నిరుపేద విద్యార్థినికి ఐఐటీ సీటు | Poor Girl Have Got IIT Seat From Hyderabad | Sakshi
Sakshi News home page

నిరుపేద విద్యార్థినికి ఐఐటీ సీటు

Jun 28 2019 7:10 AM | Updated on Jun 28 2019 7:10 AM

Poor Girl Have Got IIT Seat From Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తల్లి వ్యవసాయ కూలీ.. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద కుటుంబం. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ చదువు.. అయినా ఆ విద్యార్థికి తాను బాగా చదువుకోవాలన్న తపన ముందు అవేవీ అడ్డుకాలేదు. బాగా చదువుకొని ఏదైనా సాధించాలన్న తపన, ప్రభుత్వ కాలేజీ లెక్చరర్ల తోడ్పాటు ఆమెను ఐఐటీలో సీటు సాధించేలా చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియెట్‌ చదివిన ఎస్‌.పవిత్రకు ఐఐటీ ధన్‌బాద్‌లో సీటు లభించింది. ఐఐటీ, ఎన్‌ఐటీ , ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు చేపట్టిన ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ సీట్ల కేటా యింపును జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) గురువారం ప్రకటించింది. ఇందులో పవిత్రకు ఐఐటీ ధన్‌బాద్‌లో సీటు లభించింది.

తల్లి ధనలక్ష్మి రోజూ కూలి పనికి వెళ్తూ కూతురు పవిత్రను చదివించింది. పవిత్ర ఎలాంటి కోచింగ్‌ లేకపోయినా కష్టపడి చదువుకొని ఇంటర్మీడియెట్‌లో 936 మార్కులు సాధించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఎస్సీ కేటగిరీలో 2,954 ర్యాంకును సాధించింది. ఐఐటీలో సీటు సాధించిన పవిత్రకు ఆ కాలేజీ ప్రిన్సిపాల్, లెక్చరర్లతోపాటు మధుసూన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement