
కరీంనగర్ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొండగట్టు పర్యటనపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు ఉపసంహరించుకున్న తర్వాతే కొండగట్టులో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. మేడారం జాతర సందర్భంగా కొండగట్టు రద్దీ పెరిగిన నేపథ్యంలో పవన్ పర్యటనకి ఎలా పర్మిషన్ ఇచ్చారన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ కి పవన్ కి మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏంటని ప్రశ్నించారు. పవన్ మొక్కు తీర్చుకోవడానికి వస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పొన్నం పేర్కొన్నారు. కానీ, రాజకీయ మనుగడ కోసం వస్తే ఊరుకోమన్నారు.
ప్రొ. కోదండరాం పర్యటనకు పర్మిషన్ ఇవ్వరు, కానీ, పవన్ పర్యటన చేస్తానంటే ఎలా పర్మిషన్ ఇస్తారని పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. నేరెళ్ల బాధితుల గురించి, తెలంగాణాలో రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడని పవన్ తెలంగాణలో ఎలా అడుగుపెడతాడంటూ పొన్నం ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటుని చీల్చడానికే పవన్ కొండగట్టు వస్తున్నాడన్నారు. తెలంగాణ ఇచ్చిన లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ వస్తే పోలీసులు ఆంక్షలు విధిస్తారు. తెలంగాణాని వ్యతిరేకించిన పవన్ వస్తే రెడ్ కార్పేట్ పరుస్తారా అంటూ పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో ఏపి విభజన విషయంలో జరుగుతున్న అన్యాయాలపైన వైజాగ్ లో దళిత మహిళపై జరిగిన అకృత్యం పై స్పందించిన పవన్ తెలంగాణపై ఎందుకు స్పందించలేదన్నారు. నేరెళ్లలో దళితులపై అరాచకత్వం సృష్టించిన ఘటన దేశాన్నే కదిలించిందని, పవన్ నిన్నెందుకు కదిలించలేదో సమాధానం చెప్పాలి అని పొన్నం డిమాండ్ చేశారు.