నిఘా నీడలో..

Police Department Give Security To The Election Centers In Nizamabad - Sakshi

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు 

ప్రతి కదలిక వీడియో రికార్డు  

సమస్యలు సృషించే వారిపై ప్రత్యేక నిఘా

కెమెరాల ఏర్పాటులో పోలీస్‌శాఖ

సాక్షి, కామారెడ్డి: ఓటింగ్‌ ప్రక్రియపై ప్రజలకు నమ్మకాన్ని పెంచడంతోపాటు, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు జిల్లా పోలీస్‌శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఓటర్లలో భద్రతా భావాన్ని పెపొందించేందుకు టెక్నాలజీని వాడుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం జిల్లాలోని అన్ని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఓటింగ్‌ పక్రియ మొత్తాన్ని సీసీ కెమెరాల ద్వారా రికార్డు చేయనున్నారు. అల్లర్లు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా ఉండనుంది. ఎవరైనా సమస్యలు సృష్టిస్తే పూర్తి ఆధారాలతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు ఉపయోగపడనుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు కెమెరాల ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. 

188 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 

ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో గతంలో జరిగిన అల్లర్లు, వివాదాలను బట్టి సమస్యాత్మకంగా గుర్తిస్తారు. అంతేకాకుండా గతంలో నక్సల్స్‌ ప్రభావం ఉన్న గ్రామాలు, ఒకేచోట అధికంగా పోలింగ్‌ స్టేషన్లు ఉన్నట్లయితే ఓటర్ల రద్దీ ఎక్కువగా ఉండే కేంద్రాలను సైతం సమస్యాత్మకంగానే గుర్తించడం జరుగుతుంది. ఈ మేరకు జిల్లాలో మొత్తం 740 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా వాటిలో నుంచి 188 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకంగా పోలీస్‌శాఖ గుర్తించి ఎన్నికల సంఘానికి నివేదించింది. కామారెడ్డి నియోజకవర్గంలో 57, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 74, జుక్కల్‌ నియోజకవర్గంలో 57 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి.

ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో సాధారణంగా ఏర్పాటు చేసే పోలీసు భద్రత కంటే అదనంగా బలగాలను నియమించనున్నారు. ఇప్పటికే భిక్కనూరు మండలంలో 45 పోలింగ్‌ కేంద్రాల వద్ద సరిపడా సీసీ కెమెరాలు ఉన్నాయి. మిగిలిన పోలింగ్‌ కేంద్రాల్లో అవసరమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో పోలీస్‌శాఖ నిమగ్నమైంది. ఎన్నికల ఖర్చులకు సంబంధించిన నిధులతోనే వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాలు ఓటర్లు వచ్చేదారి, ఓటింగ్‌ జరిగే హాలు, బయట వందమీటర్ల మేర దృశ్యాలను కెమెరాలను బంధిస్తాయి.

జిల్లా కేంద్రంలో కెమెరాలకు మరమ్మతులు 

జిల్లా కేంద్రంలో ఏడాది క్రితం ప్రధాన రహదారుల గుండా ఏర్పాటు చేసిన 80 సీసీ కెమెరాలు పెట్టిన నెలరోజులకే చెడిపోయి వృథాగా మారాయి. ఎస్పీ శ్వేత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మున్సిపల్‌ యంత్రాంగంతో మాట్లాడి నిధులు మంజూరయ్యేలా కృషి చేశారు. ఇటీవల నిధులు మంజూరు కాగా కెమెరాల నిర్వహణకు మూడు సంవత్సరాల కాంట్రాక్ట్‌తో మరమ్మతులు పూర్తి చేయించారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాలన్ని అందుబాటులోకి వచ్చాయి. ఎన్నికల నేపథ్యంలో కెమెరాల ఆవశ్యకత ఎంతగానో కనిపిస్తుంది. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top