విద్యుత్‌ కష్టాలు తీరేనా.?

Power Problems In Adilabad - Sakshi

తరుచూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

అస్తవ్యస్తంగా సబ్‌స్టేషన్ల నిర్వహణ

సబ్‌స్టేషన్లు కొత్తగా నిర్మించినప్పటికీ.. ఆపరేటర్ల నియామకాలు మరిచారు

సాక్షి,ఆదిలాబాద్‌: ఇది ఆదిలాబాద్‌లోని భుక్తాపూర్‌ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌.. ఉమ్మడి జిల్లాలో ఇది పాత సబ్‌స్టేషన్‌. 1970వ సంవత్సరంలో నిర్మించారు. ఇటీవల కాలంలో ఈ సబ్‌స్టేషన్‌ నుంచి సప్లయ్‌ పదేపదే ట్రిప్‌ అవుతుండడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడుతూ వచ్చింది. అయినా దీనిని మెయింటెనెన్స్‌ను అధికారులు మరిచారు. మాటిమాటికి ట్రిప్‌ కావడం సరఫరాలో అంతరాయం సమస్యలకు సంబంధించి ఎవరో ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఆ సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో గత రెండు రోజులుగా భుక్తాపూర్‌ పరిధిలోని విద్యుత్‌ వినియోగదారులకు సరఫరాలో బ్రేక్‌ డౌన్‌ ప్రకటించి యుద్ధప్రతిపాదికన మరమ్మతులు చేపట్టారు. పాత తుప్పుపట్టిన ఎలక్ట్రికల్‌ సామగ్రిని మార్చి కొత్తవి అమర్చారు. సబ్‌స్టేషన్‌ ఆవరణలో గడ్డి తీయించారు. కంచెకు రంగులు దిద్దారు. ఎన్నో రోజుల తర్వాత ఈ సబ్‌స్టేషన్‌ పూర్తి స్థాయి మరమ్మతుకు నోచుకుంది. ఇకనైనా సరఫరాలో ట్రిప్‌ జరగదని వినియోగదారులు ఆశిస్తున్నారు.

నిర్వహణ అస్తవ్యస్తం..
ఉమ్మడి జిల్లాలో 215 సబ్‌ స్టేషన్లు ఉన్నాయి. వీటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రధానంగా తెలంగాణ  ఏర్పడిన తరువాత అనేకం కొత్తవి నిర్మించారు. గత ఐదారు సంవత్సరాలుగా ఆపరేటర్లను నియమించకపోవడంతో  ఉన్నవారిపైనే భారం పడుతోంది. దీంతో సబ్‌స్టేషన్ల నిర్వహణ గందరగోళంగా మారింది. గతంలో వీటి నిర్వహణ కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఆ కాంట్రాక్టర్‌ ఆపరేటర్లను నియమించుకుని సబ్‌స్టేషన్‌ను మెయింటెనెన్స్‌ చేసేవారు. దీంట్లో అక్రమాలు జరుగుతున్నాయని కాంట్రాక్ట్‌ వ్యవస్థను తీసేసి నేరుగా ఆపరేటర్లకు సంస్థే వేతనాలు ఇస్తోంది. రెండు సబ్‌స్టేషన్లకు కలిపి ఏడుగురు ఆపరేటర్లతో నిర్వహణ చేయాలని సంస్థ ఆదేశాలు ఉన్నాయి. ఆ ఏడుగురు కూడా రెండు సబ్‌స్టేషన్లకు అందుబాటులో లేని పరిస్థితి. 8గంటల చొప్పున ఒక ఆపరేటర్‌ విధులు నిర్వహిస్తే  ఈ లెక్కన 24 గంటల్లో ముగ్గురు ఆపరేటర్ల తప్పనిసరి.

అదనంగా ఒక ఆపరేటర్‌ ఉంటే ఎవరైనా ఆపరేటర్‌ సెలవులో ఉంటే సర్ధుబాటు చేసుకునే పరిస్థితి. రెండు సబ్‌స్టేషన్లకు ఏడుగురు ఆపరేట్లతో నిర్వహణ చేస్తుండడంతో వారికి మెయింటెనెన్స్‌ గగనంగా మారింది. కొత్త సబ్‌స్టేషన్లు నిర్మించామని, అదే విధంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు లేకుండా చేశామని గొప్పలు పోతున్న సంస్థ అసలు నిర్వహణ విషయంలో తప్పటడుగు వేస్తోంది. దీంతో పలు సబ్‌స్టేషన్లు నిర్వహణ లేక గాడీ తప్పాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే నిత్యం సరఫరాలో ట్రిప్‌ అయి విద్యుత్‌ అంతరాయాలు కొనసాగుతున్నాయి. కంటిరెప్పపాటు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉండదని చెబుతున్న దానికి క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఆదిలాబాద్‌ పట్టణంలోని భుక్తాపూర్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో శనివారం సబ్‌ స్టేషన్‌ మెయింటెనెన్స్‌లో భాగంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు ముందుగానే ప్రకటించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు అంతరాయం ఉంటుందని అధికారికంగా ప్రకటించి సాయంత్రం 5 గంటలకు సరఫరా పునరుద్ధరించారు. ఆదివారం కూడా ఇలాగే రిపీట్‌ చేశారు. వినియోగదారులు విద్యుత్‌ గోసను అనుభవించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top