ఇందిరమ్మ ఇళ్ల బకాయిల చెల్లింపు! | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్ల బకాయిల చెల్లింపు!

Published Fri, Mar 23 2018 3:06 AM

Payment of Indirama's house dues! - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల బకాయిలను చెల్లించాలని నిర్ణయించినట్లు గృహనిర్మాణ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శాసనసభలో గృహ నిర్మాణ శాఖ వార్షిక బడ్జెట్‌ పద్దులపై గురువారం జరిగిన చర్చలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. రాష్ట్ర ఆవిర్భావం నాటికి అసంపూర్తిగా మిగిలిన 4,12,218 ఇందిరమ్మ గృహాలకు బిల్లులు చెల్లించాల్సి ఉండగా వీటిలో అర్హులైన లబ్ధిదారులకే బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. అర్హుల గుర్తింపు కోసం సర్వే నిర్వహించగా 2,09,012 గృహాల లబ్ధిదారులు అర్హులని, మరో 1,29,633 మంది లబ్ధిదారులు అనర్హులని తేలిందన్నారు.

మిగిలిన 73,573 గృహాల సర్వే పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. ఇప్పటివరకు అర్హులకు రూ.396.63 కోట్లు చెల్లించామని, మరో రూ.1133.55 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. బీసీల స్థితిగతులపై బీసీ కమిషన్‌ నివేదిక రాగానే ఎంబీసీలకు స్వయం ఉపాధి పథకాల కింద రాయితీ రుణాలను పంపిణీ చేస్తామన్నారు. ఏపీలోని 23 బీసీ కులాలను బీసీ జాబితాలో చేర్చే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకున్నవారికి అందించే రూ.10 వేల ప్రోత్సాహకాన్ని పెంచే ప్రతిపాదనను సైతం ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement