ఆందోళన ... మద్యం దుకాణం మూసివేత | Liquor Store Closures | Sakshi
Sakshi News home page

ఆందోళన ... మద్యం దుకాణం మూసివేత

Jul 22 2015 3:09 AM | Updated on Sep 5 2018 8:43 PM

‘మహమ్మారి మద్యం షాపు బస్టాండ్‌లో వద్దయ్యా ... తమ పిల్లల భవిష్యత్తు పాడవుతుందంటూ’ గత పది రోజులుగా

ఉలవపాడు: ‘మహమ్మారి మద్యం షాపు బస్టాండ్‌లో వద్దయ్యా ... తమ పిల్లల భవిష్యత్తు పాడవుతుందంటూ’ గత పది రోజులుగా మహిళలు మంగళవారం ప్రదర్శనగా వచ్చి దుకాణాన్ని మూసివేయించారు. మండల కేంద్రమైన ఉలవపాడు పాత బస్టాండ్ సెంటర్‌లో మంగళవారం ఈ సంఘటన జరిగింది. ఉలవపాడుకు ఈసారి  3వ షాపును కేటాయించారు. దీన్ని పాత బస్టాండ్ సెంటర్లో నిర్మించడంతో  తొలినుంచీ స్థానిక మహిళలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన వారు ఇక్కడ నుంచే బస్సులు ఎక్కాలి. విద్యార్థులు కూడా వచ్చీపోతుంటారు.

ఇలాంటి ప్రాంతంలో మద్యం షాపేమిటంటూ మూడు రోజుల కిందట ధర్నా చేశారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నతపాఠశాల నుంచి మద్యం షాపు వరకు ప్రదర్శన నిర్వహించారు. తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం షాపు వద్దకు వచ్చి యజమానులతో వాగ్వివాదానికి దిగారు. స్థలం మార్చుకోవాలని కోరినా నిర్వాహకులు వినకపోవడంతో బలవంతంగా షాపును మూసివేయించారు.

 స్టేషన్‌లో మహిళల ఫిర్యాదు....
 తమతో అసభ్యంగా ప్రవర్తించిననవారిపై మహిళలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పంచాయితీ తీర్మానం లేకుండా  నిర్మించారని, అడిగితే అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదులో ప్రస్తావించారు. ఫిర్యాదు చేసినవారిలో పంచాయతీ వార్డు సభ్యురాలు ప్రభావతి, వాసవీ క్లబ్ మహిళలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు రైతు కూలీసంఘం నాయకులు మోహన్, సురేష్, వాసవీ వనితాక్లబ్ సభ్యులు హేమలత, కుమారి, ప్రసన్న, దళిత నాయకులు దాసరి. వెంకటరావు, బాలకోటయ్య, సతీష్, ఆర్య వైశ్యసంఘం నాయకులు గిరి, బాలాజీ, నారాయణ, సత్యం, బీసీ నాయకులు తన్నీరు. రమణయ్య, మున్వర్‌భాషా  తదితరులు పాల్గొన్నారు

  షాపు జోలికొస్తే పై కేసులు పెడతాం
 మద్యం షాపు జోలికొస్తే మీ పై కేసులు పెట్టి లోపల వేస్తామని ఎక్సైజ్ ఎస్.ఐ బాలకృష్ణ మహిళలను బెదిరించారు. కలెక్టర్‌తో మాట్లాడుకోండి...ఆమె మార్చమంటే అప్పుడు ఆలోచిస్తామని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement