‘తెలంగాణ పొద్దు పొడుపును స్వాగతిద్దాం’

పొన్నాల లక్ష్మయ్య(ఫైల్)


హైదరాబాద్: సుధీర్ఘ పోరాటం తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతున్న సందర్భంగా 10 జిల్లాల్లో రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణలో పొద్దుపొడిచే సమయాన్ని ప్రతిఒక్కరూ స్వాగతించాలని బుధవారం ఒక ప్రకటనలో కోరారు. పార్టీ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీ సాయంత్రం నుంచి అన్ని ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, కాగడా ప్రదర్శనలు నిర్వహించాలన్నారు.దీపాలంకరణ, బాణసంచా కాల్చడం ద్వారా తెలంగాణకు ఘనస్వాగతం పలకాలని, అపాయింటెడ్ డే 2వ తేదీన పార్టీ తరుపున ఉత్సవాలు చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామంలో పార్టీ జెండావిష్కరణలు, రక్తదాన శిబిరాలు, వైద్య, ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలన్నారు. పార్టీ నాయకులు, అనుబంధ సంఘాలు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు.

 

జూన్ 2ను అవతరణ దినోత్సవంగా పాటించాలి: తెలంగాణ అడ్వకేట్ జేఏసీ

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం జూన్2న అధికారికంగా అవతరించబోతున్న సందర్భంగా ఏటా ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించుకోవాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నిర్ణయించినట్లు చైర్మన్ ఎం. రాజేందర్ రెడ్డి తెలిపారు. జూన్2న వేడుకల్లో భాగంగా ఉదయం 10 గంటలకు అన్ని కోర్టుల ముందు తెలంగాణ జెండా ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించాలని జేఏసీ తీర్మానించిందన్నారు. జంట నగరాలు, రంగారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులు జెండా ఆవిష్కరణల అనంతరం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top