
మరో నలుగురికి తప్పిన ప్రమాదం
వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగతో దుర్ఘటన
పాములపాడు: వన్యప్రాణుల కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ ఉచ్చుకు తగిలి ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచర్ మృతి చెందగా.. మరో నలుగురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ దుర్ఘటన నంద్యాల మండలం పాములపాడు మండలం బానకచెర్ల గ్రామ సమీపంలోని అడవిలో ఆదివారం జరిగింది. అటవీ అధికారుల కథనం మేరకు.. ఈ నెల 18న రాత్రి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ప్రొటెక్షన్ వాచర్లు రాముడు, రాంభూపాల్, విజయ్‌కుమార్, అరుణ్‌కుమార్, లక్ష్మణ్‌నాయక్ విధుల్లో భాగంగా వాహనంలో బయల్దేరారు.
రోడ్డు పక్కన అడవిలో చెట్ల పక్కన ఒక ద్విచక్ర వాహనం కనిపించడంతో అనుమానం వచ్చి అడవిలోకి వెళ్లి చూశారు. దారిలో వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ ఉచ్చు తగలి ప్రొటెక్షన్ వాచర్ లక్ష్మణ్‌నాయక్ (54) కిందపడ్డాడు. మిగతా వారు వస్తుండగా ‘విద్యుత్ ఉంది.. రావొద్దు’ అంటూ కేక వేసి కుప్పకూలిపోయాడు. అప్పటికే ఇద్దరికి స్వల్పంగా తీగ తగిలింది. లక్ష్మణ్‌నాయక్‌ను వెంటనే ఆత్మకూరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
వాహనంపై టీడీపీ ఎంపీ శబరి ఫొటో స్టిక్కర్
ఘటనా స్థలంలో లభించిన ద్విచక్ర వాహనం నంద్యాల జిల్లా మిడుతూరు మండలం తలముడిపికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. వాహనంపై టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఫొటోతో కూడిన స్టిక్కర్ అతికించి ఉంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, అటవీ అధికారులు వేటగాళ్లు ఏర్పాటు చేసిన తీగను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.