యుద్ధప్రాతిపదికన ‘కత్తెర’ నివారణ చర్యలు

Pocharam Srinivasa Reddy Command about worm prevention - Sakshi

వ్యవసాయ శాఖ మంత్రి పోచారం ఆదేశం  

‘సాక్షి’కథనానికి స్పందన 

సాక్షి, హైదరాబాద్‌: మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘కత్తెర కాటు’శీర్షికన ఈ నెల 18న ‘సాక్షి’ప్రచురించిన కథనంపై జిల్లా వ్యవసాయాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గతకొద్ది రోజులుగా రాష్ట్రంలో మొక్కజొన్నకు కత్తెర పురుగు సోకినట్లు నివేదికలు వచ్చాయన్నారు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేసి రైతుల్లో అవగాహన తీసుకురావాలని సూచించారు.  కిందిస్థాయిలో రైతులను సమన్వయం చేసుకుని కత్తెర పురుగు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.

కత్తెర పురుగును మన దేశంలో మొదట కర్ణాటకలో గుర్తించారని, ఇప్పుడు వేగంగా నాలుగు రాష్ట్రాలకు వ్యాపించిందని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పి.పార్థసారథి వివరించారు. మొదట మొక్కజొన్నపై ఆశించినా తదుపరి దశలో ఇతర అన్ని రకాల పంటలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని నివారణకు జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల సహకారంతో ఐకార్‌ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి, శాంపిళ్లను సేకరించి బెంగళూరులోని పరిశోధన శాలలకు పంపించినట్లు జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్‌ వి.ప్రవీణ్‌రావు తెలిపారు. దీని నివారణకు ఇయోమెట్‌ బెంజైట్‌ను లీటరుకు 0.4 గ్రాముల చొప్పున ఎకరాకు 80 గ్రాములను సాయంత్రం వేళలో పిచికారి చేయాలని సూచించారు. 

వరదల వల్ల పలుచోట్ల నష్టం.. 
ఇప్పటివరకు రాష్ట్రంలో 26.52 లక్షల మంది రైతులకు చెందిన రైతు బీమా బాండ్ల ముద్రణ, పంపిణీ జరిగిందని మంత్రి పోచారం తెలిపారు.  రాష్ట్రంలో ఇప్పటి వరకు 135 మంది రైతుల మరణాలు నమోదు కాగా, 110 మంది వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేశారన్నారు. వారిలో 107 మంది రైతుల వివరాలను ఎల్‌ఐసీకి పంపగా 75 మంది నామినీ ఖాతాల్లోకి బీమా కవరేజీ రూ.5 లక్షల చొప్పున జమ చేసినట్లు తెలిపారు. ఈ నెల చివరి వరకు వరి పంటకు బీమా గడువు ఉందన్నారు. రాష్ట్రంలో వర్షాకాలం సాగు 86 శాతానికి చేరుకుందని పేర్కొన్నారు.  కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాలో అధిక వర్షాలతో కొంత పంట నష్టం సంభవించినట్లు తెలిసిందన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో వివరాలను సేకరించి తక్షణమే బీమా కంపెనీలకు సమాచారం పంపించాలన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top