నేడు రాష్ట్రపతి రాక

President Ram Nath Kovind Visit Karimnagar - Sakshi

పటిష్టమైన పోలీస్‌ బందోబస్తు

ఆస్పత్రి ఆవరణలో హెలిప్యాడ్‌ నిర్మాణం

భద్రతాసిబ్బంది ఆధీనంలో ఆస్పత్రి

హెలికాప్టర్‌తో ట్రయల్‌ రన్‌ ఏర్పాట్లను పర్యవేక్షించిన సీపీ

కరీంనగర్‌రూరల్‌: రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ శనివారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. కరీంనగర్‌రూరల్‌ మండలం నగునూరులోని ప్రతిమ వైద్య కళాశాలలో నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ మేరకు అధికారులు పటిష్టమైన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భద్రతాసిబ్బంది ఆస్పత్రి, కళాశాల ఆవరణను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని బొల్లారం నుంచి శనివారం ఉదయం 9.40గంటలకు  ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి ఉదయం 10.40కి కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటా రు. కళాశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన ఆడిటోరియంతోపాటు తలసేమియా బాధితుల కోసం ఏర్పాటు చేసిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ కేంద్రాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు.

అనంతరం 10.57 గంటలకు ఆడిటోరియంలోని వేదికపైకి చేరుకుంటారు. పోలీస్‌బ్యాండ్‌మేళం ఆధ్యర్యంలో జాతీయగీతా లాపన అనంతరం 11 గంటలకు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వైద్య కళాశాలలో పలు విభాగాల్లో ప్రతిభ కనబర్చి న ఐదుగురు మెడికల్‌ విద్యార్థులకు బంగారు పతకాలను ప్రదానం చేస్తా రు. ముందుగా మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌.విద్యాసాగర్‌రావు, రాష్ట్ర గవర్నర్‌ ఈసీఎల్‌ నర్సింహన్‌ ప్రసంగించనున్నారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడనున్నారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ పాల్గొంటారని ప్రతిమ వైద్య కళాశాల చైర్మన్‌ బోయినపల్లి శ్రీనివాస్‌రావు తెలిపారు. ఉదయం 11.45గంటలకు కార్యక్రమం ముగిసిన తర్వాత రాష్ట్రపతి తిరిగి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు వెళ్తారు.

పటిష్టమైన పోలీస్‌ బందోబస్తు
రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేసేందుకు కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడురోజులుగా పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డితో కలిసి సం బంధిత అధికారులతో కలెక్టర్‌ ఎప్పటికపుడు ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. కళాశాల ఆవరణలో యుద్ధప్రాతిపదికన నాలుగు హెలిప్యాడ్లను నిర్మించారు. రాష్ట్రపతి భద్రతాసిబ్బంది మూడు రోజులుగా వాయుసేన హెలికాప్టర్‌ ద్వారా ట్రయల్‌రన్‌ నిర్వహిస్తున్నారు. ప్రతిమ ఆసుపత్రిని తమ ఆధీనంలోకి తీసుకుని బందోబస్తు ఏర్పాట్లపై జిల్లా అధికారులకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. కరీంనగర్‌–మంచిర్యాల రహదారి, నగునూరు–మొగ్ధుంపూ ర్‌ రహదారుల్లో ప్రత్యేక పోలీస్‌బృందాలతో నిఘా పెట్టారు. కల్వర్టులను తనీఖీ చేశారు.

హెలిప్యాడ్‌ ఆవరణలోనే బయో మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. వైద్య బృందాలు, అంబులెన్స్, రాష్ట్రపతి బ్లడ్‌గ్రూప్‌ డోనర్లను అందుబాటులో ఉంచారు. ఆడిటోరియంలో సమీపంలో ప్రత్యేక వైద్యబృందం అందుబాటులో ఉంచాలని  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి కలెక్టర్‌ ఆదేశించా రు. ప్రొటోకాల్‌ ప్రకారం బందోబస్తు ఏర్పాటుతోపాటు, జాతీయ గీతం ఆలపించే పోలీస్‌బ్యాండ్‌ను సీపీ ఏర్పాటుచేశారు. విద్యుత్తు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని, 100 కేవీ జనరేటర్‌ను ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌కో అధికారులకు సూచించడంతో అవసరమైన ఏర్పాట్లు చేశారు. సీపీ కమలాసన్‌రెడ్డి, అడిషనల్‌ సీపీ శ్రీనివాస్, అసిస్టెంట్‌ కలెక్టర్‌లు రాజర్షిషా, ప్రావీణ్య కళాశాలలో ఏర్పాట్లపై అధికారులు, ఆసుపత్రి డీన్‌ డాక్టర్‌ వివేకానంద, సీఏవో రాంచందర్‌రావుతో కలిసి పరిశీలించారు. ఆడిటోరియంలోని వేదికను రాష్ట్రపతి భద్రతా అధికారుల సూచనల మేరకు ఏర్పాటు చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top