సేవా ప్రపూర్ణ | Sakshi
Sakshi News home page

సేవా ప్రపూర్ణ

Published Sat, Jun 23 2018 9:19 AM

Prapurna Service For Elders And Orphan Child In hyderabad - Sakshi

సోమాజిగూడ: పేదల కష్టాలు చూసి చలించిన ఆమె... వారిని ఆదుకునేందుకు ఆశ్రి సొసైటీ ఏర్పాటు చేసింది. వృద్ధులను చేరదీసి వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తోంది. 25 మంది విద్యార్థులను చేరదీసి ఆశ్రయం కల్పించి, విద్యాబుద్ధులు నేర్పిస్తోంది. ఆమే ప్రపూర్ణ.  

‘మా ఊరు ఖమ్మం దగ్గరి కల్లూరు. ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌లో పట్టా తీసుకున్నాను. చిన్నప్పటి నుంచి సామాజిక అంశాలపై ఆసక్తి ఎక్కువ. నేను స్కూలుకు వెళ్తుంటే కొందరు పిల్లలు మట్టిలో ఆడుకోవడం చూసి, వాళ్లూ నాలా చదువుకుంటే బాగుంటుంది కదా అనిపించేంది. అయితే వారు తినడానికే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక చదువు ఎలా సాగుతుంది? ఆ ఆలోచనలతోనే ఇంటర్‌ తర్వాత హైదరాబాద్‌ వచ్చాను. చదువు కొనసాగిస్తూ, నా ఆలోచనలతో 2014లో ఆశ్రి సొసైటీకి అంకురార్పణ చేశాను’ అని వివరించింది ప్రపూర్ణ.  

25 మందికిచేయూత...
ప్రపూర్ణ 25 మంది పిల్లలను చేరదీసి బొల్లారంలోని ఆశ్రి సొసైటీ హోమ్‌లో ఆశ్రయం కల్పిస్తోంది. వీరి ఆలనాపాలనా మొత్తం చూసుకుంటోంది. స్కూల్‌లో చేర్చి విద్యనందిస్తోంది. రోడ్డుపక్కన ఉండే వృద్ధులను చేరదీసి, అనాథాశ్రమాలకు పంపిస్తోంది. అదే విధంగా ప్రతిఏటా పేద విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు అందజేస్తోంది. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ను వృత్తిగా ఎంచుకున్న ప్రపూర్ణ... ఆ ఆదాయంతోనే ఈ సేవలు చేస్తోంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇదంతా సాధ్యమైందని చెప్పింది. రక్తదానం చేయడమే కాకుండా... ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేలా ప్రోత్సహిస్తోంది. చిన్నతనంలోనే సేవామార్గంలో నడుస్తోన్న ప్రపూర్ణ మరెందరికో ఆదర్శంగా నిలుస్తోంది.  

1/1

Advertisement
Advertisement