గండ శిలలకు గట్టి రక్షణ

Protection for ganda rocks - Sakshi

ముడుమాల్‌లోని నిలువు రాళ్ల రక్షణకు సర్కారు ఏర్పాట్లు

ఐదున్నర ఎకరాల్లో ఇప్పటికే భూ సేకరణ పూర్తి

ఫెన్సింగ్‌ పనులు మొదలు.. పది రోజుల్లో పూర్తి

సాక్షి, హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ముడుమాల్‌లో ఉన్న గండ శిలలకు రక్షణ కవచం ఏర్పాటవుతోంది. రాతియుగంలో నిర్మించినట్లు భావిస్తున్న ఈ పురాతన ఖగోళ పరిశోధన ప్రాం తాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గండ శిలలున్న ప్రాంతంలోని పట్టా భూములను ఇప్పటికే సేకరించిన సర్కారు.. ఆ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.     

ఐదున్నర ఎకరాల్లో..
కృష్ణానది తీరంలోని ఈ గండ శిలలను క్రీస్తుపూర్వం వెయ్యేళ్ల కిందటే క్రమపద్ధతిలో అమర్చినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శిలల్లో 14 అడుగుల కంటే ఎత్తున్న రాళ్లు 80 వరకు ఉండగా.. చిన్న రాళ్లు మూడు వేల వరకు ఉన్నాయి. మొత్తం శిలల ప్రాంతం 80 ఎకరాల్లో విస్తరించి ఉంది. పొడవాటి రాళ్లు మాత్రం ఐదున్నర ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇవన్నీ పట్టా భూములు కావడం, రైతులు వ్యవసాయం చేస్తుండటం, వాటి ప్రాముఖ్యం తెలియకపోవడంతో చాలా రాళ్లు కనుమరుగైనట్లు నిపుణులు గుర్తించారు.

దీంతో మిగిలిన రాళ్లున్న ప్రాంతాన్ని కాపాడాలని నిర్ణయించిన హెరిటేజ్‌ తెలంగాణ.. ఈ విషయమై ప్రభుత్వానికి వివరించింది. దీంతో ముడుమాల్‌ నిలువు రాళ్లున్న ప్రాంతంలో ఐదున్నర ఎకరాల భూమిని రైతుల నుంచి ఇటీవల సర్కారు సేకరించింది. మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ రోనాల్డ్‌ రాస్‌తో హెరిటేజ్‌ తెలంగాణ సంచాలకురాలు విశాలాచ్చి చర్చించి భూ సేకరణ వేగంగా జరిగేలా చూశారు.

ఇటీవలే దాదాపు రూ.25 లక్షల పరిహారాన్ని రైతులకు అందించారు. ప్రస్తుతం ఆ ఐదున్నర ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే కందకాలు తీశారు. మరో వారం, పదిరోజుల్లో ఫెన్సింగ్‌ పని పూర్తి కానుంది. సందర్శకులు పరిశీలించేంలా ఫెన్సింగ్‌ వెంట నడకదారి కూడా ఏర్పాటు చేయనున్నారు.  

అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు
రాతియుగం నాటి మనుషులు సమాధులకు గుర్తుగా నిలువు రాళ్లు పాతడం ఆనవాయితీ. ఈ శిలలు కూడా అలాంటి సాధారణ నిలువు రాళ్లేనని మూడేళ్ల క్రితం వరకు భావించారు. అయితే హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం చారిత్రక విభాగం ప్రొఫెసర్‌ పుల్లారావు, వర్సిటీ విద్యార్థుల బృందం మూడేళ్ల క్రితం ఆ ప్రాంతంపై కొన్ని నెలలు పరిశోధనలు చేసి అవి సాధారణ రాళ్లు కావని గుర్తించారు.

వాటికి చేరువలో ఓ వెడల్పాటి రాతిపై ఉన్న గుర్తులను నక్షత్ర çసమూహంలోని సప్తర్షి నక్షత్ర మండలం (ఉర్సామెజర్‌)గా గుర్తించారు. నిలువు రాళ్ల నీడల గమనం ఆధారంగా వాతావరణంలో మార్పులను నాటి మనుషులు గుణించేవారని బృందం నిర్ధారించింది. ప్రపంచంలో రెండు, మూడు ప్రాంతాల్లోనే ఇలాంటి ఏర్పాట్లు ఉన్నట్లు తేల్చింది. ఈ గండ శిలల విషయాన్ని ప్రొఫెసర్‌ పుల్లారావు అంతర్జాతీయ వేదికలపై పంచుకోగా విదేశీ శాస్త్రవేత్తలు ముడుమాల్‌కు వచ్చి ఆ శిలల అధ్యయనం ప్రారంభించారు.

ప్రస్తుతం వాటి చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేసి మరింత ప్రాచుర్యం తీసుకురావడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అధ్యయనానికి అవకాశం కలుగుతుందని విశాలాచ్చి అభిప్రాయపడుతున్నారు. జగిత్యాల జిల్లా పెద్దబొంకూరులోని చారిత్రక ప్రాధాన్యమున్న ప్రాంతంలో 1970లో భూ సేకరణ జరిపారు. ఆ తర్వాత ఇంతకాలానికి భూ సేకరణ జరిపింది ముడుమాల్‌లోనే కావడం విశేషం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top