బడ్జెట్‌ రైలు ఆగేనా ?

People Hope Justice For Railway Budget In Warangal - Sakshi

నేడు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్

రైల్వేల పరంగా కేటాయింపుల కోసం జిల్లావాసుల ఎదురుచూపులు

వ్యాగన్‌ షెడ్, డివిజన్, మూడో లేన్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తుందని ఆకాంక్ష 

సాక్షి, కాజీపేట : కేంద్రంలో ప్రవేశపెట్టె బడ్జెట్‌లో రైల్వే పరంగా ఈసారైనా న్యాయం జరిగేనా అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కాజీపేట జంక్షన్‌కు న్యాయం జరగాలని జిల్లా ప్రజలు, రైల్వే కార్మికులు ఆకాంక్షిస్తున్నారు. నిజాం రైల్వే కాలంలో 1094లో ఏర్పాటైన కాజీపేట దినాదినాభివృద్ధి చెంది కాజీపేట జంక్షన్‌గా ఏర్పడి ఇప్పుడు దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు గేట్‌వేగా విలసిల్లుతోంది. అయితే, గతంలో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్లు, ఇప్పుడు ఉమ్మడిగా ప్రవేశపెడుతున్న సాధారణ బడ్జెట్లకు సంబంధించి ఏటా నిరాశే ఎదురవుతోంది. ఈసారైనా కాజీపేట జంక్షన్‌ పరిధిలో పెండింగ్‌లో ఉన్న యూనిట్ల నిర్మాణం, రైల్వే లైన్ల నిర్మాణంతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి అడుగులు పడుతాయని భావిస్తున్నారు.

ఫిట్‌లైన్‌ నుండి కొత్త రైళ్లు
కాజీపేటలో రూ.15 కోట్ల వ్యయంతో నిర్మాణమవుతున్న ఫిట్‌లైన్‌ పనులను త్వరగా పూర్తి చేసి కాజీపేట కేంద్రంగా కొత్త రైళ్లు ప్రారంభించాలని జిల్లా వాసులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే జరిగితే కాజీపేట జంక్షన్‌ నుంచి ముంబై, తిరుపతి, సికింద్రాబాద్‌ రూట్లలో కొత్త రైళ్లను ఇక్కడి నుంచే ప్రారంభించవచ్చు. తద్వారా కార్మికుల సంఖ్య పెరగడంతో పాటు కొత్తగా రైల్వే కార్యాలయాలు వస్తాయి.

మూడో లేన్‌
కాజీపేట జంక్షన్‌ మీదుగా బల్లార్షా – విజయవాడ వరకు నిర్మాణంలో ఉన్న మూడో రైల్వే లైన్‌ను పూర్తి చేసేందుకు ఈసారి బడ్జెట్‌లో పూర్తి స్థాయి కేటాయింపులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ లేన్‌ పూర్తయితే అయితే న్యూఢిల్లీ, విజయవాడ, హైదరాబాద్‌ మార్గాల్లో ట్రాఫిక్‌ తగ్గిపోతుంది. అలాగే, ఆలస్యాన్ని నివారించచ్చు.

వడ్డేపల్లి చెరువు కట్లపై రైల్వే లైన్‌
కాజీపేట వడ్డేపల్లి చెరువు కట్టపై 200 మీటర్ల మేర సర్వే అయిన రేల్‌ అండర్‌ రైల్‌ లైన్‌ నిర్మాణం, కాజీపేట – బల్లార్షా వరకు సర్వే అయిన నాలుగో లేన్‌ నిర్మాణానికి బడ్జెట్‌ కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. సర్వే పూర్తయిన మణుగూరు – రామగుండం లేన్‌కు నిధులు, ఘన్‌పూర్‌ – సూర్యాపేట వరకు వయా పాలకుర్తి, కొడకండ్ల మీదుగా సర్వే అయిన లేన్‌ నిర్మాణానికి ఈ బడ్జెట్‌లో నిధులు మంజూరు చేయాలని, భూపాలపల్లి రైల్వే లేన్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారని జిల్లా ప్రజలు గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు.

కొత్త రైళ్లు, రైళ్ల పొడిగింపు
కాజీపేట జంక్షన్‌ మీదుగా ఈసారి బడ్జెట్‌లో కొత్త రైళ్లు ఉంటాయా, లేదా అనే చర్చ సాగుతోంది. ఇంకా పద్మావతి ఎక్స్‌ప్రెస్, కరీంనగర్‌ – తిరుపతి ఎక్స్‌ప్రెస్, షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లను డెయిలీగా మార్చాలనే డిమాండ్‌ ఉంది. అంతేకాకుండా కాజీపేట జంక్షన్‌ మీదుగా వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్టింగ్‌ కల్పిస్తూ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

డివిజన్‌ కల నెరవేరేనా?
1904 సంవత్సరంలో ఏర్పాటైన కాజీపేట రైల్వే స్టేషన్‌ 115 ఏళ్ల ప్రస్థానంలో డివిజన్‌ కేంద్రంగా ఏర్పాటు కావాలనేది జిల్లా ప్రజలు, ఇక్కడ పని చేస్తున్న కార్మికుల చిరకాల కోరిక. ఇది ఈసారి బడ్జెట్‌లో నెరవేరుతుందని అనుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్‌ను డివిజన్‌గా అప్‌గ్రేడ్‌ చేసినా కాజీపేట జంక్షన్‌ను చేయకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. డివిజన్‌ ఏర్పాటైతే ఈ ప్రాంత అభివృద్దితో పాటు కొత్త రైల్వే పరిశ్రమలు వస్తాయి. పాలన అందరి చెంతకు చేరుతుంది. కొత్త రైళ్లను ఇక్కడకు ప్రారంభించేందుకు వెసలుబాటు కలుగుతుంది. డివిజన్‌ స్థాయి రైల్వే భవనాలు, అధికారులు వస్తారు. 

వ్యాగన్‌ పీఓహెచ్‌ షెడ్‌
కాజీపేట కేంద్రంగా పదేళ్ల క్రితం మంజూరైన రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమ.. ఆ తర్వాత దీని స్థానంలో మంజూరైన వ్యాగన్‌ పీరియాడికల్‌ ఓవరాలింగ్‌ షెడ్‌(పీఓహెచ్‌ షెడ్‌) నిర్మాణానికి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈసారైనా ఇవి తొలగిపోయి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని, శంకుస్థాపన జరుగుతుం దని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. వ్యాగన్‌ పీఓహెచ్‌ షెడ్‌ వస్తే కాజీపేట అభివృద్ధి చెందడమే కాకుండా ప్రాధాన్యత పెరుగుతుంది. కొంత మేరకు నిరుద్యోగం తగ్గుతుంది. దీనికి తోడు అనుబంధంగా చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటవుతాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top