నిజం.. మీరే నిజాం..!

Photo resemble the royal palace

చౌమొహల్లా ప్యాలెస్‌లో వి‘చిత్రం’    

రాజదర్పాన్ని తలపించే దుస్తుల్లో ఫొటో 

సాక్షి, హైదరాబాద్‌: తలపై రూమీ టోపీ.. పై నుంచి కిందికి షేర్వానీ.. మెడలో అందమైన ఆభరణాలతో రాజదర్పాన్ని తలపిస్తున్న వీరంతా ఆసఫ్‌జాహీ నవాబుల రాజ్యానికి చెందిన వారనుకుంటే పొరపాటే.. ఎందుకంటే వీరంతా సామాన్య పౌరులే.. చౌమొహల్లా ప్యాలెస్‌కు వచ్చిన సందర్శకులే. వీరే కాదు. మీరూ నవాబులా మారొచ్చు..! కొన్ని గంటల పాటు ఆ గెటప్‌లో అందర్నీ ఆకట్టుకోవచ్చు. పడక కుర్చీలో కూర్చొని మంతనాలు సాగించొచ్చు. రాజుగారిలా స్టిల్‌ ఇచ్చి అందర్నీ కట్టిపడేయొచ్చు. జిగేల్మనే దుస్తుల్లో మెరిసిపోవచ్చు.

ఇంతకీ ఇదంతా ఎలా అనుకుంటున్నారు కదా..? అయితే ఇది చదవండి. చౌమొహల్లా ప్యాలెస్‌ చార్మినార్‌ సమీపంలో ఉంది. ఆసఫ్‌జాహీ నవాబుల రాజసానికి, గంభీరానికి ఈ ప్యాలెస్‌ నిలువెత్తు నిదర్శనం. మొగలాయి తర్వాత అంతటి గొప్ప రాజ్యానికి ప్రసిద్ధి. ఈ ప్యాలెస్‌లో నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ నివాసం ఉండేవారు. ఇక్కడ ఆ రోజుల్లో ఉపయోగించిన ఎన్నో ప్రసిద్ధమైన వస్తువులున్నాయి. వాటిని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.

అంతేకాదు ఇక్కడే ఒక ఫొటో స్టూడియో కూడా ఉంది. మిగతా వాటికంటే ఇది భిన్నమైంది. ఇక్కడ కేవలం నిజాం నవాబుల దుస్తుల్లో మాత్రమే ఫొటోలు తీస్తుంటారు. వెల వంద రూపాయలు మాత్రమే. సందర్శన వేళలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు. ఈ ఫొటో స్టూడియోలో అలనాడు నిజాం కుటుంబ సభ్యులు వేసుకున్న దుస్తుల్లాంటివి ఉంటాయి. పురుషులకు షేర్వానీ, పైజామా, రూమీ టోపీ, కుర్తా, కోటుతో పాటు పలు రకాలు దుస్తులు ఇక్కడ ఉంటాయి.

షేర్వానీల్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. మహిళలకు గాగ్రా, చోళీ, దుప్పట్టా తదితర దుస్తులున్నాయి. వీటితో పాటు రకరకాల ఆభరణాలు ఉంటాయి. క్షణాల్లో వీటిని వేసుకోవచ్చు. ప్యాలెస్‌ చూడటానికి వచ్చే వందలాది మంది యాత్రికులు వీటితో రెడీ అయితే అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్‌ క్షణాల్లో ఫొటో తీసి ఇస్తాడు. నలుపు తెలుపులో అలనాటి వైభవాన్ని గుర్తుకుతెచ్చేలా ఉండే ఈ ఫొటోలను చూసి సందర్శకులు మురిసిపోతుంటారు. తమ బంధువులు, మిత్రులకు చూపించి సంతోషాన్ని పంచుకుంటున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top