Womens Concern
-
ఆందోళన ... మద్యం దుకాణం మూసివేత
ఉలవపాడు: ‘మహమ్మారి మద్యం షాపు బస్టాండ్‌లో వద్దయ్యా ... తమ పిల్లల భవిష్యత్తు పాడవుతుందంటూ’ గత పది రోజులుగా మహిళలు మంగళవారం ప్రదర్శనగా వచ్చి దుకాణాన్ని మూసివేయించారు. మండల కేంద్రమైన ఉలవపాడు పాత బస్టాండ్ సెంటర్లో మంగళవారం ఈ సంఘటన జరిగింది. ఉలవపాడుకు ఈసారి 3వ షాపును కేటాయించారు. దీన్ని పాత బస్టాండ్ సెంటర్లో నిర్మించడంతో తొలినుంచీ స్థానిక మహిళలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన వారు ఇక్కడ నుంచే బస్సులు ఎక్కాలి. విద్యార్థులు కూడా వచ్చీపోతుంటారు. ఇలాంటి ప్రాంతంలో మద్యం షాపేమిటంటూ మూడు రోజుల కిందట ధర్నా చేశారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నతపాఠశాల నుంచి మద్యం షాపు వరకు ప్రదర్శన నిర్వహించారు. తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం షాపు వద్దకు వచ్చి యజమానులతో వాగ్వివాదానికి దిగారు. స్థలం మార్చుకోవాలని కోరినా నిర్వాహకులు వినకపోవడంతో బలవంతంగా షాపును మూసివేయించారు. స్టేషన్లో మహిళల ఫిర్యాదు.... తమతో అసభ్యంగా ప్రవర్తించిననవారిపై మహిళలు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పంచాయితీ తీర్మానం లేకుండా నిర్మించారని, అడిగితే అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదులో ప్రస్తావించారు. ఫిర్యాదు చేసినవారిలో పంచాయతీ వార్డు సభ్యురాలు ప్రభావతి, వాసవీ క్లబ్ మహిళలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు రైతు కూలీసంఘం నాయకులు మోహన్, సురేష్, వాసవీ వనితాక్లబ్ సభ్యులు హేమలత, కుమారి, ప్రసన్న, దళిత నాయకులు దాసరి. వెంకటరావు, బాలకోటయ్య, సతీష్, ఆర్య వైశ్యసంఘం నాయకులు గిరి, బాలాజీ, నారాయణ, సత్యం, బీసీ నాయకులు తన్నీరు. రమణయ్య, మున్వర్‌భాషా తదితరులు పాల్గొన్నారు షాపు జోలికొస్తే పై కేసులు పెడతాం మద్యం షాపు జోలికొస్తే మీ పై కేసులు పెట్టి లోపల వేస్తామని ఎక్సైజ్ ఎస్.ఐ బాలకృష్ణ మహిళలను బెదిరించారు. కలెక్టర్‌తో మాట్లాడుకోండి...ఆమె మార్చమంటే అప్పుడు ఆలోచిస్తామని అన్నారు. -
పోలీసు క్వార్టర్స్‌లో వ్యభిచారం..?
- మహిళల ఆందోళన - పారిపోయిన మహిళ, కానిస్టేబుల్ బెల్లంపల్లి : ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టగా.. ఆ శాఖలోని కొందరి తీరు తలవంపులు తీసుకొస్తోంది. పోలీసు క్వార్టర్స్‌లో వ్యభిచారం బుధవారం బెల్లంపల్లిలో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలోని ప్రధాన రహదారి పక్కన నివాసం ఉంటున్న ఓ పోలీసు కానిస్టేబుల్ క్వార్టర్స్‌లో వ్యభిచారం జరుగుతుండగా.. స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేశారు. పట్టపగలు కానిస్టేబుల్ ఓ మహిళను తీసుకుని క్వార్టర్‌కు వచ్చాడు. విషయం తెలిసి పలువురు మహిళలు వారిని పట్టుకునేందుకు క్వార్టర్ ఎదుట గుమిగూడారు. ఆరుబయట హడావుడి కనిపించడంతో అప్రమత్తమైన సదరు మహిళ, కానిస్టేబుల్ ఇంటి వెనుక వైపు నుంచి గోడ దూకి పారిపోయారు. విషయం తెలియడంతో వన్‌టౌన్ ఎస్సై వేణుగోపాల్‌రావు క్వార్టర్‌కు వచ్చి పరిశీలించారు. పోలీసుస్టేషన్‌కు వెళ్లే రహదారిలో ఉన్న రెండు క్వార్టర్లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఇరుగుపొరుగు మహిళలు తెలిపారు. పగలు, రాత్రి తేడా లేకుండా మద్యం తాగి, అమ్మాయిలను తీసుకువచ్చి నృత్యాలు చేయిస్తున్నారని ఆరోపించారు. రెండు, మూడు నెలల నుంచి సదరు కానిస్టేబుళ్లు ఇలాగే వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని కోరారు. ఈ సంఘటనపై సీఐ బి.బాలాజీని సంప్రదించగా.. జరిగిన ఘటన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
ఖమ్మంఅర్బన్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్:ఓ కేసు విషయంలో అదుపులోకి తీసుకున్న తమ కుటుంబ సభ్యులను తక్షణమే వదిలిపెట్టాలని ఖమ్మం అర్బన్ పోలీస్‌స్టేషన్ ఎదుట వైరా - ఖమ్మం ప్రధాన రహదారిపై గురువారం పలువురు మహిళలు రాస్తారోకో చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. ఖమ్మంనగరంలోని ముస్తఫానగర్ సెంటర్లో ఐదు రోజుల క్రితం ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. అనంతరం ఆటోవాలాలు శ్రీరామ్‌హిల్స్ కాలనీకి వెళ్లి ద్విచక్ర వాహనదారులను తీవ్రంగా కొట్టారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అందుకు బాధ్యులుగా భావిస్తూ 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో సంబంధం లేని పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లు మార్చి తిప్పుతూ హింసిస్తున్నారని ముస్తఫానగర్‌కు చెందిన పలువురు మహిళలు బుధవారం రాత్రి స్టేషన్‌కు వచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో ఎస్సై గణేష్ వారికి సర్ధిచెప్పి గురువారం ఉదయం 10 గంటల వరకు విడిచిపెడతామని హామీ ఇచ్చారు. కానీ వారిని వదలకపోవడంతో గురువారం పలువురు మహిళలు స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ వారిని చూపించాలని వైరా - ఖమ్మం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఎస్సై గణేష్ అక్కడికి చేరుకుని సాయంత్రానికి వారిని వదిలిపెడతామని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు.