తొలి చాన్స్

తొలి చాన్స్ - Sakshi


పదవుల పందేరంలో జిల్లాకు తొలి ప్రాధాన్యం

* ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా పిడమర్తి రవి

* మంత్రివర్గంలో జిల్లా స్థానంపై వీడని సస్పెన్స్


 సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రత్యేక తెలంగాణలో రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవుల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. మంత్రివర్గంలో జిల్లాకు చోటివ్వడానికి ముందే నామినేటెడ్ పదవుల్లో కీలక అవకాశం కల్పించారు. రాష్ట్రస్థాయిలో అత్యంత కీలకమైన షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్‌గాగార్లకు చెందిన పిడమర్తి రవిని  నియమించారు.

 

రవి నియామకంపై హర్షం

జిల్లాకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించడం ఇది రెండోసారి. 1992లో పాలేరు శాసనసభ్యుడు, మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్‌ను అప్పటి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించింది. మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహతో సహా అనేక మంది ప్రముఖులు ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరించారు. అత్యంత కీలకమైన కార్పొరేషన్‌లో ఎస్సీ కార్పొరేషన్ ఒకటి. ఇంతటి కీలక పదవి తెలంగాణ ఉద్యమంలో ఓయూ జేఏసీ కన్వీనర్‌గా క్రీయాశీలకంగా వ్యవహరించిన పిడమర్తి రవికి దక్కడంపై జిల్లావ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రవి జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి పరాజయం పాలయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తూనే జిల్లాతో అనుబంధం పెంచుకున్న రవి రాజకీయ ఎదుగుదలకు ఇదో తొలిమెట్టుగా ఆ పార్టీ జిల్లా నేతలు అభివర్ణిస్తున్నారు.

 

మంత్రి పదవిపై చిగురిస్తున్న ఆశలు

పిడమర్తి రవికి తొలి నామినేటెడ్ పోస్టు దక్కడంతో ఇక మిగిలింది మంత్రి పదవేనని టీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. మంత్రి వర్గంలో జిల్లా నేతకు ఎప్పుడు స్థానం దక్కుతుందోనని ఆ పార్టీతో పాటు జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమశక్తిని చాటిన టీఆర్‌ఎస్ శ్రేణుల సాధక బాధకాలను తీర్చే నాయకుడే కరువయ్యారన్న భావన రవి నియామకంతో కొంత తీరే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.



ఇక పదవుల పందేరానికి కేసీఆర్ శ్రీకారం చుట్టడంతో జిల్లాకు చెందిన అనేకమంది పాత, కొత్త నేతలు నామినేటెడ్ పదవులు పొందేందుకు తమకున్న ప్రత్యేక అర్హతల జాబితాను చేతపట్టుకుని పైరవీలు మొదలుపెట్టారు. రవికి పదవి లభించడంతో తెలంగాణ ఉద్యమానికి ఆది నుంచి అండగా ఉన్నవారు ప్రాధాన్యం కోల్పోలేదనే భావన టీఆర్‌ఎస్ ప్రభుత్వం కల్పించినట్టయింది. ఇక జిల్లాలో ఇప్పుడు అందరి దృష్టి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పైనే నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలు కావస్తున్నా జిల్లాకు మంత్రివర్గంలో చోటు లభించకపోవడంతో పార్టీ వర్గాల్లో కొంత నైరాశ్యం ఏర్పడింది.



టీఆర్‌ఎస్ నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఎన్నికైన జలగం వెంకట్రావుతో పాటు మూడు, నాలుగు నెలల క్రితం ఆ పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల్లో ఒకరికి మంత్రి పదవి దక్కుతుందని ఎప్పటి నుంచో ఊహాగానాలు వస్తున్నాయి. తుమ్మలకు మంత్రి పదవి ఖాయమైందని, ఇక ప్రమాణస్వీకారమే తరువాయి అని గతనెలలో టీఆర్‌ఎస్ శ్రేణులు చేసిన హడావిడి జిల్లాలో చర్చనీయాంశమైంది. తాజాగా మంత్రి వర్గ విస్తరణపై సన్నిహితులతో కేసీఆర్ చర్చలు జరిపారన్న ప్రచారం తుమ్మల అనుచరుల్లో ఆశలు రేకెత్తిస్తోంది.

 

పార్టీ పంథాలో పార్టీ...

జిల్లాలోని వివిధ పార్టీల్లో ఉన్న కీలక నేతలు, వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్ నుంచి వైరా, ఇల్లెందు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన బాణోత్ మదన్‌లాల్, కోరం కనకయ్య టీఆర్‌ఎస్‌లో చేరారు. దీనివల్ల టీఆర్‌ఎస్‌కు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో మూడు స్థానాలు దక్కినట్లయింది.   సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రిపదవి లభించడం ఖాయమని ప్రచారం జరుగుతున్నా టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకత్వం మాత్రం అటువంటి సంకేతాలు ఇవ్వకుండా ఈ పదవులపై ఆశ పెట్టుకున్న వారిని చిన్నబుచ్చకుండా మధ్యేమార్గంగా వ్యవహరిస్తోంది.



సాధ్యమైనంత వరకు వాయిదాల పద్ధతినే పాటిస్తోందని టీఆర్‌ఎస్ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. మరోవైపు రాజకీయ సమీకరణల దృష్ట్యా జిల్లాకు రెండు మంత్రి పదవులు ఇవ్వలేని పక్షంలో కేబినెట్ స్థాయి హోదా కలిగిన మరో కీలక పదవిని జిల్లాకు అప్పగించే అవకాశాన్ని సైతం పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రవికి పదవి దక్కడంతో ఆ పార్టీకి చెందిన బీసీ నేతలు కూడా హైదరాబాద్‌కు క్యూ కట్టారు. జిల్లాలో బీసీ జనాభా ప్రాతిపదికగా తమకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రిని, పార్టీ కీలకనేతలను కలిసి కొందరు నేతలు అభ్యర్థించారు. అయితే కీలకమైన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి జిల్లాను వరించిన దృష్ట్యా మరో రాష్ట్రస్థాయి పోస్టు ఇప్పటికిప్పుడు లభించే అవకాశాలు ఎంత మేరకు ఉంటాయో చెప్పలేమని టీఆర్‌ఎస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఇవన్నీ ఒకెత్తయితే జిల్లా నేతకు మంత్రి పదవి ఇస్తేనే గ్రౌండ్‌లెవల్లోనూ పార్టీ బలం పుంజుకుంటుందనే అభిప్రాయం ఆపార్టీ శ్రేణుల్లో ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top