పట్వారీ పాపం పండింది | Preserved finger caught taking a bribe of Rs 5000 | Sakshi
Sakshi News home page

పట్వారీ పాపం పండింది

Nov 15 2014 3:06 AM | Updated on Aug 17 2018 12:56 PM

పట్వారీ పాపం పండింది - Sakshi

పట్వారీ పాపం పండింది

అవినీతి పట్వారీ పాపం పండింది. బదిలీ అయినా పలుకుబడితో ఉన్న స్థానంలోనే కొనసాగుతూ దందా సాగిస్తున్న అతడి

ఏసీబీ వలలో వీఆర్వో జాకీర్ హుస్సేన్
రూ.5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
సోదాల్లో మరో రూ.5 లక్షలు లభ్యం
అక్రమ ఆస్తులపై     కొనసాగుతున్న ఏసీబీ విచారణ

 
భూపాలపల్లి : అవినీతి పట్వారీ పాపం పండింది. బదిలీ అయినా పలుకుబడితో ఉన్న స్థానంలోనే కొనసాగుతూ దందా సాగిస్తున్న అతడి అవినీతి బాగోతం బయటపడింది. ఇన్నాళ్లు అతడిపై అనేక అవినీతి ఆరోపణలు ఉండగా.. ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించినా ఓ మహిళ ధైర్యం చేసి అతడి ఆగడాలకు అడ్డుకట్ట వేసింది. అసైన్‌‌డ పట్టా కోసం వీఆర్వో ఆమెను లంచం అడగగా ఏసీబీ అధికారులకు పట్టించి రెవెన్యూ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. భూపాలపల్లి పట్టణంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన మండలంలో కలకలం రేపింది. మండలంలోని జంగేడు గ్రామానికి చెందిన పాలిక సమ్మయ్య కోడలు సుగుణకు 2010లో రెవెన్యూ అధికారులు 1.07 గుంటల ప్రభుత్వ భూమిని అసైన్డ్ చేశారు. ఆ అసైన్డ్ పట్టా ఇవ్వాల్సిందిగా వీఆర్వో సయ్యద్ జాకీర్‌హుస్సేన్‌ను ఆమె కోరింది. రూ.10 వేలు లంచం డిమాండ్ చేయగా చివరికి రూ.5 వేలు ఇచ్చేందుకు ఆమె అంగీకరించింది. ఆ డబ్బులు చెల్లించే పరిస్థితి లేక ఆమె తన మామ సమ్మయ్యతో కలిసి వెళ్లి ఏసీబీ అధికారులను ఆశ్రయించింది.

వారి సూచనలతో శుక్రవారం సాయంత్రం సమ్మయ్య పట్టణంలోని వీఆర్వో జాకీర్‌హుస్సేన్‌కు రూ.5 వేలు ఇవ్వగానే సమీపంలో ఉన్న ఏసీబీ అధికారులు వెంటనే జాకీర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఇంటిని సోదా చేయగా బీరువాలో మరో రూ.5 లక్షలు లభించాయి. అయితే ఆ డబ్బులు తన సొంత భూమిని విక్రయించగా వచ్చాయని వీఆర్వో వెల్లడించాడు. ఏసీబీ అధికారులు నగదు మొత్తాన్ని సీజ్ చేసి జాకీర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అతడికి సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. జాకీర్‌పై కేసు నమోదు చేసి, హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్లు డీఎస్పీ సాయిబాబా వెల్లడించారు. డీఎస్పీ వెంట సీఐలు రాఘవేంద్రరావు, శ్రీనివాసరాజు, సిబ్బంది ఉన్నారు.

అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా జాకీర్

వీఆర్వో జాకీర్ అవినీతికి సంబంధించి ఏసీబీ అధికారుల విచారణలో అనేక ఆధారాలు లభించినట్లు సమాచారం. సుమారు 24 ఏళ్లుగా రెవెన్యూశాఖలో అనధికారికంగా, అధికారికంగా పని చేస్తూ భారీగా మామూళ్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 1992 నుంచి 2008 వరకు తన తల్లి వీఆర్వో ఉద్యోగాన్ని తానే చేస్తూ పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. 2008లో వీఆర్వోగా ఉద్యోగం పొంది జంగేడు వీఆర్వోగా బాధ్యతలు స్వీకరించాడు. అప్పటి నుంచి జంగేడుతోపాటు భూపాలపల్లి బాధ్యతలను నిర్వర్తిస్తూ విలువైన సీలింగ్, ప్రభుత్వ భూములకు లక్షలాది రూపాయలకు తీసుకుని పట్టాలు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఇతడి అక్రమాలపై పలుమార్లు స్థానికులు కలెక్టర్, ఆర్డీఓలకు కూడా ఫిర్యాదులు చేశారు.

బదిలీ అయినప్పటికీ..

జాకీర్‌ను జిల్లా అధికారులు  ఏడాది క్రితం శాయంపేట మండలంలోని గట్లకానిపర్తికి బదిలీ చేశారు. అయినా అతడు తన పలుకుబడితో ఆ ఉత్తర్వులను నిలిపి వేయించుకొని ఇక్కడే విధులు నిర్వర్తిస్తూ వస్తున్నాడు. అయితే బదిలీ అయిన వీఆర్వోను రిలీవ్ చేయాలని, ఈ వీఆర్వో మాకొద్దంటూ స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ విద్యార్థి సంఘాలు, పార్టీల నాయకులు పెద్దఎత్తున ఆందోళనలు చేసినా అప్పట్లో ఫలితం లేకుండా పోయింది.  

ఏడాది తర్వాత ఏసీబీ దాడి...

గత ఏడాది నవంబర్ 18న భూపాలపల్లి ఉత్తర అటవీ విభాగం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మాధవరెడ్డి తన క్వార్టర్‌లో ఇసుక ట్రాక్టర్ యజమాని నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ వల వేసి పట్టుకుంది. సరిగ్గా ఆ ఘటన జరిగిన ఏడాదికి వీఆర్వో జాకీర్ పట్టుబడటంతో వివిధ శాఖల్లోని అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
 
వీఆర్వో ఇంటిపై దాడులు

 కాజీపేట : దర్గాకాజీపేటలోని వీఆర్వో సయ్యద్ ఖాజా జాకీర్‌హుస్సేన్ ఇంట్లో శుక్రవారం రాత్రి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సీఐ సాంబయ్యతో కలిసి సిబ్బంది తనిఖీలు చేశారు. దాడుల్లో ఇంట్లో తులాల కొద్ది బంగారం, ఇళ్ల నివేశన స్థలాలకు సంబంధించిన కాగితాలు, కారును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అత్యంత రహస్యంగా తనిఖీలు నిర్వహించి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement