పదిమంది మెచ్చేలా!

Overcoming personal problems and talent in the tenth class results - Sakshi

సమస్యలకు ఎదురొడ్డి పోరాడారు..

ఇబ్బందులను అధిగమించి భేష్‌ అనిపించుకున్నారు 

పదోతరగతి ఫలితాల్లో ‘ప్రభుత్వ’విద్యార్థుల ప్రతిభ

ఈ విద్యార్థులు నిజంగా మట్టిలో మాణిక్యాలే. వ్యక్తిగత సమస్యలను అధిగమించి పదో తరగతి ఫలితాల్లో ప్రతిభను కనబరిచారు.  పట్టుదలతో చదివి ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు నిలుస్తాయని నిరూపించారు. అలాంటి విద్యార్థుల్లో అంగ వైకల్యాన్ని అధిగమించి ఫలితాలను సాధించినవారు ఒకరైతే.. తల్లిదండ్రులు లేకపోయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగిన వారు మరొకరు. తండ్రి లేకపోయినా ఎంతో కష్టపడి తల్లి చదివించిన చదువులో ఉత్తీర్ణులైన వారు మరొకరు. ఇలా ప్రభుత్వ మోడల్‌ స్కూళ్లు, విద్యా శాఖ గురుకులాల్లో నిరుపేద కుటుంబాల విద్యార్థులు ప్రతిభ చాటారని మోడల్‌ స్కూల్స్‌ డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి ప్రశంసించారు.     – సాక్షి, హైదరాబాద్‌

వైకల్యాన్ని జయించిన విజయలక్ష్మి 
పుట్టుకతోనే మూగ, చెవిటితనం ఉన్నా విద్యలో మాత్రం రాణిస్తూ ముం దుకెళ్తోంది. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుల సైగలను గమనిస్తూ సబ్జెక్టులను అర్థం చేసుకుని పదో తరగతిలో 8.5జీపీఏ సాధించింది. ఆరో తరగతి నుం చి జిన్నారం మోడల్‌ స్కూల్లో చదువుకుంది. పుట్టుక నుంచే సెరబ్రల్‌ పాల్సీతో బాధపడుతున్న వర్ష ముందు వైకల్యమే తలవం చింది. జక్రాన్‌పల్లిలోని మోడల్‌ స్కూల్‌ లో చదువుకున్న వర్ష.. టెన్త్‌ ఫలితాల్లో 9.3 జీపీఏ సాధించింది. తండ్రి గీత కార్మికుడు. వైకల్యం, పేదరికాన్ని అధిగమించి పట్టుదలతో లక్ష్యం వైపు అడుగులేసింది. 

తల్లిదండ్రుల్లేకపోయినా..
జక్రాన్‌పల్లి మోడల్‌ స్కూల్లో చదువుతున్న బి.మయూరికి తల్లిదండ్రులు లేరు. అయినా లక్ష్య సాధనలో ముందుకు సాగింది. పట్టుదలతో చదువుకుని 9.7 జీపీఏ సాధించింది. అమ్మమ్మ, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో తన లక్ష్యాన్ని సాధించానంటోంది మయూరి. 

తల్లి కష్టానికి ప్రతిఫలం.. 
శాలిగౌరారం మోడల్‌ స్కూల్లో చదువుకున్న గీతాంజలి 10 జీపీఏ సాధించింది. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి వెంకటమ్మ కాయకష్టం చేసి కూతురిని చదివించింది. తల్లి ప్రోత్సాహంతో కటిక పేదరికంలోనూ లక్ష్య సాధనలో వెనుకంజ వేయకుండా తన ప్రతిభను నిరూపించుకుంది. 

ఆటోవాలా కూతురు.. 
శంకరపల్లి మోడల్‌ స్కూల్లో చదువుకున్న షేక్‌ నాజియా తండ్రి అఫ్జల్‌ పాషా ఆటో డ్రైవర్‌. ఆరుగురు ఆడపిల్లల్లో మూడో అమ్మాయి. పేదరికంలోనూ షేక్‌ నాజియా శ్రమించి 10 జీపీఏ సాధించి అందరి మన్ననలు పొందుతోంది. 

ఇబ్బందులను అధిగమించి..
భువనగిరి యాదాద్రి జిల్లాకు చెందిన లారీ డ్రైవర్‌ కుమారుడు ఎ.శివకుమార్‌ పదో తరగతి ఫలితాల్లో 10 జీపీఏ సాధించాడు. రోడ్డు ప్రమాదంలో తన తండ్రి వెన్నెముక దెబ్బతినడంతో తల్లి కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో చదివి 10 జీపీఏ సాధించాడు. 

తల్లిదండ్రులు  కూలీలైనా.. 
ఇటిక్యాల మోడల్‌ స్కూల్లో చదువుకున్న గడ్డం కృతిక 10 జీపీఏ సాధించింది. ఆమె తండ్రి నారాయణరెడ్డి వ్యవసాయ కూలి. తల్లి బీడీ కార్మికురాలు. బంధువుల ఇంట్లో ఉండి రోజూ 7 కిలోమీటర్ల దూరం వెళ్లి ఉపాధ్యాయుల సలహాలు, సూచనలతో పదో తరగతిలో తన ప్రతిభను నిరూపించుకుంది. కాగా, నిరుపేద కుటుంబానికి చెందిన ఎస్‌.దీప పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 10 జీపీఏ సాధించింది. తాండూరు గురుకుల పాఠశాలలో దీప చదువుకుంది. దీప ఇంట్లో 7వ సంతానం.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top