కువైట్‌లో ఏడాదిగా బందీ

One year captive in Kuwait - Sakshi

కోరుట్ల వాసి నరకయాతన 

సీఎం కేసీఆర్‌కు సెల్ఫీ వీడియో 

స్వదేశానికి రప్పించాలని వినతి

కోరుట్ల: ‘నేను ఏ నేరం చేయలేదు.. నాకు సంబంధం లేకుండా జరిగిన తప్పునకు కంపెనీ పని నుంచి తొలగించి నాపై కేసు పెట్టింది. వారం రోజులు జైలులో పెట్టారు. ఆ తరువాత జైలు నుంచి విడుదల చేసి ఏడాదిగా ఓ గదిలో బంధించారు. తిండి తిప్పలు లేక అవస్థలు పడుతున్న. అయ్యా.. కేసీఆర్, కేటీఆర్‌ సార్లు.. నా మీద దయచూపండి. నన్ను స్వదేశానికి రిప్పంచండి.’ఇదీ కువైట్‌లో ఓ నేరంలో ఇరుక్కున్న కోరుట్ల వాసి నారాయణ దీన పరిస్థితి. తన ఆవేదనను సెల్ఫీ వీడియో తీసి పంపడంతో రెండు రోజుల నుంచి ఈ వీడియో వైరల్‌ అవుతోంది. 

ఇరవై ఏళ్లుగా కువైట్‌కు.. 
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వంగరి నారాయణ సుమారు ఇరవై ఏళ్లుగా కువైట్‌కు వెళ్లి వస్తున్నాడు. అక్కడ కేజీఎల్‌ అనే కంపెనీలో వ్యాన్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ వ్యాన్‌ ద్వారా కేజీఎల్‌ కంపెనీ వారు డబ్బులను కువైట్‌లోని ఓ బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు పంపుతారు. 20 ఏళ్లుగా అదే కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న నారాయణ..  2018 జులై 26వ తేదీన విధుల్లో భాగంగా మరో ఇద్దరితో కలసి (నేపాల్, పిలిప్పీన్స్‌కు చెందిన వ్యక్తులు) ఎప్పటిలాగే కంపెనీ వ్యాన్‌ నడుపుతున్నాడు. మధ్యా హ్నం అకస్మాత్తుగా డబ్బు లు తీసుకెళ్లే వ్యాన్‌ పాడైంది. సాయంత్రం వేళ కంపెనీకి చేరాడు. కంపెనీ వారు డబ్బులు లెక్కింపు చూసుకోగా.. 1.90 లక్షల దినార్లు (ఇండియా కరెన్సీలో సుమారు రూ.4 కోట్లు) తేడా వచ్చింది. కంపెనీవారి ఫిర్యాదు మేరకు పోలీసులు నారాయణతోపాటు వ్యాన్‌లో పనిచేస్తున్న మరో ఇద్దరిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు.  తరువాత కేజీఎల్‌ కంపెనీకి అప్పగించారు. 

నా భర్తను రప్పించండి
ఇరవై ఏళ్లుగా ఒకే కంపెనీలో నమ్మకంగా పనిచేస్తున్న నా భర్తపై అకారణంగా కేసు పెట్టారు ఇండియాకు రాలేక నానా అవస్థలు పడుతున్నాడు.  దయచేసి సీఎం కేసీఆర్, కేటీఆర్, ఎంపీ అరవింద్‌లు కలసి నా భర్తను ఇండియాకు రప్పించండి.     
– వంగరి పద్మ, కోరుట్ల 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top