చరమాంకంలో చక్కని ‘కేర్‌’

Palliative care throughout the state - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా పాలియేటివ్‌ కేర్‌

జీవిత చరమాంకంలో వైద్యసేవలకు సర్కారు పచ్చజెండా 

రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టు సక్సెస్‌ 

ఎన్‌హెచ్‌ఎం కింద ముందుకెళ్లేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం 

జబ్బులతో బాధపడే వారికి చివరి దశలో సాంత్వనే పాలియేటివ్‌ కేర్‌ 

బాధితుల ఇంటికెళ్లి సేవలందించే డాక్టర్, ఫిజియోథెరపిస్టు, నర్స్‌ 

ఇప్పటికే ప్రజల ఆరోగ్య రికార్డు సేకరణకు క్షేత్రస్థాయిలో కార్యాచరణ 

సాక్షి, హైదరాబాద్‌: వయోవృద్ధులు జీవిత చరమాంకంలో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయోగాత్మకంగా ప్రారంభించిన వైద్యసేవల కార్యక్రమానికి ప్రజల్లో మంచిస్పందన కనిపించడంతో.. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. తుదిశ్వాస వరకూ నొప్పి, బాధ తెలియకుండా సంతోషంగా గడిపేందుకు అవసరమైన సపర్యలు చేయడాన్ని వైద్య పరిభాషలో ‘పాలియేటివ్‌ కేర్‌’గా పిలుస్తారు. పాశ్చాత్య దేశాల్లో ఎప్పటినుంచో ఇది అమలవుతోంది. ఖర్చుతో కూడుకున్న విషయం కావడంతో ఈ సేవలను పొందడం అందరికీ సాధ్యం కాదు. దీంతో చాలామంది అంతిమ దశలో బాధను, వ్యథను అనుభవిస్తూ తనువుచాలిస్తారు. ఆసుపత్రికి వెళ్లలేక. అవసరమైన కనీస సేవలందక నొప్పితోనే చనిపోతుంటారు. ఇలాంటి వారికి అవసరమైన వైద్య సేవలు, మందులు అందించగలిగితే వారి జీవిత కాలాన్ని పొడిగించడంతోపాటు, నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగించొచ్చు. ఈ ఉద్దేశంతోనే కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కార్యక్రమం కింద దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, మంచాన పడ్డవారికి వారి ఇంటికే వెళ్లి సేవలందించాలని నిర్ణయించారు.  

హెల్త్‌ రికార్డుల నమోదులో ఆశ వర్కర్లు 
కేరళలో ఈ తరహా సేవలు కొనసాగుతుండగా, మన రాష్ట్రంలోనూ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. పైలట్‌ ప్రాజెక్టుగా మన రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఈ సేవలను ఇప్పటికే ప్రారంభించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి మంచి ఆదరణ లభించింది. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 30 ఏళ్లకు పైబడిన వారికి ఆరోగ్య పరీక్షలు చేస్తూ వివరాలను నమోదు చేస్తున్నారు. అలాగే ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? మంచాన పడ్డవారు, తమ పనులు తాము చేసుకోలేనివారు ఎవరైనా ఉన్నారా అని కూడా ఆశ వర్కర్లు ఆరా తీస్తున్నారు. అలాంటి వారి వివరాలు తీసుకుని ఏఎన్‌ఎంలకు సమాచారమిస్తారు. ఏఎన్‌ఎంలు రోగి ఇంటికి వెళ్లి ‘పాలియేటివ్‌ కేర్‌’అవసరమా? లేదా? అవసరమైతే ఎలాంటి సేవలు అవసరమన్న సమాచారం సేకరించి మెడికల్‌ ఆఫీసర్‌కు నివేదిస్తారు. డాక్టర్‌ వెళ్లి ఆ రోగికి అవసరమైన వైద్య పరీక్షలు చేయడంతోపాటు సదరు రోగికి ఎలా వైద్యం చేయాలన్న దానిపై కుటుంబ సభ్యులకు శిక్షణ ఇస్తారు. అవసరాన్ని బట్టి వారానికి ఒకట్రెండు సార్లు.. లేదా రెండ్రోజులకోసారి రోగి ఇంటికి వైద్య బృందం (డాక్టర్, ఫిజియోథెరపిస్ట్, నర్సు) వెళ్లి సపర్యలు చేస్తుంది. నొప్పి నివారణ, రోగ నియంత్రణ మందులు ఇస్తారు. రోగి మానసిక ఉల్లాసానికి అవసరమైన కౌన్సెలింగ్, వైద్య సేవలు అందిస్తారు. ఇంట్లో సేవలు అందించలేని పరిస్థితి ఉంటే సమీప ప్రభుత్వ దవాఖానలో ‘పాలియేటివ్‌ కేర్‌’వార్డుల్లో ఉంచి సపర్యలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. 

రాష్ట్రమంతటా విస్తరణ 
ఆదిలాబాద్, సిద్దిపేట, ఖమ్మం, వరంగల్‌ (రూరల్‌), జనగాం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, యాదాద్రి జిల్లాల్లో ప్రస్తుతం పాలియేటివ్‌ సేవలు ప్రారంభించారు. జిల్లాకు ప్రత్యేక వైద్య బృందాన్ని, ఓ వాహనాన్ని కేటాయించారు. వైద్య బృందం,     రోజూ కనీసం 12 మంది రోగుల ఇంటికి వెళ్లి    సేవలు చేయాల్సి ఉంటుంది. ఈ 8 జిల్లాల్లో ఇంటింటి సర్వే ద్వారా ఇప్పటివరకూ 1,860 మంది రోగులను గుర్తించారు. వీరుకాకుండా మరో 981 మందిని ఇన్‌ పేషెంట్లుగా చేర్చుకుని పాలియేటివ్‌ సేవలందిస్తున్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించేందుకు ఆరోగ్యశాఖ సిద్ధమవుతోంది. స్టాఫ్‌ నర్సులు, ఫిజియోథెరపిస్టులకు  ఇప్పటికే అవసరమైన శిక్షణ కూడా ఇచ్చారు. చిన్న పిల్లలకు ప్రత్యేక వార్డులు ఉన్నట్టుగానే,  త్వరలోనే జిల్లా ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేయనున్నారు. నిమ్స్‌లోనూ వృద్ధుల కోసం (జెరియాట్రిక్‌) ప్రత్యేక వార్డు సిద్ధం చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top