
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది పి.సుగుణాకర్‌రావును పార్టీ తరపున పోటీలో నిలపాలని నిర్ణయించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఆయనకు బీఫాం కూడా అందజేసినట్లు ఆయ న వెల్లడించారు. రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల పట్ల, నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి బలమైన అభ్యర్థి సుగుణాకర్‌రావుతో పోటీ చేయిస్తున్నామన్నారు. విద్యావంతులు తమ మొదటి ప్రాధాన్య ఓటును సుగుణాకర్‌రావుకు వేసి గెలిపించాలని కోరారు.
స్వతంత్రులుగా రణజిత్ మోహన్, రవి!
బీజేపీ రాష్ట్ర నాయక త్వం మొదటి నుంచీ సుగుణాకర్‌రావును పోటీలో నిలపా లని శ్రద్ధ చూపుతున్న నేప థ్యంలో పార్టీనే నమ్ముకుని, ఉద్యోగాన్ని వదులుకుని పనిచేస్తున్న తనకు పార్టీ మద్దతు ఇవ్వాలని రణజిత్ మోహన్ పట్టుబట్టారు. ఎడ్ల రవి కూడా తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ వర్గాలను కోరారు. రణజిత్‌మోహన్ ఆర్‌ఎస్‌ఎస్ వర్గాల నుంచి కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు కోసం పార్టీ వర్గాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నించారు. కానీ పార్టీ గురు వారం బీఫాంను సుగుణాకర్‌రావుకు ఇవ్వడం తో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని రణజిత్‌మోహన్ ప్రకటించారు. మరోవైపు ఎడ్ల రవి కూడా బరిలో నిలిచే అవకాశముంది.