ఫోన్‌ కొట్టు.. ఓటు పట్టు..

Phone Campaign In Nizamabad For Voters - Sakshi

అభ్యర్థుల ప్రచారంలో భాగంగా ఓటర్లకు ఫోన్‌ కాల్స్‌

సంక్షేమ, అభివృద్ధి పథకాల లబ్ధిదారులే టార్గెట్‌

సాక్షి, ఆర్మూర్‌(నిజామాబాద్‌): హలో.. జ్యోతి గారేనా మాట్లాడేది.. మీకు ఆసరా పథకంలో భాగంగా వితంతు పింఛన్‌ అందుతోందా.. పింఛన్‌ తీసుకోవడంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా.. ఇప్పుడు మీకు నెలకు వెయ్యి రూపాయల పింఛన్‌ వస్తోంది కదా.. టీఆర్‌ఎస్‌కి ఈ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తే నెలకు రెండు వేల 16 రూపాయల పింఛన్‌ వస్తుంది.. కాబట్టి మీరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థికే ఓటు వేయండి అంటూ ఒక మహిళ గొంతు జ్యోతికి వివరించింది.

ఈ విషయం తన కుటుంబ సభ్యులతో పాటు కాలనీవాసులకు చెప్పగా అయ్యో ఇలాంటి ఫోన్లు మా అందరికీ వస్తున్నాయంటూ ఆసరా పథకంలో భాగంగా వృద్ధాప్య పింఛన్, వికలాంగుల పింఛన్, వితంతు పింఛన్, బీడీ కార్మికుల జీవన భృతి పొందుతున్న మహిళలు చర్చించుకుంటున్నారు. రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ సరఫరా అవుతోందా.. ఎకరానికి ఎనిమిది వేల రూపాయల పెట్టుబడి వ్యయం అందిందా.. రైతు బీమా పథకంలో పేరు నమోదు చేయించుకున్నారా తదితర సమాచారాన్ని చేరవేస్తూ ఫోన్లు చేస్తున్నారు.

మరో వైపు కాంగ్రెస్, బీజేపీలు సైతం తాము అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్న పథకాలను సైతం ఓటర్లకు ఫోన్ల ద్వారా వివరిస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ విజయం సాధించేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా సద్వినియోగం చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. నేటి రోజుల్లో సెల్‌ ఫోన్‌ ఉపయోగించని ఓటరు ఉండడన్నది ఎవరూ కాదనలేని నిజం. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఓటర్లను తమకు అనుకూలంగా మల్చుకొనే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రత్యేకంగా కాల్‌ సెంటర్ల వారితో ఒప్పందాలు చేసుకొని తమ నియోజకవర్గాల పరిధిలోని లబ్ధిదారులు, ఓటర్ల ఫోన్‌ నంబర్లను వారికి చేరవేస్తున్నారు.

ఇంకేముంది సదరు కాల్‌ సెంటర్‌ ఉద్యోగులు ఒకటికి పది సార్లు ఓటర్లకు ఫోన్లు చేస్తూ తమ పార్టీ గొప్పతనాన్ని తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి బలాబలాలను ఓటర్లకు వివరిస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు ఒక అడుగు ముందుకు వేసి తనకు ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను విజ్ఞప్తి చేస్తూ వాయిస్‌ రికార్డు చేసి ఫోన్లు చేస్తూ ఆ వాయిస్‌ రికార్డును వినిపిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రచారం నిర్వహిస్తే ఇంటర్నెట్‌ ఉపయోగించే యువకులు, ఉద్యోగులు, చదువుకున్న వారికి మాత్రమే సమాచారం చేరడానికి ఆస్కారం ఉంది.

కానీ ఫోన్‌ చేసి వివరాలు చెపితే సెల్‌ ఫోన్‌ ఉపయోగించే మహిళలు, వృద్ధులు, నిరక్ష్యరాస్యులకు సైతం సమాచారం చేరవేసే ఆస్కారం ఏర్పడుతుంది. ఇది గ్రహించిన అభ్యర్థులు సెల్‌ ఫోన్‌ల ద్వారా ఓటర్లకు ఫోన్లు చేయిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు. దీంతో సోషల్‌ మీడియాతో పాటు కొత్త పుంతలు తొక్కుతున్న ఎన్నికల ప్రచారంపై సెల్‌ ఫోన్లు ఉపయోగించే ప్రతిఒక్కరూ చర్చించుకుంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top