ఆన్‌లైన్‌.. ఆలస్యం  

online problems for indiramma housing  - Sakshi

ఏడాదిగా సా....గుతున్న వివరాల నమోదు  

ఐదుగురినే కేటాయించడంతో ప్రక్రియలో జాప్యం 

‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు తప్పని ఎదురుచూపులు 

బిల్లుల కోసం ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇంకా ఎదురుచూపులు తప్పడంలేదు. వైఎస్‌ హయాంలో ఈ పథకం ప్రారంభించగా.. ‘డబుల్‌’ ఇళ్ల రాకతో బిల్లులు నిలిచిపోయాయి. ఆందోళన చెందిన లబ్ధిదారులు అధికారులను వేడుకోవడంతో ప్రభుత్వం తహసీల్దార్లతో సర్వే చేయించింది.  ఆ వివరాల ఆన్‌లైన్‌.. జాప్యం జరుగుతోంది. ఫలితంగా చెల్లింపు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.

సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ప్రతీ నిరుపేదకు సొంత ఇల్లు ఉండాలనే సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టారు. దశలవారీగా ఇళ్లకు సంబంధించిన బిల్లులు విడుదల చేసేవారు.  ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేసింది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల విడుదల నిలిచిపోయింది. దీంతో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు ఆందోళనకు గురయ్యారు. అప్పులు చేసి మరీ ఇళ్లను నిర్మించుకున్నామని, ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నామని, ఇప్పుడు బిల్లులు నిలిపిస్తే  తమ పరిస్థితి ఏమిటని అధికారు యంత్రాంగం చుట్టూ తిరిగి విన్నవించుకున్నారు. స్పందించిన ప్రభుత్వం అర్హులైన వారిని గుర్తించేందుకు తహసీల్దార్లతో సర్వే చేపట్టింది.  

నివేదిక ఇచ్చి ఏడాది..  
2008వ సంవత్సరం నుంచి 2015 వరకు ఇందిరమ్మ పథకం కింద 6,724మంది నిర్మాణాలు వివిధ దశల్లో పూర్తి చేసుకుంటున్నారు. అయితే వాటికి సంబంధించిన బిల్లులు లబ్ధిదారులకు అందలేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, కొంతమంది అసలు ఇళ్లను నిర్మించకుండానే బిల్లులు తీసుకున్నారనే ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో అర్హులను గుర్తించేందుకు తహసీల్దార్లతో విచారణ చేయించారు. బృందాలుగా ఏర్పడిన తహసీల్దార్లు గ్రామాల్లో విచారణ చేపట్టారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఆ వివరాలను కలెక్టరేట్‌కు పంపించారు. విచారణ పూర్తయి సుమారు ఏడాది కావస్తున్నా ఆన్‌లైన్‌లో జాప్యం కారణంగా లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.  

నత్తనడకన ఆన్‌లైన్‌.. 
ఇందిరమ్మ లబ్ధిదారుల ఆన్‌లైన్‌ అంశం ఎప్పటికప్పుడు ఆలస్యమవుతోంది. తహసీల్దార్లు విచారణ నివేదికను కలెక్టరేట్‌కు పంపించిన ఏడాది కావొస్తోంది. అయినా ఆన్‌లైన్‌ చేయటంలో మాత్రం జాప్యం జరుగుతోంది. ఇప్పటికే ఆలస్యమవడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాల కోసం తెచ్చుకున్న అప్పులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 6,724మంది ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్నారు. వాటిలో 1,874కు సంబంధించి ఆన్‌లైన్‌ కాగా, వారికి సంబం«ధించిన రూ.2.06కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. మిగిలిన  4,845మంది లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు ఇంకా ఆన్‌లైన్‌ కాలేదు. సిబ్బంది కొరత కారణంగా ఆన్‌లైన్‌ చేయడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం ఐదుగురు ఉద్యోగులు మాత్రమే ఈ ఆన్‌లైన్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. దీంతో వివరాల నమోదు, నత్తనడకన సాగుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top