డబ్బులు డబుల్‌ చేస్తామని బురిడీ

Persons  Doing Money Fraud In Nalgonda - Sakshi

రూ.12 లక్షలు తీసుకొని పరారీ 

పోలీసులను ఆశ్రయించిన బాధితుడు       

సాక్షి, చౌటుప్పల్‌: ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు. రెండు వేల నోట్లు రెండిస్తే వాటిని నాలుగు చేస్తానని చెప్పి ఓ వ్యక్తికి నిజంగానే ఇచ్చారు. దాంతో ఆ అమాయకుడికి మరింత ఆశ పుట్టింది. దానిని ఆసరాగా చేసుకున్న నిందితులు ఆ అమాయకుడి నుంచి రూ.12 లక్షలు వసూలు చేసి పరారయ్యారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో చాకచక్యంగా నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు. ఈ సంఘటన చౌటుప్పల్‌ మండలం కైతాపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలను భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి శుక్రవారం మండల కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.  

సూర్యాపేట జిల్లా నాగారం మండలం శాంతినగర్‌ గ్రామానికి చెందిన షేక్‌ సైదా (33) వృత్తి రీత్యా బండరాళ్లు కొట్టి జీవనం సాగిస్తుంటాడు.ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మాచవరం మండలం తుర్కపాలెం(జింకలపాలెం) గ్రామంలో స్థిరపడ్డాడు. ఇదే గ్రామానికే చెందిన షేక్‌ చిన్నవలీ, ప్రకాశం జిల్లా మార్టూరు మండలం వరపల్ల గ్రామానికి చెందిన షేక్‌ బాషా వరసకు అన్నదమ్ములు. వీరిలో షేక్‌ బాషా రకరకాల మోసాలకు పాల్పడుతుంటాడు. చిన్నవలీ ద్వారా షేక్‌ సైదాకు షేక్‌ బాషా పరిచయమయ్యాడు. మీరు పొద్దంతా కష్టపడినా పెద్దగా డబ్బులు రావడంలేదని, తనను నమ్ముకుంటే  తొందరగా డబ్బులు సంపాదించవచ్చని బాషా ఆశ కల్పించాడు.దీంతో ముగ్గురూ ముఠాగా ఏర్పడ్డారు. మొదట కైతాపురం గ్రామంలో మోసాలు చేయడం మొదలు పెట్టారు. 

కైతాపురానికి మార్చిన మకాం..
ముగ్గురు నిందితుల్లో ఒకడైన షేక్‌ సైదా గత రెండేళ్ల క్రితం మండల పరిధిలోని కైతాపురం గ్రామానికి వలస వచ్చాడు. బండరాళ్లు కొడుతూ జీవించాడు. రెండు నెలల క్రితం తుర్కపాలెం వెళ్లిపోయాడు. సులువుగా డబ్బులు సంపాదించాలని భావించాడు. దాంతో షేక్‌ చిన్నవలీ, షేక్‌ బాషాతో కలిసి సైదా ఇటీవల మళ్లీ తిరిగి కైతాపురం వచ్చాడు.  గ్రామంలో ఎవరిని సులువుగా మోసం చేయొచ్చో ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. తనకున్న పాత పరిచయాల ప్రకారం ఓ వ్యక్తిని గుర్తించాడు. 

రెండు నోట్లను నాలుగు చేస్తామని...
నిందితులు కైతాపురం గ్రామానికి చెందిన ఐలయ్య అనే వ్యక్తి ఇంటి వద్దకు వచ్చారు. తమకు రెండు వేల రూపాయల నోట్లు రెండు ఇస్తే వాటిని నాలుగు చేస్తామని, అవి ఎక్కడైనా చెల్లుతాయని నమ్మబలికారు. దీనికి అంగీకరించిన ఐలయ్య తన వద్ద ఉన్న రెండు రెండు వేల రూపాయల నోట్లను వారికి ఇచ్చాడు. ఇంట్లోని వేరే గదిలోకి వెళ్లి కొన్ని రకాల రసాయన ద్రావణాలు నోట్లపై వేయాల్సి ఉందని చెప్పి నిందితులు లోనికి వెళ్లారు. కొంత సేపటి తర్వాత బయటకు వచ్చి నాలుగు నోట్లను ఐలయ్యకు ఇచ్చారు. దాంతో ఐలయ్య మరుసటి రోజు ఆ నాలుగు నోట్లను తీసుకొని చౌటుప్పల్‌లోని ఓ బ్యాంకులోని తన ఖాతాలో వేశాడు. దాంతో అవి ఎకౌంట్‌లో జమయ్యాయి. అనంతరం ఐలయ్య నిందితుల మాట నిజమని నమ్మాడు.  

రూ. 12 లక్షల సేకరణ  
రెండు నోట్లను నాలుగు చేయడంతో ఐలయ్యకు ఆశ ఎక్కువైంది. దాంతో నిందితులు 30 నుంచి 40 లక్షల రూపాయలు తీసుకొస్తే వాటిని రెండింతలు చేస్తామని ఐలయ్యకు చెప్పారు. పూర్తిగా రెండు వేల నోట్లే తేవాలని సూచించారు. సరేనన్న ఐలయ్య బంధువులు, మిత్రుల వద్ద రూ.12 లక్షలు సేకరించి నిందితులకు సమాచారం అందించాడు. దాంతో వారు ఈనెల 21న ఐలయ్య ఇంటికి వచ్చారు. రూ. 12 లక్షలు తీసుకొని ఇంట్లోని వేరే గదిలోకి వెళ్లారు. నగదు తీసుకొని రెండు వేల నోటు సైజులో ఉన్న నల్ల రంగుకాగితాలను మరో బ్యాగులో చుట్టి ఇచ్చారు. రసాయన ద్రావణాలు వేసినందున బ్యాగులోని కట్టలను రెండు రోజుల తర్వాత తెరవాలని సూచించి వెళ్లిపోయారు. కానీ ఐలయ్య మరుసటి రోజే బ్యాగును తెరిచిచూశాడు. బ్యాగులో ఉన్న కాగితాలను చూసి నెత్తీనోరు కొట్టుకున్నాడు. మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.  

అదుపులోకి తీసుకున్న పోలీసులు 
బాధితుడు ఐలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల స్వగ్రామాలపై నిఘా పెట్టారు. ఇవేమీ తెలియని నిందితుల్లో ఒకడైన షేక్‌ సైదా ఈనెల 27న రాత్రి 10 గంటల సమయంలో చౌటుప్పల్‌ మండలంలోని వలిగొండ రోడ్డు వద్ద బస్సు దిగాడు. రాత్రి వేళలో పెట్రోలింగ్‌ నిర్వహించే పోలీసులు అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మరింతగా విచారించగా చేసిన మోసం ఒప్పుకున్నాడు. ఇతని వద్ద 12 లక్షల రూపాయల నగదు, నల్లరంగు పూసిన కాగితాలు స్వాధీనం చేసుకున్నారు. షేక్‌ బాషా, షేక్‌ చిన్నవలీలు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు నిర్వహిస్తున్నామని డీసీపీ తెలిపారు. కేసులో చురుకుగా పని చేసిన హెడ్‌కానిస్టేబుల్‌ నర్సింహ, హోంగార్డు ఊడుగు సైదులును అభినందించారు. ఈ సమావేశంలో ఏసీపీ సత్తయ్య, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.         

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top