అభ్యర్థుల పోటా పోటీ

Parties Candidates Compitition In Nizamabad - Sakshi

రసవత్తరంగా ఉమ్మడి జిల్లా ఎన్నికల పోరు 

మూడు నియోజకవర్గాల్లో నువ్వా.. నేనా.. 

ఆరు స్థానాల్లో త్రిముఖ పోటీ.. 

బరిలో 91 మంది అభ్యర్థులు  

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో బరిలో ఉండే అభ్యర్థులెవరో తేలింది. ఆయా నియోజకవర్గాల్లో పోటీ ఏయే పార్టీల మధ్య ఉంటుందనే స్పష్టత వచ్చింది. జిల్లాలో తొమ్మిది స్థానాల్లో మూడు నియోజకవర్గాల్లో నువ్వా.. నేనా.. అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఆరు స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీలకు దీటుగా ఆరు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గట్టి పోటీని ఇస్తున్నారు. జిల్లాలో తొమ్మిది స్థానాలకు మొత్తం 119 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్, బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోగా ఆయా పార్టీల అభ్యర్థులకు రెబల్స్‌ బెడద లేకుండా పోయింది. దీంతో ఆయా స్థానాల్లో నెలకొనే పోటీపై స్పష్టత వచ్చినట్లయిం ది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 91 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, తాజామాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, కాంగ్రెస్‌ అభ్యర్థి, డీసీసీ అధ్యక్షులు తాహెర్‌బీన్‌హందాన్‌లు నువ్వానేనా అన్నట్లుగా పోటీ     పడుతున్నారు. అనూహ్యంగా బీజేపీ తిరుగుబాటు అభ్యర్థి ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్త పోటీ నుంచి తప్పుకోవడంతో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ కూడా ఈ నియోజకవర్గంలో గట్టి         పోటీనిస్తున్నారు. 

నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం రణం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు బాజిరెడ్డి గోవర్ధన్, డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డి, గడ్డం కేశ్‌పల్లి ఆనందర్‌రెడ్డిల మధ్య త్రిముఖ పోటీ            నెలకొంది. ముగ్గురు అభ్యర్థులు కూడా హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తుండటంతో రూరల్‌ రణరంగాన్ని తలపిస్తోంది. 

⇔బోధన్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులు షకీల్‌ ఆమేర్, పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డిల మధ్య పోరు రసవత్తరంగా మారింది. పోలింగ్‌ దగ్గరపడుతున్న కొద్దీ ఇద్దరు అభ్యర్థులు కూడా గెలుపు కోసం             ఎత్తుకు పైఎత్తులు వేస్తుండటంతో ఈ నియోజకవర్గంలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. 

ఆర్మూర్‌లో త్రిముఖ పోరు కొనసాగుతోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఆకుల లలిత మధ్య హోరాహోరీ నెలకొంది. బీజేపీ అభ్యర్థులు పొద్దుటూరి వినయ్‌ కుమార్‌రెడ్డిలు         కూడా గట్టి పోటీని ఇస్తున్నారు. గెలుపు కోసం ఎవరికి వారే పావులు కదుపుతున్నారు. 

బాల్కొండలో ద్విముఖ పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి ఈరవత్రి అనీల్‌లు గెలుపుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ బీఎస్పీ అభ్యర్థిగా బరిలో          ఉన్న ముత్యాల సునీల్‌రెడ్డి తన సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.  

కామారెడ్డి నియోజకవర్గంలో ప్రధానంగా మూడు పార్టీల అభ్యర్థులు బలంగా ఉండటంతో ఈ నియోజకవర్గం పోరు రసవత్తరంగా తయారైంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంప గోవర్ధన్, కాంగ్రెస్‌ అభ్యర్థి                  షబ్బీర్‌అలీ, బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డిలు తమ గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు.  

ఎల్లారెడ్డిలో మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి నల్లమడుగు సురేందర్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా                 అధ్యక్షులు బాణాల లక్ష్మారెడ్డి బరిలో ఉండటంతో ఇక్కడ పోరు జోరందుకుంది. 

బాన్సువాడలో ద్విముఖ పోటీ ఉంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి కాసుల బాలరాజుల మధ్య పోరు సాగుతోంది.  

జుక్కల్‌లో ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి హన్మంత్‌షిండే, కాంగ్రెస్‌ అభ్యర్థి సౌదాగర్‌ గంగారాంలు సై అంటే సై అంటున్నారు.        కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన అరుణతార బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.  

పలు స్థానాల్లో బీఎల్‌ఎఫ్, బీఎస్పీ అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారం నిర్వహిస్తుండగా, ఆమ్‌ఆద్మీ, పిరమిడ్‌పార్టీ ఆఫ్‌ ఇండియా, సమాజ్‌వాది పార్టీ, శివసేన, అంబేద్కర్‌ నేషనల్‌         కాంగ్రెస్, ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ వంటి పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top