
పోలీసు క్వార్టర్స్‌లో వ్యభిచారం..?
ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టగా.. ఆ శాఖలోని కొందరి తీరు తలవంపులు తీసుకొస్తోంది.
- మహిళల ఆందోళన
- పారిపోయిన మహిళ, కానిస్టేబుల్
బెల్లంపల్లి : ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టగా.. ఆ శాఖలోని కొందరి తీరు తలవంపులు తీసుకొస్తోంది. పోలీసు క్వార్టర్స్‌లో వ్యభిచారం బుధవారం బెల్లంపల్లిలో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలోని ప్రధాన రహదారి పక్కన నివాసం ఉంటున్న ఓ పోలీసు కానిస్టేబుల్ క్వార్టర్స్‌లో వ్యభిచారం జరుగుతుండగా.. స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేశారు. పట్టపగలు కానిస్టేబుల్ ఓ మహిళను తీసుకుని క్వార్టర్‌కు వచ్చాడు.
విషయం తెలిసి పలువురు మహిళలు వారిని పట్టుకునేందుకు క్వార్టర్ ఎదుట గుమిగూడారు. ఆరుబయట హడావుడి కనిపించడంతో అప్రమత్తమైన సదరు మహిళ, కానిస్టేబుల్ ఇంటి వెనుక వైపు నుంచి గోడ దూకి పారిపోయారు. విషయం తెలియడంతో వన్‌టౌన్ ఎస్సై వేణుగోపాల్‌రావు క్వార్టర్‌కు వచ్చి పరిశీలించారు. పోలీసుస్టేషన్‌కు వెళ్లే రహదారిలో ఉన్న రెండు క్వార్టర్లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఇరుగుపొరుగు మహిళలు తెలిపారు.
పగలు, రాత్రి తేడా లేకుండా మద్యం తాగి, అమ్మాయిలను తీసుకువచ్చి నృత్యాలు చేయిస్తున్నారని ఆరోపించారు. రెండు, మూడు నెలల నుంచి సదరు కానిస్టేబుళ్లు ఇలాగే వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని కోరారు. ఈ సంఘటనపై సీఐ బి.బాలాజీని సంప్రదించగా.. జరిగిన ఘటన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.