కరోనా వార్‌... ప్రైవేటు రె‘ఢీ’! | Private Doctors Ready To Fight Against Coronavirus In Hyderabad | Sakshi
Sakshi News home page

కరోనా వార్‌... ప్రైవేటు రె‘ఢీ’!

May 19 2020 6:37 AM | Updated on May 19 2020 6:41 AM

Private Doctors Ready To Fight Against Coronavirus In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌తో పోరాడేందుకు ప్రైవేటు వైద్యులు రె‘ఢీ’ అయ్యారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కరోనా బాధితులకు చికిత్సలు అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా సేవలకు అనుమతి ఇచ్చింది. జనరల్‌ ఫిజీషియన్, పల్మనాలజీ, హృద్రోగ వైద్యుడు, ఎమర్జెన్సీ మెడిసిన్‌ నిపుణులతో పాటు ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డు...అవసరమైన పడకలు, ఐసీయూలో వెంటిలేటర్‌ ఫెసిలిటీ ఉన్న ఆస్పత్రులన్నీ కరోనా పేషెంట్లకు చికిత్సలు చేసే అవకాశం కల్పించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇప్పటికే 39 ఆస్పత్రులు ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసి, 350కిపైగా పడకలను సమ కూర్చాయి. అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపుతున్న విషయం తెలిసిందే. (నగరానికి చేరుకున్నఢిల్లీ స్పెషల్‌ ట్రైన్‌)

ఇప్పటి వరకు ఇవి కేవలం శాంపిల్స్‌ సేకరణకే పరిమితమయ్యాయి. ఇకపై పూర్తిస్థాయి వైద్యసేవలను అందించనున్నాయి. రోగుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్‌లో అదనపు పడకలను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నాయి. అయితే కరోనా చికిత్సలకు ఏ ఆస్పత్రిలో ఎంత ఛార్జీ వసూలు చేయాలి? వంటి అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేవు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు సాధారణ జ్వరాలను కూడా కరోనా ఖాతాలో జమ చేసి..వారి నుంచి భారీగా వసూలు చేసే అవకాశమూ లేకపోలేదు.  (గండిపేట గుట్టల్లో అమెరికా సైక్లిస్ట్‌ మృతి )

ఇతర పేషెంట్లు రారంటూ కొత్త పేచీ 
ఇదిలా ఉంటే కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు మాత్రం కరోనా వైరస్‌తో బాధపడుతున్న రోగులను చేర్చుకునేందుకు సంశయిస్తున్నాయి. ఆస్పత్రిలో కరోనా వైరస్‌ బాధితులకు ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డు, పడకలు ఏర్పాటు చేసినప్పటికీ...సాధారణ రోగులు భయపడే అవకాశం ఉంది. ఆస్పత్రిలో కోవిడ్‌ పేషెంట్లు ఉంటే ..ఇతర పేషెంట్లు ఆస్పత్రికి వచ్చేందుకు వెనుకాడుతుంటారు. దీంతో  కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన రోగులను ఇన్‌పేషెంట్లుగా చేర్చుకునేందుకు వెనుకాడుతున్నట్లు తెలిసింది.  

అదనపు ఖర్చులెలా? 
అంతేకాదు సాధారణ చికిత్సలతో పోలిస్తే కరోనా చికిత్సలు కొంత ఖరీదుతో కూడినవి. సాధారణ జ్వరంతో వచ్చిన పేషెంట్‌కు అయిన ఖర్చుతో పోలిస్తే ..కరోనా బాధితుని చికిత్సల ఖర్చు 20 నుంచి 30 శాతం అదనంగా ఉంటుంది. బిల్లింగ్‌ విషయంలో ఒక్కో ఆస్పత్రి ఒక్కో రకంగా వ్యవహరిస్తుంటాయి. కొన్ని ఆస్పత్రుల్లో ప్రైవేటు హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో చికిత్సకు అవకాశం ఉంది. అయితే ఆయా ఇన్సూరెన్స్‌ సంస్థలు కేవలం మందులు, రూమ్‌ రెంట్, సర్జరీ6 ఛార్జీలే చెల్లిస్తుంటాయి. కరోనా పేషెంట్లకు చికిత్స అందించే వైద్యులు ఇతర సిబ్బంది పీపీఈ కిట్స్‌ తప్పని సరిగా వాడాల్సిందే. ఒక్కో కిట్‌ ధర రూ.వెయ్యికి పైగా ఉంటుంది. ఇలా ఒక్కో రోగికి రోజుకు ఐదు కిట్స్‌ అవసరం అవుతుంటాయి.

వీరు త్వరగా కోలుకోవాలంటే డ్రైఫ్రూట్స్‌ సహా ఇతర పౌష్టికాహారం అందజేయాల్సిందే. సాధారణ భోజనంతో పోలిస్తే ఈ డ్రైఫ్రూట్స్‌ ఖర్చు ఎక్కువ. డిస్పోజల్స్‌ సహా ఫుడ్డ్‌ ఐటెమ్స్‌  ఆరోగ్య బీమా పథకంలో వర్తించవు. ఈ అదనపు ఖర్చులను రోగులే భరించాల్సి ఉంటుంది. కరోనా వైరస్‌ సోకిన బాధితుడికి రెండు వారాల పాటు ఆస్పత్రిలోనే చికిత్స అందించాల్సి ఉంటుంది. రోగి ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జై ఇంటికి వెళ్లే వరకు వైద్యం ఖర్చు తడిసి మోపెడవుతుంది.

ఆరోగ్యశ్రీ, ఇతర లబ్ధిదారులపై స్పష్టత కరువు 
ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి మే 12వ తేదీ వరకు నగరంలో ప్రభుత్వం గుర్తించిన 39 ప్రైవేటు ఆస్పత్రుల్లో (సీవియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్‌–ఎస్‌ఏఆర్‌ఐ) 2601 మంది అనుమానితులు చేరారు. వీరి నుంచి స్వాబ్స్‌ సేకరించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు నిమ్స్‌కు పంపారు. వీరిలో 102 మందికి కరోనా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాజిటివ్‌ వచ్చిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నెగిటివ్‌ వచ్చిన వారిలో ఇతర సమస్యలుంటే...ఇన్‌పేషెంట్లుగా చేర్చుకుని చికిత్సలు అందించారు. ప్రభుత్వం ప్రస్తుతం ఆయా ఆస్పత్రులన్నింటిలోనూ ఇన్‌పేషెంట్‌ చికిత్సలకు అనుమతి ఇచ్చింది.

అయితే కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన తర్వాత ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందాలా? ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలా? అనేది రోగి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ప్రైవేటు ఆస్పత్రులు కూడా రోగి అంగీకారం మేరకే నడుచుకోవాలి. పేద, మధ్య తరగతి రోగులతో పాటు సీహెచ్‌ఎస్, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్, ఇఎస్‌ఐ, ఆర్టీసీ, ఇతర ప్రభుత్వ, అనుబంధ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సలు అందించే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement