కరెంటు కోతలకు నిరసనగా ధర్నా | peoples suffers with the power shortage | Sakshi
Sakshi News home page

కరెంటు కోతలకు నిరసనగా ధర్నా

Oct 11 2014 3:02 AM | Updated on Sep 18 2018 8:28 PM

బంగారు తెలంగాణ నిర్మిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, కరెంటు కోతలతో ప్రజలను అగచాట్లపాలు చేస్తోందని న్యూడెమోక్రసీ జిల్లా కార్యాదర్శి పోటు రంగారావు విమర్శించారు.

ఖమ్మం: బంగారు తెలంగాణ నిర్మిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, కరెంటు కోతలతో ప్రజలను అగచాట్లపాలు చేస్తోందని న్యూడెమోక్రసీ జిల్లా కార్యాదర్శి పోటు రంగారావు విమర్శించారు. కరెంటు కోతలను నిరసిస్తూ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మంలో ర్యాలీ, మామిళ్ళగూడెంలోని ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ధర్నానుద్దేశించి పోటు రంగారావు మాట్లాడుతూ.. కరెంట్ కోతలను నివారించకపోతే కేసీఆర్ ప్రభుత్వ పతనం తప్పదని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కష్టాలు తీరుతాయని ప్రజలంతా భావించారని, కానీ వారికి కేసీఆర్ ప్రభుత్వం మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టిందని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలవుతున్నా ప్రజల బాగోగులను కేసీఆర్ పట్టించుకోవడం లేదని, మాటలతో కాలం వెళ్లబుచ్చుతున్నారని విమర్శించారు. సకాలంలో వర్షాలు కరువకపోవడంతో రైతులు సాగు కోసం బావులు, బోర్లపై ఆధారపడ్డారని అన్నారు. విద్యుత్ కోతలతో మోటార్లు పనిచేయక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వేల రూపాయల అప్పులు తెచ్చి పంట పెట్టుబడులకు పెట్టిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యుత్ సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గం చూడాలని, రైతుల పంటలను కాపాడాలని కోరారు. అనంతరం, ఎస్‌ఈ తిరుమలరావుకు నాయకులు వినతిపత్రమిచ్చారు. ఎస్‌ఈ మాట్లాడుతూ.. ప్రజల వినియోగానికి అవసరమైన విద్యుత్తు మన రాష్ట్రంలో ఉత్పత్తవడం లేదని, తప్పని పరిస్థితుల్లోనే విద్యుత్ కోతలు విధించాల్సి వస్తున్నదని అన్నారు.కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆవులు వెంకటేశ్వర్లు, గుర్రం అచ్చయ్య, జి.రామయ్య, శివలింగం, అర్జున్‌రావు, మలీదు వెంకటేశ్వరావు, రాజేంద్రప్రసాద్, రామమూర్తి, కొయ్యడ శ్రీనివాస్, లాల్ మియా, జగన్, ఆడెపు రామారావు, మంగతాయా, మందా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement