breaking news
potu rangarao
-
కరెంటు కోతలకు నిరసనగా ధర్నా
ఖమ్మం: బంగారు తెలంగాణ నిర్మిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, కరెంటు కోతలతో ప్రజలను అగచాట్లపాలు చేస్తోందని న్యూడెమోక్రసీ జిల్లా కార్యాదర్శి పోటు రంగారావు విమర్శించారు. కరెంటు కోతలను నిరసిస్తూ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మంలో ర్యాలీ, మామిళ్ళగూడెంలోని ట్రాన్స్‌కో ఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ధర్నానుద్దేశించి పోటు రంగారావు మాట్లాడుతూ.. కరెంట్ కోతలను నివారించకపోతే కేసీఆర్ ప్రభుత్వ పతనం తప్పదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కష్టాలు తీరుతాయని ప్రజలంతా భావించారని, కానీ వారికి కేసీఆర్ ప్రభుత్వం మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టిందని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలవుతున్నా ప్రజల బాగోగులను కేసీఆర్ పట్టించుకోవడం లేదని, మాటలతో కాలం వెళ్లబుచ్చుతున్నారని విమర్శించారు. సకాలంలో వర్షాలు కరువకపోవడంతో రైతులు సాగు కోసం బావులు, బోర్లపై ఆధారపడ్డారని అన్నారు. విద్యుత్ కోతలతో మోటార్లు పనిచేయక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వేల రూపాయల అప్పులు తెచ్చి పంట పెట్టుబడులకు పెట్టిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యుత్ సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గం చూడాలని, రైతుల పంటలను కాపాడాలని కోరారు. అనంతరం, ఎస్ఈ తిరుమలరావుకు నాయకులు వినతిపత్రమిచ్చారు. ఎస్ఈ మాట్లాడుతూ.. ప్రజల వినియోగానికి అవసరమైన విద్యుత్తు మన రాష్ట్రంలో ఉత్పత్తవడం లేదని, తప్పని పరిస్థితుల్లోనే విద్యుత్ కోతలు విధించాల్సి వస్తున్నదని అన్నారు.కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆవులు వెంకటేశ్వర్లు, గుర్రం అచ్చయ్య, జి.రామయ్య, శివలింగం, అర్జున్‌రావు, మలీదు వెంకటేశ్వరావు, రాజేంద్రప్రసాద్, రామమూర్తి, కొయ్యడ శ్రీనివాస్, లాల్ మియా, జగన్, ఆడెపు రామారావు, మంగతాయా, మందా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఆర్డినెన్స్‌ను అడ్డుకునేందుకు...
వేలేరుపాడు, న్యూస్‌లైన్: పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్‌ను అడ్డుకునేందుకు ఆదివాసీలంతా కొమరం భీం మాదిరిగా పోరాడాలని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా వేలేరుపాడు మండలంలోని మారుమూలనున్న కొయిదాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం జరిగిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటైన సభలో పోటు రంగారావు మాట్లాడుతూ.. ఆంధ్రాలోని బడా పారిశ్రామికవేత్తల స్వప్రయోజనాల కోసం ఇక్కడి ఆదివాసీలను ప్రధాని మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నీట ముంచుతున్నారని ధ్వజమెత్తారు. విలీనంపై పార్లమెంటులో, అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరపకపోవడం వెనుక ఏపీ పెద్దల కుట్ర ఉందన్నారు. ఆర్డినెన్స్ రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దశల వారీగా ఆందోళన చేపట్టనున్నట్టు చెప్పారు. జూన్ 2వ తేదీన ముంపు మండలాల్లో బ్లాక్ డే జరపనున్నట్టు చెప్పారు. 20 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర కొయిదాలో శనివారం ప్రారంభమైన పాదయాత్ర రాత్రికి 20 కిలోమీటర్ల దూరంలోగల కన్నాయిగుట్టకు చేరింది. ఈ పాదయాత్రకు గిరిజన గ్రామాల్లో విశేష స్పందన లభించింది. మేడేపల్లి నుంచి మరో బృందం ప్రారంభించిన పాదయాత్ర మల్లారం వరకు సాగింది. ఈ పాదయాత్రలో న్యూడెమోక్రసీ నాయకులు ఎస్కె.గౌస్, గోకినేపల్లి వెంకటేశ్వరావు, సీపీఐ అశ్వారావుపేట నియోజకవర్గ కన్వీనర్ ఎండి.మునీర్, వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ కేసగాని శ్రీనివాస గౌడ్, వివిధ పార్టీల నాయకులు కారం దారయ్య, అమరవరపు అశోక్, ఎస్కె.నజీర్, వలపర్ల రాములు, గిల్లా వెంకటేశ్వర్లు, పూరెం లక్ష్మయ్య, గడ్డాల ముత్యాల్రావు తదితరులు పాల్గొన్నారు.