ఏటీఎంలో డబ్బుల్లేవ్‌ !

People Facing Problems With No Cash In ATM Centres - Sakshi

ఎక్కడ చూసినా నో క్యాష్‌ 

ఖాళీగా దర్శనమిస్తున్న వైనం  

పండగపూట ప్రజలకు తప్పని ఇక్కట్లు

చుంచుపల్లి: ఆధునిక సేవలు విస్తరిస్తున్నా అదే తరహాలో వినియోగదారులకు సేవలందించడంలో పలు బ్యాంకులు విఫలమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఏటీఎం కేంద్రాలలో తగినంత నగదును అందుబాటులో ఉంచలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా వినియోగదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెంలోనే పరిస్థితి ఇలా ఉంటే..మారుమూల ప్రాంతాల పరిస్థితి మరీ అధ్వానం. ప్రధాన ఏటీఎం కేంద్రాలలో రెండు రోజులుగా నగదు కొరత వినియోగదారులను వేధిస్తోంది. పండగ పూట ఏటీఎం కేంద్రాలు ఖాళీగా దర్శనమిస్తుండడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. దసరాకు చేతిలో డబ్బు లేక  అనేక ఇబ్బందులు పడుతున్నారు. పైగా రోజువారి విత్‌ డ్రా పరిమితిని ఇటీవల మరింతగా తగ్గించడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

జిల్లా కేంద్రంలో ప్రస్తుతం వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు చెందిన సుమారు 25  ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 114 ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో చాలావరకు సక్రమంగా పనిచేయడం లేదు. దాదాపు 70 శాతం ఏటీఎంలలో నగదు కొరత ఉంది. కొత్త నోట్లు మార్కెట్లోకి వచ్చాయనే కారణంతో చాలా ఏటీఎం కేంద్రాలను మూసి ఉంచుతున్నారు. ముఖ్యం గా ప్రతినెల మొదటి వారంలో ఏ ఏటీఎంలో చూసినా పనిచేయడం లేదని, ఔట్‌ ఆఫ్‌ సర్వీస్‌ అనే బోర్డులు దర్శనమిస్తుంటాయి. ఈ సమయంలో వివిధ రకాల ఉద్యోగులు, పింఛన్‌దారులు డబ్బులు డ్రా చేయడానికి నానా తంటాలు పడుతుం టారు. దూర ప్రాంతాల నుంచి వివిధ అవసరాల నిమిత్తం పట్టణానికి వచ్చేవారి ఇబ్బందులు వర్ణనాతీతం. చాలామంది జేబులో డబ్బులు ఎక్కువగా లేకున్నా.. ఏటీఎం కార్డు ఉందనే ధైర్యంతో బయటకు వెళుతున్నారు. అయితే ఏటీఎం కేంద్రాలు పనిచేయకపోవడంతో చేతిలో డబ్బులు లేక పండగ పూట ఏం చేయాలో.. తెలియక వినియోగదారులు నిరాశకు లోనవుతున్నారు. 

బ్యాంకుల ఆంక్షలతో అవస్థలు.. 
ఓ వైపు ఏటీఎంలలో డబ్బులు లేక.. మరోవైపు బ్యాంకుల ఆంక్షలతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఒక బ్యాంకుకు చెందిన ఏటీఎం కార్డు మరో బ్యాంకు ఏటీఎం కేంద్రంలో వినియోగించడానికి పరిమితులను నిర్దేశించారు. నెలలో 3 సార్లు మాత్రమే  వాటిని ఉపయోగించుకోవచ్చు. అది కూడా పరిమిత మొత్తంలోనే నగదు తీసుకోవాల్సి ఉంటుంది. అంతకు మించితే ఫైన్‌ వసూలు చేస్తున్నారు. ప్రతీ నెలా ఇదే సమస్య ఏర్పడుతోందని పలువురు వినియోగదారులు వాపోతున్నారు. బ్యాంకు అధికారులకు చెప్పినా సరైన స్పందన లేదని అంటున్నారు. ఇక అక్టోబర్‌ 1 నుంచి విత్‌డ్రా పరిమితిని రూ. 20 వేలకు తగ్గించడంతో తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోందని చెపుతున్నారు.  ఇప్పటికైనా బ్యాంకు అధికారులు స్పందించి ఏటీఎం కేంద్రాలలో తగినంత నగదు నిల్వ ఉండేలా చర్య తీసుకోవాలని కోరుతున్నారు.  

అన్ని ఏటీఎంలు తిరిగినా ఫలితం లేదు 
నగదు డ్రా చేయడానికి పట్టణంలోని అన్ని ఏటీఎంల వద్దకు వెళ్లాను. ఎక్కడ చూసినా డబ్బులు లేవు. కొన్ని చోట్ల ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. బ్యాంకు అధికారులు వినియోగదారుల ఇబ్బందులను గ్రహించి నగదు ఉండేలా చర్యలు తీసుకోవాలి. -ఎం.కోటేశ్వరరావు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top