్తే ప్రజలపై పెద్దగా మానసిక రుగ్మతల ప్రభావం లేనట్టేనని అభిప్రాయపడ్డారు. చిన్నచిన్న మానసిక సమస్యలు ఎదురైనా కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో పాటు సాధారణ చికిత్స అందిస్తే సరిపోతుందని చెప్పారు. ఇంకా లాక్‌డౌన్‌ సమయంలో తలెత్తే మానసిక, ఇతర సమస్యలపై ‘సాక్షి’తో డాక్టర్‌ ఎంఎస్‌రెడ్డి పంచుకున్న విషయాలు ఆయన మాటల్లోనే...

పేదలపైనే ఎక్కువ ప్రభావం 
లాక్‌డౌన్‌ సమయంలో మానసిక సమస్యల తీరు రకరకాలుగా ఉండొచ్చు. సైకోసిస్, స్కిజోఫోనియా, బైపోలార్‌ డిజార్డర్స్‌ వంటివి పెరగకపోవచ్చు. అడ్జస్ట్‌మెంట్, యాంగ్జయిటీ, డిప్రెషన్‌ వంటి సాధారణ జబ్బులు పెరగొచ్చు. స్థితిమంతులు, ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతి వారిపై కరోనా అనంతరం ఆర్థిక పరిస్థితుల ప్రభావం పెద్దగా పడకున్నా, కిందివర్గాలు, నిరుపేదలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. కరోనా మహమ్మారి ప్రపంచం ముందుకు సరికొత్త రూపంలో రావడంతో దానినెలా ఎదుర్కోవాలో తెలియక, కేవలం అంచనాలు, ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ బేసిస్‌తో ముందుకెళ్లాల్సిందే.

మానసిక ప్రశాంతతే మందు 
సాధారణంగా ఆహారం, ఆశ్రయం, ఉపాధివంటి వాటితో ముడిపడిన అంశాలకు సంబంధించి సమస్యలు ఏర్పడితే అయోమయం, గందరగోళం వంటివి కలుగుతాయి. ఇప్పటివరకు వీటి విషయంలో ఎలాంటి సమస్యల్లేకుండా ఉండి, లాక్‌డౌన్‌ వేళ కొత్తగా తలెత్తిన పరిస్థితుల ప్రభావం పడితే ఆదుర్దా చెందడంతో పాటు భవిష్యత్‌పై అనుమానాలు, సందేహాలు నెలకొంటాయి. ఇటువంటి సంక్షోభ సమయంలోనే విచారం, ఒత్తిడి, భయం, కోపం వంటివి కలుగుతుంటాయి. అయితే మానసిక ప్రశాంతతను సాధిస్తూ ఒత్తిళ్లు దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు ఆప్తులైన వారితో భావాలు పంచుకుంటూ రోజువారీ జీవితం ఆహ్లాదంగా గడిపేలా చూసుకోవాలి.

‘జాగ్రత్త’మంచిదే! 
కొంచెం ఒంట్లో నలతగా ఉన్నా, దగ్గు, జలుబు వచ్చినా.. అవి కరోనా లక్షణాలేమోనని సందేహించే పరిస్థితి.. కరోనాకు చికిత్సలేదని, మందులు, వ్యాక్సిన్లు లేవనే భయంతో పాటు తమకు పాజిటివ్‌ వచ్చి, 28రోజుల హాస్పిటల్‌ క్వారంటైన్‌కు పంపిస్తే ఎలా అనే ఆందోళన, ఆదుర్దా ఏర్పడటం సహజమే. అతి శుభ్రతతో పాటు అన్నింట్లో అతి జాగ్రత్తలు తీసుకునే అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ (ఓసీడీ) లక్షణాలున్న వారు ఇటువంటి పరిస్థితుల్లో మరింత అతిగా స్పందించే అవకాశాలున్నాయి. అయితే వీరితో పాటు ఇతరులు కూడా పదేపదే చేతులు కడుక్కుంటూ శుభ్రత పాటించడం, ఆరోగ్యపరంగా, ఇతరత్రా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచి పరిణామమే.

ఆర్థికంగా ప్రభావం ఎక్కువే.. 
ప్రస్తుత పరిస్థితుల ప్రభావం ఆర్థికరంగంపై ఎక్కువగా ఉండొచ్చు. స్వస్థలాలకెళ్లిన వలస కార్మికులు తిరిగి రావడానికి కొంతకాలం పడుతుంది. ఈ ప్రభావం నిర్మాణరంగం, దాని అనుబంధ రంగాలపై ఉంటుంది. ఆటోమొబైల్, ఎంటర్‌టైన్మెంట్‌ రంగాలూ తీవ్రంగా ప్రభావితమవుతాయి. చైనా నుంచి వివిధ రంగాలకు చెందిన కంపెనీల పెట్టుబడులను, ఉత్పత్తి కేంద్రాలను భారత్‌కు రప్పించడంలో సఫలమైతే కరోనా అనంతర పరిణామాలను కొంతమేరకైనా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు.

ఆ సత్తా మనకుంది.. 
ఇంతటి విపత్కర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులతో సహా దేశమంతా ఒక్కటిగా నిలిచి లాక్‌డౌన్‌ను విజయవంతంగా పాటించి ఇతర దేశాలకు భారత్‌ ఆదర్శంగా నిలిచింది. భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే మానసిక స్థైర్యం, ధైర్యం, పట్టుదల భారత్‌కు, ప్రజలకు ఉన్నాయని ఇది చాటుతోంది.

ఇంట్లో సర్దుబాటు సమస్యలు 
ఈ సమయంలో అందరూ ఇళ్లలోనే ఉండటంతో సర్దుబాటు సమస్యలు ఏర్పడుతున్నాయి. భార్యాభర్తల్లో కోపం, చికాకుతో పాటు నిర్లిప్తత వంటివి ఏర్పడడంతో ఇళ్లలో గొడవలకు ఆస్కారం కలుగుతోంది. పుస్తకాలు చదవడం, సంగీతం, నాట్యం వంటి ఇతర అభిరుచులు, వ్యాపకాలు లేని వారు, స్నేహితులు అంతగా లేని వారిలో ఈ సమస్యలు ఎక్కువ. అలాగే, లాక్‌డౌన్‌లో మద్యపాన సేవనం పెరిగింది. సిగరెట్లు, గుట్కాలు అలవాటున్న వారు వాటిని తీసుకోవడం మరింత ఎక్కువైనట్టు తెలుస్తోంది. ఇటువంటి వారు ప్రయోజనకర వ్యాపకాలను కల్పించుకోవడం ద్వారా వ్యసనాల నుంచి బయటపడవచ్చు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top